స్టీల్‌ప్లాంటుకు పచ్చజెండా
ABN , Publish Date - Sep 28 , 2025 | 12:56 AM
ప్రపంచంలోనే ఉక్కు తయారీ సంస్థల్లో అగ్రగామిగా గుర్తింపు పొందిన ఆర్సెల్లార్ మిట్టల్, నిప్పన్ స్టీల్ కంపెనీలు నక్కపల్లి మండలంలోని కారిడార్ భూముల్లో నిర్మించనున్న భారీ ఉక్కు పరిశ్రమకు స్థానికులు పచ్చజెండా ఊపారు. శనివారం చందనాడ శివారు పాటిమీద గ్రామంలో స్టీల్‌ప్లాంటు ఏర్పాటుకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. కూటమి, ప్రతిపక్ష, వామపక్ష పార్టీల నాయకులంతా అభివృద్ధి అంశంలో ఇటువంటి పరిశ్రమల ఏర్పాటును స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంటు నిర్మాణ దశ నుంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో స్థానికులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో పలు పరిశ్రమలకు సంబంధించి జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ఆందోళనలు, వ్యతిరేకతలు ఎదురుకావడంతో పోలీస్ యంత్రాంగం స్టీల్‌ప్లాంటు ప్రజాభిప్రాయ సేకరణ కోసం భారీ ఏర్పాట్లు చేసింది. అయితే ఎటువంటి వ్యతిరేకత లేకుండా సజావుగా జరగడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
- సజావుగా ఆర్సెల్లార్ మిట్టల్, నిప్పన్ స్టీల్‌ప్లాంటు ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ
- అన్ని పార్టీల నాయకులు అనుకూలం
- స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్
నక్కపల్లి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోనే ఉక్కు తయారీ సంస్థల్లో అగ్రగామిగా గుర్తింపు పొందిన ఆర్సెల్లార్ మిట్టల్, నిప్పన్ స్టీల్ కంపెనీలు నక్కపల్లి మండలంలోని కారిడార్ భూముల్లో నిర్మించనున్న భారీ ఉక్కు పరిశ్రమకు స్థానికులు పచ్చజెండా ఊపారు. శనివారం చందనాడ శివారు పాటిమీద గ్రామంలో స్టీల్‌ప్లాంటు ఏర్పాటుకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. కూటమి, ప్రతిపక్ష, వామపక్ష పార్టీల నాయకులంతా అభివృద్ధి అంశంలో ఇటువంటి పరిశ్రమల ఏర్పాటును స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంటు నిర్మాణ దశ నుంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో స్థానికులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో పలు పరిశ్రమలకు సంబంధించి జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ఆందోళనలు, వ్యతిరేకతలు ఎదురుకావడంతో పోలీస్ యంత్రాంగం స్టీల్‌ప్లాంటు ప్రజాభిప్రాయ సేకరణ కోసం భారీ ఏర్పాట్లు చేసింది. అయితే ఎటువంటి వ్యతిరేకత లేకుండా సజావుగా జరగడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
నక్కపల్లి మండలంలో ఆర్సెల్లార్ మిట్టల్, నిప్పన్ స్టీల్ కంపెనీలు సంయుక్తంగా నిర్మించనున్న భారీ ఉక్కు పరిశ్రమకు సంబంధించి చందనాడ శివారు పాటిమీద గ్రామంలో శనివారం జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధ్యక్షత పర్యావరణం, కాలుష్య నియంత్రణ అంశాలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించారు. పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. డీఎస్పీ పి.శ్రీనివాసరావు, సీఐలు, ఎస్‌ఐలు సుమారు 400 మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తుకు నియమించారు. ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభమయ్యే సరికి గ్యాలరీలన్నీ నిండిపోయాయి. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఎం నాయకులంతా భూములిచ్చిన రైతులకు పూర్తి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ముందుగా ఆర్సెల్లార్ మిట్టల్, నిప్పన్ స్టీల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేశ్, టీడీపీ నియోజకవర్గం కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేశ్, టీడీనీ నక్కపల్లి మండలశాఖ అధ్యక్షుడు గింజాల లక్ష్మణరావు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత చొరవ వల్లే ప్రధాని మోదీ నక్కపల్లి మండలానికి స్టీల్‌ప్లాంటును మంజూరు చేశారని చెప్పారు.
ఫలించిన పోలీసుల వ్యూహం
సాధారణంగా పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరిపేటప్పుడు ఏ ప్రభుత్వం వున్నా సరే ప్రతిపక్ష పార్టీల నాయకులను పోలీసులు గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులు చేస్తుంటారు. ఇటీవల బల్క్ డ్రగ్ పార్కు ప్రజాభిప్రాయ సేకరణకు కూడా సీపీఎం, వైసీపీ నాయకులను గృహ నిర్బంధం చేయడంతో సర్వత్రా విమర్శలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కానీ ఈసారి పోలీస్ యంత్రాంగం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. వైసీపీ, సీపీఎం నాయకులను గృహ నిర్బంధం చేయకుండా వారంతా ప్రజాభిప్రాయ సేకరణ వేదిక వద్దకు వచ్చేందుకు పోలీసులు ఎటువంటి ఆంక్షలు విధించలేదు. దీంతో వారంతా స్టీల్‌ప్లాంట్‌కు వ్యతిరేకంగా మాట్లాడకపోవడం, ఎటువంటి ఆందోళనలు చేయకపోవడంతో ఈ ప్రజాభిప్రాయ సేకరణ సజావుగా సాగింది. కూటమి నాయకులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా నిర్వాసితులకు న్యాయం చేయాలనే కామన్ అజెండానే సభలో ప్రస్తావించి ప్రజల మన్ననలు పొందారు.