నలుగురు సైనికులపై అనుమానం
ABN , Publish Date - Sep 03 , 2026 | 04:01 AM
కంటోన్మెంట్ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని 20 మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాలు, మందుగుండు సామగ్రి చోరీ కేసులో దర్యాప్తు అధికారులు కీలక పురోగతి సాధించినట్లు తెలిసింది. మిలిటరీ శిక్షణా సంస్థ, ఆయుధ సామగ్రి నిల్వ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
బొల్లారం ‘ఆయుధాల చోరీ’ దర్యాప్తులో పురోగతి
నలుగురి సిబ్బందిని విచారిస్తున్న అధికారులు
రంగంలోకి డీఐఏ, డీఎంఐ, సీఎంపీ ఆర్మీ ఏజెన్సీలు
చోరీసమయంలో పనిచేయని సీసీ కెమెరాలు
సెల్‌ఫోన్ సిగ్నల్ కదలికల ఆధారంగా దర్యాప్తు
కంటోన్మెంట్‌లోని ఆర్మీ యూనిట్ల వద్ద హై అలర్ట్
హైదరాబాద్/సిటీ/అడ్డగుట్ట/బోయిన్‌పల్లి/తిరుమలగిరి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): కంటోన్మెంట్ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని 20 మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాలు, మందుగుండు సామగ్రి చోరీ కేసులో దర్యాప్తు అధికారులు కీలక పురోగతి సాధించినట్లు తెలిసింది. మిలిటరీ శిక్షణా సంస్థ, ఆయుధ సామగ్రి నిల్వ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. వారు అగ్నివీరులేనా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే ఈ విషయాన్ని పోలీసులుగానీ, సైనికాధికారులుగానీ ధ్రువీకరించలేదు. ఆయుధాల చోరీని సైన్యం సీరియ్‌సగా తీసుకోవటంతో డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (డీఐఏ), డైరెక్టరేట్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ (డీఎంఐ), కాప్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్ (సీఎంపీ) తదితర విభాగాలు కూడా దర్యాప్తు మొదలుపెట్టినట్లు తెలిసింది. చోరీకి గురైనవాటిలో ఏకే 203 రైఫిల్స్ వంటి అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. వాటికి క్రింది భాగంలో ఉండే చిప్‌లు ఉంటాయి. వాటి ఆధారంగానే నింధితులను గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే వారు ఎవరు..? చోరీకి ఎందుకు పూనుకున్నారు..? ఆయుధాలను చోరీచేసేలా వారిని ఎవరైనా ప్రలోభపెట్టారా? ఆ ఆయుధాలతో ఏం చేయాలనుకున్నారు..? ప్రస్తుతం వాటిని ఎక్కడ దాచారు..? ఇందులో ఏదైనా కుట్రకోణం ఉందా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే, నిందితులు పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసింది. సైన్యంతోపాటు తెలంగాణ పోలీసు యంత్రాంగం కూడా దర్యాప్తును ముమ్మరం చేసింది. చోరీ జరిగిన రోజు రెజిమెంట్‌లో 100 మంది సిబ్బంది మాత్రమే ఉన్నట్లు తెలిసింది. మిగతావారంతా రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో శిక్షణ కోసం వెళ్లినట్లు సమాచారం. పోలీసులు వెళ్లేసరికి క్రైమ్‌సీన్ అంతా తారుమారైనట్లు తెలిసింది. దాంతో ఫింగర్ ప్రింట్స్ కూడా చాలావరకు చెదిరిపోయే పరిస్థితి ఉన్నట్లు సమాచారం. ఆర్మీ అధికారులు సివిల్ పోలీసులను లోపలికి రానివ్వకుండా.. ఫింగర్ ప్రింట్, క్లూస్ టీమ్‌లను మాత్రమే అనుమతించినట్లు తెలిసింది.
పనిచేయని సీసీ కెమెరాలు..
చోరీ జరిగిన ముందు రోజు రాత్రి ఆయుధాగారం ముందు ఉన్న సీసీ కెమెరాలు ఆగిపోయినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. తర్వాతి రోజు ఉదయం మళ్లీ వాటిని ఆన్ చేయాలని అధికారులు ఆదేశించటంతో సిబ్బంది ఆన్ చేసినట్లు సమాచారం. ఆయుధాల చోరీతో రెజిమెంట్ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. అనుమానిత వ్యక్తులపై నిఘా ఉంచారు. ఈ ప్రాంతంలో రెండు గేట్లు ఉన్నప్పటికీమంగళవారం రాత్రి నుంచి జనరల్ కృష్ణారావు మార్గ్ మీదుగా వాహనాలను అనుమతిస్తున్నారు. అక్కడ ఉన్న సైనిక పాఠశాలతోపాటు మరో రెండు స్కూళ్లకు 6 రోజులపాటు సెలవు ప్రకటించారు. ఇక్కడ ఉన్న ఎస్‌బీఐ బ్రాంచీకి వస్తున్న ఖాతాదారులను పాస్‌బుక్ ఉంటేనే లోపలికి పంపిస్తున్నారు. కౌకూర్ సమీపంలో ఉన్న బీఎ్‌సఎన్‌ఎల్ కార్యాలయంలో రెండు రోజులుగా తనికీలు నిర్వహిస్తున్నారు. చోరీకి గురైన ఆయుధాలు, మందుగుండు సామగ్రి సుమారు క్వింటాల్ వరకు బరువు ఉంటుందని, అంత బరువైన ఆయుధాలను ఎత్తుకెళ్లటం ఒకరిద్దరికి సాధ్యం కాదని పోలీసులు అనుమానిస్తున్నారు. వాటిని తీసుకెళ్లడానికి కచ్చితంగా ఒక వాహనాన్ని వినియోగించాలి. కనీసం ఇద్దరు ముగ్గురు వ్యక్తులైనా చోరీలో పాల్గొని ఉండాలి అనే కోణంలో దర్యాప్తు సాగుతున్నట్లు తెలిసింది. రెజిమెంట్‌లోనే భారీగా ఆయుధాలు చోరీ చేసేందుకు సాహసించారంటే దీని వెనుక ఏదైనా పెద్ద ముఠా హస్తం ఉందా..? లేక సిబ్బందిని ఎవరైనా ట్రాప్ చేయడం కానీ, హనీ ట్రాప్ గానీ జరిగి ఉంటుందా..? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరో వైపు శిక్షణ సంస్థలోని ఉన్నతాధికారుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తవుతున్నాయి. చోరీ జరిగిన రోజు రాత్రి ఆ ప్రాంతంలో వర్షం కురిసింది. కానీ, అక్కడ ఎలాంటి వాహనాల ఆనవాళ్లుగా, మనుషుల పాదాల గుర్తులుగానీ లభించలేదు. దీంతో పక్కా ప్రణాళిక ప్రకారమే ఆయుధాల చోరీ జరిగిందని భావిస్తున్నారు. ఆర్మీ ఉద్యోగులు, సైనికులే వాటిని దొంగిలించి ఉంటే ఆయుధాల చట్టం- 1950లోని సెక్షన్ 52, 54 ప్రకారం 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కేసు తీవ్రతను బట్టి కోర్టు మార్షల్ విధిస్తారు. అలాగే పోలీసులు నమోదు చేసిన బీఎన్‌ఎ్‌స సెక్షన్‌లు 331(4), 305 ప్రకారం 5 నుంచి 14 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
సమ్మక్క-సారక్క వర్సిటీలో కొత్త కోర్సులు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News