ఉండేది ఒక చోట.. దరఖాస్తు మరో చోట!
ABN , Publish Date - Sep 02 , 2026 | 09:47 AM
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల స్వీకరణలో పలు నియోజకవర్గాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ప్రజా ప్రతినిధులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ అప్లికేషన్ల స్వీకరణలో గందరగోళం
ఖైరతాబాద్ లబ్ధిదారుల్లో అధికశాతం ఇతర ప్రాంతాల వారే..
360 డిగ్రీ కోణంలో దరఖాస్తుల స్ర్కూటినీ అంటే ఇదేనా..?
అధికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపణలు
హైదరాబాద్ సిటీ: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల స్వీకరణలో పలు నియోజకవర్గాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ప్రజా ప్రతినిధులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక నియోజకవర్గ పరిధిలో నివాసముంటున్న ప్రజలు, మరో నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకోవడంతో స్థానికంగా ఉండే వారికి అన్యాయం జరుగుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు ఖైరతాబాద్ నియోజకవర్గంలో హకీంపేట దర్గా-120, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీ ప్రాంతంలో-360 ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం స్థలం కేటాయించింది.
ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ప్రజలతో పాటు ఎర్రగడ్డ, మూసాపేట, కూకట్‌పల్లి, అంబర్‌పేట, నాంపల్లి, యూసు్‌ఫగూడ, కృష్ణానగర్ ప్రాంతాల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించారు. ఏ నియోజకవర్గంలో కేటాయించే ఇళ్లకు అక్కడి స్థానికుల నుంచే దరఖాస్తులు తీసుకోవాలని చెప్పినప్పటికీ అలా జరగలేదు. ఖైరతాబాద్‌తో పాటు మరిన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయని, దరఖాస్తుల స్వీకరణలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన హౌసింగ్‌బోర్డు అధికారులు అలాంటి చర్యలేవీ తీసుకోలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లాటరీ పేర్లు వెల్లడైన తర్వాత నియోజకవర్గాలు పరిశీలిస్తే లాటరీలో గెలుపొందినా లాభం లేకుండా పోతుందని కొంతమంది లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 360 డిగ్రీల్లో పరిశీలన అంటే ఇదేనా? అని ప్రశ్నిస్తున్నారు.
మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తుతో సమస్యలు
ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు అసెంబ్లీ నియోజకవర్గం ప్రాతిపదికగా ఆయా నియోజకవర్గాల్లో నివాసముంటున్న స్థానికులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పలు నియోజకవర్గాల్లోని మీ సేవా కేంద్రాల్లో కొంతమంది తెలియక తమకు నచ్చిన, అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లకు 6 వేలకు పైగా దరఖాస్తులు రాగా వాటిలో సుమారు 2 వేలకు పైగా దరఖాస్తులు ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చినవే ఉన్నాయి. లాటరీకి ముందే ఇలాంటి దరఖాస్తులు పక్కన పెట్టాల్సిన అధికారులు అలా చేయలేదు. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.
ఆన్‌లైన్‌లో సరిచేసుకునే సదుపాయం
ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు నియోజకవర్గాన్ని మార్చుకునే సదుపాయం తెలంగాణ హౌసింగ్ బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. మంగళవారం సాయంత్రం నుంచి 15 నియోజకవర్గాల్లో నిర్వహించిన లాటరీలో గెలుపొందిన లబ్ధిదారుల జాబితాను తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు.
నియోజకవర్గాల వారీగా లాటరీలో ఎంపికైన లబ్ధిదారులు- వెయింటింగ్ లిస్ట్
సనత్‌నగర్ - 480,-220
ఇబ్రహీంపట్నం - 480-220
మల్కాజిగిరి -480 -220
మేడ్చల్- 480-220
కార్వాన్ - 478- 188
మహేశ్వరం - 480- 171
శేరిలింగంపల్లి - 480- 150
అంబర్‌పేట - 480- 120
బహుదూర్‌పురా - 480-120
కూకట్‌పల్లి - 480-120
మలక్‌పేట- 480- 120
కుత్బుల్లాపూర్ - 446- 109
రాజేంద్రనగర్ - 480-60
నాంపల్లి - 405-120
సికింద్రాబాద్ కంటోన్మెంట్ -125-35
ప్రభుత్వానికి చెడ్డపేరు
నగరంలో ఎన్నో ఏళ్లుగా నివాసముంటున్న వారికి సొంత ఇల్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం క్యూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల టవర్లు నిర్మిస్తోంది. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఇళ్లకోసం మూసాపేట, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, అంబర్‌పేట, నాంపల్లి ప్రాంతాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. అయినా వాటిని తిరస్కరించలేదు. 360 డిగ్రీల స్ర్కూటినీతో దరఖాస్తుల పరిశీలన అంటే ఇదేనా? మంత్రి పదేపదే చెప్పినా అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో 480 ఇళ్లు కేటాయిస్తే 120 ఇళ్లు మాత్రమే ఇక్కడి ప్రజలకు ఇచ్చారు.
దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే
ఈ వార్తలు కూడా చదవండి:
చర్లపల్లి-తిరుచానూరు మధ్య 2 ప్రత్యేక రైళ్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News