శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నిలిచిపోయిన ఇండిగో ఫ్లైట్.. కారణమిదే..
ABN , Publish Date - Feb 04 , 2026 | 09:32 AM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రాయపూర్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానం నిలిచిపోయింది. టేకాఫ్ సమయంలో విమానంలో లోపాన్ని పైలెట్ గుర్తించారు..
హైదరాబాద్, ఫిబ్రవరి 4: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Shamshabad Airport) ఇండిగో విమానంలో (Indigo Flight) సాంకేతిక లోపం తలెత్తింది. శంషాబాద్ నుంచి ఈ రోజు (బుధవారం) ఉదయం 6:45 గంటలకు రాయపూర్‌కు ఇండిగో విమానం వెళ్లాల్సి ఉంది. అయితే, టెకాఫ్ అయ్యే ముందే పైలెట్ విమానంలో సాంకేతిక సమస్య ఉందని గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. దీంతో విమానంలో ఉన్న 71 మంది ప్రయాణికుల్ని కిందికు దించేశారు అధికారులు. ఆపై ఎయిర్‌పోర్టు సిబ్బంది.. విమానంలో సాంకేతిక సమస్యను పరిష్కరించే పనిలో పడ్డారు.
కానీ, ఎంతసేపటికీ కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో సుమారు 71 మంది ప్రయాణికులను మరో విమానంలో రాయపూర్‌కు పంపించినట్లు తెలుస్తోంది. ఈ సమస్య ఎక్కడ ఉంది?.. ఎందువల్ల సాంకేతిలోపం తలెత్తింది? అనేదానిపై ఇప్పటి వరకు ఇండిగో సిబ్బంది అధికారికంగా వెల్లడించలేదు.
ఉదయం 6:45 గంటలకే రాయపూర్‌కు వెళ్లాల్సి ఉండగా.. గంట గడిచినప్పటికీ ఇండిగో సిబ్బంది ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రత్యామ్నాయంగా మరో ఫ్లైట్‌ను ఏర్పాటు చేసి, 71 మంది ప్రయాణికులను రాయపూర్‌కు పంపినట్లు సమాచారం. ఈ మధ్యకాలంలో ఇండిగో విమానంలో సాంకేతిక సమస్యలు ఎక్కువగా తలెత్తుతుండడంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోసారి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఇండిగో యాజమాన్యం దృష్టిపెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి...
8న భూపాలపల్లి జిల్లాలో సీఎం పర్యటన
వరంగల్ మున్సిపల్ బరిలో ప్రధాన పార్టీలు.. ఊపందుకోనున్న ఎన్నికల ప్రచారం
Read Latest Telangana News And Telugu News