Share News

స్పామ్‌ సునామీ

ABN , Publish Date - Nov 23 , 2026 | 03:59 AM

ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వ రకు.. చేతిలోని స్మార్ట్‌ఫోన్‌ మనకంటే ఎక్కువ స్పామ ర్ల చేతుల్లోనే పనిచేస్తోంది.! ఆఫీసులో ముఖ్యమైన మీటింగ్‌లోఉన్నా.. ప్రయాణంలోఉన్నా.. కుటుంబంతో సరదాగా గడుపుతున్నప్పుడో.. ఉన్నట్టుండి ఫోన్‌ మో గుతుంది.

స్పామ్‌ సునామీ

  • 3 నెలల్లో 1,828 కోట్ల కాల్స్‌!

  • ట్రాయ్‌ కొరడా ఝళిపించినా.. ఆగని కేటుగాళ్ల కాల్స్‌

  • ఏఐ నిఘాకు చిక్కకుండా.. నంబర్లు మార్చి మరీ వేధింపులు!

  • డీఎన్‌డీపై ప్రజల్లో కొరవడిన అవగాహన

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వ రకు.. చేతిలోని స్మార్ట్‌ఫోన్‌ మనకంటే ఎక్కువ స్పామ ర్ల చేతుల్లోనే పనిచేస్తోంది.! ఆఫీసులో ముఖ్యమైన మీటింగ్‌లోఉన్నా.. ప్రయాణంలోఉన్నా.. కుటుంబంతో సరదాగా గడుపుతున్నప్పుడో.. ఉన్నట్టుండి ఫోన్‌ మో గుతుంది. ఎత్తకపోతే ఏ అత్యవసర కాల్‌ మిస్‌ అవుతామోనన్న కంగారు.. ఎత్తితే లోన్లు, క్రెడిట్‌ కార్డులు, ఇన్సూరెన్సు, రియల్‌ఎస్టేట్‌ ఆఫర్ల పేరుతో నిత్య నరకం! విసుగొచ్చి ఆ నంబరును బ్లాక్‌ చేస్తే మరుక్షణమే కొత్త నంబరుతో ప్రత్యక్షమవుతారు. భారత టెలికాం నియంత్రణప్రాధికార సంస్థ(ట్రాయ్‌) నిబంధనల కొరడా ఝుళిపిస్తున్నా, టెలికాం కంపెనీలు ఏఐతో నిఘా పెట్టినా కేటుగాళ్ల వేధింపులకు అడ్డుకట్ట పడటంలేదు.


కేవలం 90రోజుల్లోనే (2026జూలై- సెప్టెంబరు త్రైమాసికం) దేశవ్యాప్తంగా ఏకంగా 1,828కోట్ల అనుమానాస్పద స్పామ్‌కాల్స్‌, 162కోట్ల ఎస్ఎంఎస్‌లు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మూడు నెలల్లో 15లక్షల ఫిర్యాదులు అందగా, ట్రాయ్‌ కొరడాకు 1.10లక్షల నంబర్లకు 15రోజుల పాటు ఔట్‌గోయింగ్‌ సేవలు నిలిచిపోయాయని ట్రాయ్‌ లెక్కలు చెబుతున్నాయి. ఈ-కేవైసీ ధ్రువీకరణలో విఫలమైన 9,977 కనెక్షన్లను శాశ్వతంగా తొలగించారు. స్పామ్‌ కాల్స్‌ అడ్డుకట్టకు ఒకపక్క ట్రాయ్‌, మరో పక్క టెలి కాం కంపెనీలు యుద్ధం చేస్తున్నా.. రావణుడి పది తలల్లా ఒకటి నరికితే మరొకటి పుట్టుకొస్తున్నాయి. వ్యక్తిగత డేటాను కొల్లగొట్టి బ్యాంకు ఖాతాలకు కన్నం వేసే సైబర్‌ నేరగాళ్లకు రాచబాటను వేస్తున్నాయి.


సాధారణ నంబర్లతో వల

ప్రచారకాల్స్‌ కోసం ట్రాయ్‌ ప్రత్యేకంగా 140 సిరీస్‌ను, బ్యాంకులు, ఆర్థిక, ప్రభుత్వ సేవల లావాదేవీల కోసం 160, యుటిలిటీ, డెలివరీ రంగాల కోసం 1601 సిరీ్‌సలను కేటాయించింది. అయితే, ఈ నిబంధనలను తుంగలో తొక్కుతున్న స్పామర్లు సాధారణ 10 అంకెల మొబైల్‌ నంబర్ల నుంచి ఆటోమేటెడ్‌ డయలింగ్‌ ద్వారా బల్క్‌ కాల్స్‌ చేస్తున్నారు. అవి వ్యక్తిగత కాల్స్‌లా కనిపించడంతో జనం మోసపోయి ఫోన్‌ ఎత్తుతున్నారు. స్పామర్ల ఆట కట్టించేందుకు టెలికాం సంస్థలు ఇప్పుడు నెట్‌వర్క్‌ స్థాయిలోనే ఏఐని రంగంలోకి దించాయి. 2024లోనే ఎయిర్‌టెల్‌ తెచ్చిన ఏఐ వ్యవస్థ కాల్స్‌, ఎస్‌ఎంఎ్‌సల సంఖ్య, వాటి తరచుదనం, ఐఎంఈఐ మార్పులను పసిగట్టి ‘స్పామ్‌ వార్నింగ్‌’ ఇస్తోంది.


జియో సైతం ఒక్క త్రైమాసికంలోనే 892 కోట్ల స్పామ్‌ కాల్స్‌ను గుర్తించి వినియోగదారులను అప్రమత్తం చేసింది. అయినప్పటికీ కట్టడి కాకపోవటంతో 2026 సెప్టెంబరులో ట్రాయ్‌ మరో సవరణ నిబంధనలను తెచ్చింది. ఒక టెలికాం సంస్థకు చెందిన ఐదు లేదా అంతకంటే ఎక్కువ నంబర్లు పది రోజుల్లో అనుమానాస్పదంగా తేలితే, వాటి ఈకేవైసీ పునఃపరిశీలన, భౌతిక తనిఖీలు చేసి అవసరమైతే కనెక్షన్లు రద్దు చేసే అధికారాన్ని ఇచ్చింది. ఆటో డయలింగ్‌, రోబో కాల్స్‌, కృత్రిమ వాయిస్‌ బల్క్‌ కాల్స్‌ను పరిధిలోకి తీసుకొచ్చింది. అలాగే వినియోగదారుడు ఒక వస్తువు లేదా సేవ గురించి సంస్థను స్వయంగా విచారించిన సరే, ఆ తర్వాత ఏడు రోజులు మాత్రమే సందేశాలు పంపేలా పరిమితి విధించింది.


మన నిర్లక్ష్యమూ ఓ కారణమే!

ట్రాయ్‌ ఇన్ని నిబంధనలు తెచ్చినా క్షేత్రస్థాయిలో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు సహా భీమా, మార్కెటింగ్‌ సంస్థలు నిత్యం వేధిస్తూనే ఉన్నాయని వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇందులో ప్రజల నిర్లక్ష్యమూ ఉందని టెలికాం సంస్థలు చెబుతున్నాయి. ట్రాయ్‌ తాజా గణాంకాల ప్రకారం.. దేశంలోని 134.9 కోట్ల మొబైల్‌ వినియోగదారుల్లో 22.44 కోట్ల మందే (16.64 శాతం) మాత్రమే ‘డు నాట్‌ డిస్టర్బ్‌’ (డీఎన్‌డీ)లో పేరు నమోదు చేసుకున్నారు. ఏఐ వ్యవస్థలు అన్ని కాల్స్‌ను నూరు శాతం నిర్ధారించలేవని, టెలికాం నిఘాకు ప్రజల ఫిర్యాదులు తోడైతేనే ఈ స్పామ్‌ భూతాన్ని అంతం చేయగలమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.


స్పామర్ల ఆట కట్టించండిలా..

డీఎన్‌డీ నమోదు: ట్రాయ్‌ డీఎన్‌డీ యాప్‌, లేదా టెలికం యాప్‌ లేదా 1909కు కాల్‌/మెసే జ్‌ చేసి డీఎన్‌డీ ప్రాధాన్యాలను నమోదు చేసుకుని అన్నిరకాల ప్రచారకాల్స్‌ నిలిపివేయవచ్చు

బ్లాక్‌ కాదు.. 1909కు ఫిర్యాదు: స్పామ్‌ కాల్‌ వచ్చినప్పుడు ఆ నంబరును బ్లాక్‌ చేయడం వల్ల ఆ ఒక్క నంబర్‌ నుంచి వచ్చే కాల్స్‌ మాత్రమే ఆగుతాయి. అందుకే బ్లాక్‌ చేయడంతో పాటు 1909 ద్వారా ఫిర్యాదు చేసి, టెలికాం సంస్థ నుంచి వచ్చే ఫిర్యాదు ఐడీ ద్వారా చర్యల పురోగతిని తెలుసుకోవచ్చు.

నంబరు ఇవ్వడంలో జాగ్రత్త: షాపింగ్‌మాల్స్‌, వెబ్‌సైట్లలో అనవసరంగా నంబర్లు ఇవ్వకూడదు. ఆన్‌లైన్‌ ఫారాలు నింపే ముందు కూడా మార్కెటింగ్‌ సమ్మతి ఆప్షన్లను గమనించాలి.

సెకండరీ నంబరు వాడకం: బ్యాంకు ఖాతాలకు, వ్యక్తిగత అవసరాలకు వాడే ప్రధాన నంబరును కాకుండా.. ఆన్‌లైన్‌ ఆర్డర్లు, యాప్‌ల రిజిస్ట్రేషన్‌ కోసం మరో ప్రత్యామ్నాయ నంబరును వినియోగించడం ఉత్తమం.


ఈ వార్తలు కూడా చదవండి...

ఇండియన్ రోడ్ నెట్‌వర్క్‌ ప్రపంచంలోనే నంబర్‌వన్‌: నితిన్‌ గడ్కరీ

బీఆర్ఎస్ నేతలను అకారణంగా అరెస్ట్ చేస్తున్నారు.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజం

ఇందిరాగాంధీ అనునిత్యం దేశం, పేదల కోసం శ్రమించారు: మహేశ్ గౌడ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 23 , 2026 | 03:59 AM