Share News

రాజ్యాంగ స్ఫూర్తితోనే విధులు నిర్వర్తిస్తున్నా: రంగనాథ్

ABN , Publish Date - Jul 27 , 2026 | 09:11 PM

రాజ్యాంగ స్ఫూర్తితోనే తాను విధులు నిర్వర్తిస్తున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఆర్టికల్ 21, 48A ప్రకారమే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ చేస్తున్నట్లు ఆయన వివరించారు. నిజాయితీ, నిర్భయంతో పనిచేయడమే హైడ్రా ధైర్యం అని అభివర్ణించారు.

రాజ్యాంగ స్ఫూర్తితోనే విధులు నిర్వర్తిస్తున్నా: రంగనాథ్
HYDRA Commissioner AV Ranganath

హైదరాబాద్, జులై 27: రాజ్యాంగ స్ఫూర్తితోనే తాను విధులు నిర్వర్తిస్తున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఆర్టికల్ 21, 48A ప్రకారమే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ చేస్తున్నట్లు ఆయన వివరించారు. నిజాయితీ, నిర్భయంతో పనిచేయడమే హైడ్రా ధైర్యం అని అభివర్ణించారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం హైదరాబాద్‌లో స్పందించారు.


ఇప్పటి వరకు రూ.1.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కాపాడామని తెలిపారు. 6 చెరువులను పూర్తిగా పునరుద్ధరించాం.. 20 చెరువుల పనులు కొనసాగుతున్నాయని వివరించారు. వేల ఎకరాల ప్రభుత్వ భూములను తిరిగి ప్రభుత్వానికి అప్పగించామని అన్నారు. బడా భూ కబ్జాదారులపై చర్యల వల్లే హైడ్రాపై దాడులు జరిగాయని పేర్కొన్నారు. ల్యాండ్ మాఫియా తప్పుడు సమాచారంతో కోర్టులను తప్పు దోవ పట్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.


లోతుకుంటలో రూ.10 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడామని హైడ్రా కమిషనర్ వివరించారు. అనుమతులు లేకుండా హెరిటేజ్ గుట్టలను బ్లాస్టింగ్ చేశారని విమర్శించారు. Save the Rocks Society.. స్థానికుల ఫిర్యాదుతోనే హైడ్రా చర్యలు చేపట్టిందని అన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారే తనపై కోర్టు ధిక్కరణ కేసులు వేశారని పేర్కొన్నారు.


తనపై మొత్తం 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ కేసులన్నింటినీ చట్టపరంగా ఎదుర్కుంటానని స్పష్టం చేశారు. ఈ కేసుల వెనుక భూ కబ్జాదారులే ఉన్నారని ఆరోపించారు. కోర్టులపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. ప్రభుత్వం ఏ బాధ్యత అప్పగించినా 100 శాతం ఫలితాలు ఇస్తానని రంగనాథ్ చెప్పుకొచ్చారు. చెరువులు, పార్కులతోపాటు ప్రభుత్వ భూముల రక్షణే తమ లక్ష్యమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరించారు.


లోతుకుంట భూముల కేసు విచారణ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఎ.వి.రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు సోమవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హైడ్రా కమిషనర్‌ పదవి నుంచి రంగనాథ్‌ను తొలగించాని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. సెక్రటరీ ర్యాంక్‌ స్థానంలో ఉన్న ఉన్నతాధికారి.. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం ఏ మాత్రం సమంజసం కాదని ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.


అర్హత కలిగిన అధికారిని హైడ్రా కమిషనర్‌గా నియమించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించింది. హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ కొనసాగితే రూల్‌ ఆఫ్‌ లా తప్పుతుందని అభిప్రాయపడింది. ఆయన్ని తొలగించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై విధంగా స్పందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైడ్రా చీఫ్‌ రంగనాథ్‌కు మద్దతుగా రేవంత్‌ సర్కార్‌..!

లిక్కర్ స్కాం కేసు.. చెవిరెడ్డి పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 27 , 2026 | 10:22 PM