Share News

ఆన్‌లైన్ గేమ్స్‌తో అప్పులపాలు.. యువకుడి ఆత్మహత్య

ABN , Publish Date - Jan 21 , 2026 | 01:40 PM

ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌ల వ్యసనానికి అలవాటుపడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌లో జరిగింది. యువత జీవితాలను ఎలా ఛిన్నాభిన్నం చేస్తుందో చెప్పడానికి మీర్‌పేట్‌లో జరిగిన ఈ ఘటనే నిదర్శనం.

 ఆన్‌లైన్ గేమ్స్‌తో అప్పులపాలు.. యువకుడి ఆత్మహత్య
Online Betting

హైదరాబాద్‌, జనవరి21 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌ల వ్యసనానికి అలవాటుపడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌లో జరిగింది. యువత జీవితాలను ఎలా ఛిన్నాభిన్నం చేస్తుందో చెప్పడానికి మీర్‌పేట్‌లో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. లక్షలాది రూపాయలు పోగొట్టుకుని, అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ యువకుడు ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై మీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఘటన వివరాలిలా..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాకు చెందిన లక్ష్మీకాంత్(22) అనే యువకుడు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ వచ్చి మీర్‌పేట్ పరిధిలో నివసిస్తున్నాడు. లక్ష్మీకాంత్.. ఏడాది కాలంగా ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌లకు బానిసయ్యాడు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న డబ్బుతో పాటు ఇతరుల వద్ద అప్పులు చేసి మరీ లక్షలాది రూపాయలు బెట్టింగ్‌లో పోగొట్టుకున్నాడు. పెట్టిన పెట్టుబడి తిరిగి రాకపోగా, అప్పులు తీర్చాలనే ఒత్తిడి పెరగడంతో లక్ష్మీకాంత్ కొద్దిరోజులుగా మానసిక ఆందోళనకు గురయ్యాడు. బుధవారం ఉదయం స్నానం చేస్తానని చెప్పి బాత్‌రూమ్‌లోకి వెళ్లాడు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ ఉన్న ఇనుప రాడ్‌కు ఉరివేసుకుని లక్ష్మీకాంత్ విగతజీవిగా కనిపించాడు.


పోలీసుల దర్యాప్తు..

సమాచారం అందుకున్న మీర్‌పేట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. లక్ష్మీకాంత్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అతను ఏయే యాప్‌లలో బెట్టింగ్ ఆడాడు? ఎవరెవరి వద్ద అప్పులు చేశాడు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లు ప్రారంభంలో లాభాలు కనిపిస్తున్నట్లు భ్రమ కలిగిస్తాయని, కానీ చివరకు సర్వస్వం కోల్పోయేలా చేస్తాయని పోలీసులు తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపే ఏ ఆన్‌లైన్ గేమ్‌నూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఏదైనా సమస్య ఉంటే కుటుంబ సభ్యులతో పంచుకోవాలని లేదా కౌన్సెలింగ్ తీసుకోవాలని.. సూసైడ్ అనేది దేనికీ పరిష్కారం కాదని పోలీసులు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

బేగంపేట ఫ్లైఓవర్‌పై ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడిన కారు

మేడారం మహాజాతరలో నేడు తొలి ఘట్టం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 21 , 2026 | 01:49 PM