Share News

బిల్డింగ్‌ కట్టకున్నా.. ఈఎంఐ కట్టాల్సిందే

ABN , Publish Date - Nov 26 , 2026 | 04:03 AM

సొంత ఇంటిని కొనుక్కోవాలన్న సామాన్యుల కలను కొందరు డెవలపర్లు కల్లలు చేసేస్తున్నారు. హైదరాబాద్‌ మహానగరంలో ఓ ఇల్లు కొనుక్కోవాలని అందరూ ఆశ పడుతుంటారు. ఆ ఆశనే కొన్ని రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు మంచి అవకాశంగా మలుచుకుంటున్నాయి.

బిల్డింగ్‌ కట్టకున్నా.. ఈఎంఐ కట్టాల్సిందే

  • సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయని రియల్‌ సంస్థలు

  • కొనుగోలుదారులపై అద్దెలు, ఈఎంఐల భారం

  • ప్రముఖ నిర్మాణ సంస్థలూ గడువులోగా ఫ్లాట్లు ఇవ్వట్లే!

  • రెరాకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం

  • కఠిన చర్యలు తీసుకోకుండా.. నామమాత్రపు జరిమానాలతో సరిపెడుతున్న వైనం

  • తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొనుగోలుదారులు

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): సొంత ఇంటిని కొనుక్కోవాలన్న సామాన్యుల కలను కొందరు డెవలపర్లు కల్లలు చేసేస్తున్నారు. హైదరాబాద్‌ మహానగరంలో ఓ ఇల్లు కొనుక్కోవాలని అందరూ ఆశ పడుతుంటారు. ఆ ఆశనే కొన్ని రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు మంచి అవకాశంగా మలుచుకుంటున్నాయి. రెరా అనుమతులున్నాయంటూ ‘ప్రీలాంచ్‌’ ప్రకటనలు కుమ్మేస్తున్నాయి. సొంత గూడు కోసం కష్టపడి సొమ్ములు సమకూర్చుకొని ఫ్లాట్లను బుక్‌ చేసుకున్న వారికి డెవలపర్లు చుక్కలు చూపిస్తున్నారు. రెరా నిర్దేశించిన గడువులోగా ప్రాజెక్టులు పూర్తి చేయకుండా, కొనుగోలుదారులకు ఫ్లాట్లు అందజేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఫలితంగా కొనుగోలుదారులకు ఇంటి అద్దెతో పాటు బ్యాంకుకు చెల్లించాల్సిన ఈఎంఐలు కూడా గుదిబండగా మారుతున్నాయి. రెరాను ఆశ్రయించిన బాధితులకు న్యాయం ఆలస్యమవుతోంది.


ఆయా సంస్థలకు రూ.25-30 లక్షలు జరిమానా విధించినా పట్టించుకోవడం లేదు. హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ మెరుగ్గా ఉండడంతో పుణె, బెంగళూరు, నోయిడా తదితర ప్రాంతాలకు చెందిన డెవలపర్లు, రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. నివాస, వాణిజ్య ప్రాజెక్టులను చేపడుతున్నాయి.దీంతో గ్రేటర్‌ హైదరాబాద్‌లో అప్పటికే ఉన్న డెవలపర్లు, రియల్‌ ఎస్టేట్‌ సంస్థల మధ్య పోటీ పెరిగిపోయింది. కొత్తగా వచ్చే సంస్థలు, డెవలపర్లు ప్రాజెక్టు పూర్తయితేనే ‘రెడీ ఫర్‌ మూవ్‌’ పేరుతో మార్కెట్‌లో నివాస ఫ్లాట్లను విక్రయించే పరిస్థితులున్నాయి. అయితే మార్కెట్‌లో నిలబడేందుకు, మార్కెట్‌పై గుత్తాధిపత్యం సాధించేందుకు కొన్ని రియల్‌ సంస్థలు, పలువురు డెవలపర్లు ఆకర్షణీయమైన ఆఫర్లతో ముందుకొస్తున్నారు. గతంలో ప్రాజెక్టు అనుమతులు రాకముందే ప్రీలాంచ్‌ పేరుతో కొనుగోలుదారులను బురిడీ కొట్టించిన సంస్థలున్నాయి.


పేరుగాంచిన సంస్థలో కొనుగోలు చేసినా..!

హైదరాబాద్‌లో పేరుగాంచిన ఓ సంస్థ నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్రాజెక్టు చేపట్టింది. ప్రముఖ సంస్థ కావడంతో కొండాపూర్‌లో నివాసం ఉండే రవికుమార్‌ 2023 నవంబరులో ఓ ప్రాజెక్టులో ఫ్లాట్‌ బుక్‌ చేశారు. ప్రాజెక్టుకు రెరా అనుమతి రావడంతో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్‌కు రూ.83.70 లక్షలు కాగా.. జీఎస్టీ, రిజిస్ట్రేషన్‌, కారు పార్కింగ్‌ కలిపి మొత్తం రూ.93.50 లక్షలైంది. రూ.18.50 లక్షలు నగదు చెల్లించి, రూ.75 లక్షలకు బ్యాంకు రుణం తీసుకున్నారు. అగ్రిమెంట్‌లో డెలివరీ గడువు డిసెంబరు 2025గా పేర్కొన్నారు.


రెరాలోనూ అదే గడువు నమోదైంది. 2023 నవంబరులో ప్రీలాంచ్‌ బుకింగ్‌ కింద ఫ్లాట్‌ కొని 36 నెలలైంది. గడువు దాటి 11 నెలలు గడిచినా ఫ్లాట్‌ అప్పగించలేదు. సైట్‌లో 12 అంతస్తుల భవనం ఏడో అంతస్తు వద్దే ఆగిపోయింది. పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొండాపూర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్న రవికుమార్‌ ప్రతి నెలా రూ.28 వేలు అద్దె చెల్లిస్తుండగా.. చేతికి ఫ్లాట్‌ రాకపోయినా ఈ ఏడాది జనవరి నుంచి ఇంటి రుణం ఈఎంఐ రూ.60 వేల వరకు చెల్లిస్తున్నట్లు వాపోయారు. ఆ సంస్థ ప్రీలాంచ్‌ బుకింగ్‌ల పేరుతో వసూలు చేసిన సొమ్మును వేరే ప్రాజెక్టులకు మళ్లించడమే ఆలస్యానికి కారణమని కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు.


రెరా ఆమోదం పొందిన ప్రాజెక్టులు సైతం..

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో మోసాలను అరికట్టేందుకు 2017లో రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేషన్‌ అథారిటీ (రెరా)ని ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ (డీటీసీపీ) అనుమతులు ఉండే ప్రతి నిర్మాణ, లేఅవుట్‌ ప్రాజెక్టుకు రెరా అనుమతులు లేకుండా క్రయవిక్రయాలు జరపడం చట్టవిరుద్ధం. రెరా ఆమోదం పొందిన ప్రాజెక్టులు గడువు మేరకు ప్రాజెక్టును పూర్తి చేసి కొనుగోలుదారులకు ఫ్లాట్లను అప్పగించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోపు ప్రాజెక్టు పూర్తి చేసి కొనుగోలుదారులకు ఫ్లాట్లను అప్పగించకపోతే డెవలపర్‌పై రెరా కఠిన చర్యలు తీసుకుంటుంది. రెరా అనుమతులు పొందిన తర్వాత రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన డబ్బులో 70 శాతాన్ని ప్రత్యేక బ్యాంకు ఖాతాలో ఉంచాలి.


ఆ డబ్బును ప్రాజెక్టు నిర్మాణానికే ఖర్చు చేయాలి. వేరే భూమి కొనడానికి, మరో ప్రాజెక్టు నిర్మాణానికి మళ్లించకూడదని రెరాలో సెక్షన్‌ 4(2) నిబంధన స్పష్టం చేస్తోంది. అయినా, కొన్ని నిర్మాణ సంస్థలు ఇవేమీ పట్టించుకోవడం లేదు. ఆ డబ్బుతో ఇతర ప్రాంతాల్లో స్థలాలు కొనుగోలు చేస్తున్నాయి. అయినా, కఠిన చర్యలు తీసుకోవడంలో రెరా విఫలమవుతోంది. నామమాత్రపు జరిమానాలతో సరిపెడుతోంది. రెరా సెక్షన్‌ 11, 13 ప్రకారం.. నిర్దేశిత గడువులోగా ఫ్లాట్‌ అప్పగించాలి. ప్రాజెక్టు నిర్మాణం జరిగే సందర్భంలోనే 3 నెలలకోసారి నిర్మాణ పురోగతిని రెరా వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేయాలి. ఫ్లాట్‌ ఇవ్వడంలో ఆలస్యమైతే కొనుగోలుదారుడి నిర్ణయానికి అనుగుణంగా ఆలస్యమైన ప్రతి నెలకూ 10.85 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.


కొనుగోలుదారుడు ఫ్లాట్‌ వద్దనుకుంటే కట్టిన మొత్తం డబ్బుతో పాటు అదనంగా 10.85 శాతం వడ్డీ చెల్లించాలి. ఇప్పటికే హైదరాబాద్‌లో సనాలి ఐటీ పార్కు కేసులో రూ.25 లక్షలు జరిమానా విధించగా, త్రిపుర నిర్వాణ కేసులో రూ.41.85 లక్షలు రిఫండ్‌ చేయాలని రెరా ఆదేశించింది. నిర్ణీత గడువులోపు ఫ్లాట్‌ అప్పగించకుండా ప్రాజెక్టు ఆలస్యం చేసినందుకు బుకింగ్‌ రద్దు చేసుకున్న కొనుగోలుదారుడికి రూ.17 లక్షలు చెల్లించాలని, ఇక వాసవి లేక్‌ సిటీ కేసులో ప్రాజెక్టు ఆలస్యానికి రూ.10.85 శాతం వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. ప్రాజెక్టును మధ్యలో వదిలేసిన భువనతేజ ఇన్‌ఫ్రా.. కొనుగోలుదారులకు రూ.26 లక్షలు రిఫండ్‌ చేయాలని రెరా ఆదేశాలిచ్చింది.


న్యాయం చేయడంలో రెరా తాత్సారం

రెరా వచ్చి పదేళ్లు కావస్తోంది. పలు నిర్మాణ సంస్థలు, డెవలపర్లపై కొనుగోలుదారులు అనేక ఫిర్యాదులు చేశారు. కానీ, కఠిన చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. రెరా ఆమోదం లేకుండా విక్రయాలు చేసిన కొండాపూర్‌లోని ఆరోసఫైర్‌, మంచిరేవులలోని సనాలి ది ఎడ్జ్‌ ప్రాజెక్టులకు రూ.25 లక్షల చొప్పున జరిమానా విధించారు. రెరాలో ఫిర్యాదు చేసిన బాధితులకు సత్వరమే న్యాయం జరగడం లేదనే ఆరోపణలున్నాయి. ఫిర్యాదు చేసిన ఏడాది తర్వాత తీర్పులు వస్తున్నాయి. ఆ తీర్పులను డెవలపర్లు గౌరవించడం లేదు. తీర్పు అమలు కోసం బాధితులు మళ్లీ పిటిషన్‌ వేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక నిబంధనలు ఉల్లంఘిస్తున్న నిర్మాణ సంస్థలు, డెవలపర్లు.. రెరా జరిమానాలను పట్టించుకోవడం లేదు. రూ.100 కోట్ల ప్రాజెక్టుకు రూ.25 లక్షల జరిమానా విధిస్తే.. ప్రాజెక్టు వ్యయంలో 0.25 శాతం మాత్రమే ఉంటుంది. ఈ మొత్తం ఆయా సంస్థలపై ఎంత మాత్రం ప్రభావం చూపడం లేదు. ఫలితంగా కొనుగోలుదారులకు న్యాయం జరగడం లేదు. సకాలంలో ఫ్లాట్లు అప్పగించడం లేదు.


ఈ వార్తలు కూడా చదవండి...

మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై కీలక ముందడుగు.. పోర్టులు, లాజిస్టిక్స్‌పై ప్రత్యేక దృష్టి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 26 , 2026 | 04:07 AM