రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా ఆస్తి పన్ను
ABN , Publish Date - Sep 13 , 2026 | 04:37 AM
హైదరాబాద్ మహానగరం పరిధిలో ఇకనుంచి ఆయా ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా ఆస్తి పన్నును వసూలు చేయనున్నారు.
ఇప్పుడు చెల్లిస్తున్న దానికంటే పెరిగే చాన్స్..
పెంచే పన్ను ఏటా 20శాతం చొప్పున
విలువలు సవరించినప్పుడల్లా పెరగనున్న పన్ను
375 అడుగులలోపు ఉండే ఇళ్లకు రూ.101 మాత్రమే
సైనికులు, మాజీ సైనికులకు ఆస్తి పన్ను మినహాయింపు
ఆస్తులకు డిజిటల్ గుర్తింపు.. ప్రతి భవనానికీ ప్రత్యేక కోడ్
ఖాళీ స్థలాలకూ ఆస్తి విలువలో 0.50 శాతం పన్ను
అక్రమ నిర్మాణాలకు 300 శాతం పెనాల్టీ
ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఉంటేనే నల్లా, విద్యుత్తు కనెక్షన్
పురపాలక ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్
కోర్ అర్బన్ రీజియన్ బిల్లులో స్పష్టం.. బిల్లు ఆమోదం
వచ్చే 30 ఏళ్ల అవసరాల కోసమే క్యూర్
హైదరాబాద్‌ను బ్లూ, గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతాం: దుద్దిళ్ల
హైదరాబాద్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మహానగరం పరిధిలో ఇకనుంచి ఆయా ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా ఆస్తి పన్నును వసూలు చేయనున్నారు. ఫలితంగా, ఇప్పుడు చెల్లిస్తున్న దాని కంటే భారీగా ఆస్తి పన్ను పెరగనుంది. అదనంగా పెరిగే ఆస్తి పన్నును ఒకేసారి కాకుండా విడతల వారీగా పెంచనున్నారు. ఇక, 375 చదరపు అడుగుల వైశాల్యంలోపు నివాసం ఉండే పేద వర్గాలకు 101 రూపాయల నామమాత్రపు పన్ను విధించనున్నారు. సైనికులతోపాటు మాజీ సైనికులకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రధాన పట్టణ ప్రాంత సమగ్ర పాలన బిల్లు-2026 (కోర్ అర్బన్ రీజియన్ యాక్ట్)ను ప్రభుత్వం శనివారం శాసనసభలో ప్రవేశపెట్టింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరపున మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు దీనిని ప్రవేశపెట్టారు. చర్చ అనంతరం బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. గవర్నర్ సంతకం చేసిన తర్వాత చట్టరూపం దాల్చనుంది. తద్వారా, ఆస్తి పన్ను వసూళ్లలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. కోర్ అర్బన్ రీజియన్‌ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్‌గా విభజించిన విషయం తెలిసిందే. ఈ మూడు ప్రాంతాల్లో పరిపాలనకు ఒకే విధానం అమలు చేయడానికి వీలుగా ఈ బిల్లును తెచ్చారు.
ఏడాదికి 20 శాతం చొప్పున పెంపు
ప్రస్తుతం యాన్యువల్ రెంటల్ రేట్, యూనిట్ రేట్ ఆధారంగా ఆస్తి పన్నును విధిస్తున్నారు. ఇకనుంచి భూమి, భవనాల క్యాపిటల్ (ఆస్తి విలువ) విలువలో నిర్ణయించిన శాతాన్ని ఆస్తిపన్నుగా విధించనున్నారు. నివాస భవనాలకు వాటి రిజిస్ట్రేషన్ విలువలో కనీసం 0.10 శాతం నుంచి గరిష్ఠంగా 0.50 శాతం వరకు విధించే అవకాశం ఉంది. అదే నివాసేతర భవనాలకు 0.20 శాతం నుంచి 2 శాతం వరకు పన్ను నిర్ణయించే అవకాశం ఉంది. భవన వినియోగం, ఆదాయం సమకూర్చే సామర్థ్యం, ప్రాంత స్వభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వేర్వేరు ప్రాంతాలకు వేర్వేరు రేట్లు కూడా నిర్ణయిస్తారు.
అయితే, కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చిన వెంటనే పన్ను ఒక్కసారిగా భారీగా పెరగదు. అదనపు భారం ఏడాదికి 20 శాతానికి మించకుండా క్రమంగా పెంచుతారు. ఉదాహరణకు.. ఇప్పుడు మీరు ఏడాదికి రూ.10 వేలు ఆస్తి పన్ను కడుతున్నారని అనుకుందాం. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం మదింపు చేస్తే అది ఏడాదికి రూ.20 వేలు అవుతుందని అనుకుందాం. ఆస్తి పన్ను రూ.20 వేలకు చేరే వరకూ క్రమంగా దీనిని పెంచుతారన్నమాట. తొలి సంవత్సరం రూ.12 వేలు, రెండో సంవత్సరంలో రూ.14,400, మూడో సంవత్సరంలో రూ.17,280 వసూలు చేసి, ఇక ఆ తర్వాత నుంచి పన్నును రూ.20 వేలు చొప్పున వసూలు చేస్తారు.
విలువలు సవరిస్తే పన్ను కూడా పెరుగుతుంది
భూములు/ ఆస్తుల విలువను రిజిస్ట్రేషన్ (రెవెన్యూ) శాఖ సవరిస్తే... ఆస్తి పన్ను కూడా పెరగనుంది. ఉదాహరణకు, రిజిస్ట్రేషన్ లెక్కల ప్రకారం ఆస్తి విలువ రూ.50 లక్షలుగా ఉంటే.. ఏడాదికి రూ.10 వేల పన్ను వసూలు చేస్తున్నారని అనుకుందాం. విలువల సవరణలో భాగంగా ఆస్తి విలువ రూ.60 లక్షలు అయితే.. ఆస్తి పన్ను రూ.12 వేలుగా ఉండనుంది. భూముల విలువలను ఆర్థిక సంవత్సరం మధ్యలో అంటే సెప్టెంబరులో సవరిస్తే.. పన్నును వెంటనే పెంచరు. ఏటా ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది కనక అప్పటి నుంచే పెంచుతారు. అదే సమయంలో, భూముల విలువలు సవరించిన నాటి నుంచే పెంచిన ఆస్తి పన్నును వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించవచ్చు కూడా.
ఆస్తులకు డిజిటల్ గుర్తింపు
కొత్త బిల్లు ప్రకారం మూడు ప్రాంతాల్లోని ఆస్తులకు డిజిటల్ గుర్తింపు ఇవ్వనున్నారు. ప్రతి భూమి.. ప్రతి భవనానికి ప్రత్యేక కోడ్ ఉండనుంది. రిజిస్ట్రేషన్‌తోనే ఆటోమేటిక్ మ్యుటేషన్ జరగనుంది. అయితే, ఆస్తి పన్ను బకాయిలను రిజిస్ట్రేషన్‌కు ముందే చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ప్రతి భూమి, భవనానికి ప్రత్యేకమైన ‘ఇంటిగ్రేటెడ్ ప్రాపర్టీ ఐడెంటిటీ కోడ్’ కేటాయించనున్నారు. ఇది డిజిటల్ రిజిస్టర్‌లో నమోదవుతుంది. భవిష్యత్తులో అదే ఆస్తికి సంబంధించిన విద్యుత్తు, నల్లా తదితర బిల్లుల వసూలును దీనికి అనుసంధానించే అవకాశం ఉంది. కోర్ పరిధిలో ఆస్తుల గుర్తింపునకు ప్రత్యేక డిజిటల్ వ్యవస్థను ప్రతిపాదించారు. ఈ కోడ్ డిజిటల్ రూపంలో, క్యూ ఆర్ కోడ్ రూపంలో లేదా ఇతర నిర్ణీత విధానాల్లో ఉంచవచ్చు. దాన్ని తొలగించడం, ధ్వంసం చేయడం లేదా తారుమారు చేయడం నేరంగా పరిగణించి జరిమానా విధిస్తారు. ఇక, బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్‌మెంట్లు, నివాస సముదాయాలకు ఒక కోడ్‌తోపాటు అవసరమైతే అందులో ఉండే ఒక్కో నివాస యూనిట్‌కు ప్రత్యేక సబ్ కోడ్ కేటాయించవచ్చు.
ఖాళీ స్థలాలకు పన్ను
ఖాళీ స్థలాలు కూడా పన్ను పరిధిలోకి వస్తాయి. వీటిపై ఆస్తి విలువలో 0.50 శాతం పన్నుగా విధించే ప్రతిపాదన ఉంది. అయితే, భవనం పక్కన ఉండే పరిమిత ఖాళీ స్థలాన్ని ఆ భవనానికి అనుబంధ స్థలంగా పరిగణించే వెసులుబాటు ఉంది. ఖాళీ స్థలంలో చెత్త పేరుకుపోయి అపరిశుభ్ర పరిస్థితులు ఉంటే అదనంగా 0.25 శాతం పెనాల్టీ విధిస్తారు. ఖాళీ స్థలంలో చెత్తను తొలగించే దాకా ఈ పెనాల్టీ కొనసాగుతుంది.
రిజిస్ట్రేషన్‌కు ముందే పన్ను బకాయిలు కట్టాలి
ఆస్తి అమ్మకం (సేల్), బహుమతి (గిఫ్ట్), తనఖా (మార్ట్‌గేజ్), విభజన (పార్టిషన్), మార్పిడి లేదా వారసత్వ బదలాయింపు వంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియల్లోనూ కీలక మార్పు రానుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్లాట్ బుక్ చేసిన వెంటనే ఆస్తి వివరాలు, బదలాయింపుదారు, కొనుగోలుదారు తదితర వివరాలు డిజిటల్‌గా కార్పొరేషన్‌కు చేరతాయి. అప్పుడు, ఆస్తి పన్ను కట్టారా లేదా? బకాయిలు ఏమైనా ఉన్నాయా తదితర వివరాలను కార్పొరేషన్ పరిశీలిస్తుంది. బకాయిలు ఉంటే.. రిజిస్ట్రేషన్‌కు ముందే వసూలు చేస్తుంది. రిజిస్ట్రేషన్‌కు ముందే సబ్ రిజిస్ట్రార్ కూడా నో డ్యూస్ సర్టిఫికెట్‌ను తీసుకుంటారు. ఒకవేళ, సదరు ఆస్తి అప్పటికి అసె్‌సమెంట్ కాకపోతే, రిజిస్ట్రేషన్‌కు ముందే కార్పొరేషన్ సదరు ఆస్తిని అసె్‌సమెంట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ, కార్పొరేషన్ అసె్‌సమెంట్ చేయకపోతే, సబ్ రిజిస్ట్రార్ అసె్‌సమెంట్ చేయడమే కాదు.. మూడేళ్ల పన్నును కూడా వసూలు చేస్తారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ప్రత్యేకంగా మ్యుటేషన్ కోసం తిరగాల్సిన అవసరం ఉండదు. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే సబ్ రిజిస్ట్రార్ ఆటోమేటిక్‌గా మ్యుటేషన్ చేయాలి. అనంతరం కొత్త యజమానికి మ్యుటేషన్ సర్టిఫికెట్ జారీ చేయాలి.
అక్రమ నిర్మాణాలకు 300 శాతం పెనాల్టీ
అనుమతి లేకుండా నిర్మించిన భవనాలు, అదనపు అంతస్తులు, అనుమతించిన సెట్ బ్యాక్‌ల ఉల్లంఘనలకు ఆస్తి పన్నుతోపాటు పెనాల్టీ విధించే ప్రతిపాదన ఉంది. అనుమతించిన అంతస్తుల్లోనే సెట్‌బ్యాక్ ఉల్లంఘన ఉంటే స్థాయిని బట్టి ఆస్తి పన్నులో 25 శాతం లేదా 50 శాతం పెనాల్టీ విధించవచ్చు. అనుమతించిన అంతస్తులకు మించి అదనపు అంతస్తులు నిర్మిస్తే.. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత మొదటి అంచనా జరిగితే ఆస్తి పన్నులో 300 శాతం వరకు పెనాల్టీ విధించే నిబంధన ఉంది. మొత్తం నిర్మాణమే అనధికారికంగా ఉన్నా ఇదే స్థాయిలో పెనాల్టీ విధించే అవకాశం ఉంది. భవన వినియోగాన్ని ఉల్లంఘిస్తే.. ఆస్తి పన్నులో 100 శాతం పెనాల్టీతోపాటు కొత్త వినియోగానికి అనుగుణంగా పన్ను విధిస్తారు. పెనాల్టీలు చెల్లించినంత మాత్రాన అక్రమ నిర్మాణం చట్టబద్ధంగా మారదు. సంబంధిత నిర్మాణాన్ని కూల్చివేయడం లేదా చట్టబద్ధంగా తీసుకునే ఇతర చర్యలకు ఈ పెనాల్టీ అడ్డంకి కాదు.
ముందుగానే పన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ
ఆస్తి పన్నును ఏప్రిల్ 30లోపు చెల్లించే వారికి 5 శాతం రిబేట్ ఇవ్వాలని ప్రతిపాదించారు. పర్యావరణ పరిరక్షణ, వనరుల సమర్థ వినియోగం, సస్టెయినబులిటీ చర్యలు, నెట్-జీరో ప్రమాణాలను అనుసరించే ఆస్తులకు అదనపు రాయితీకి కూడా అవకాశం కల్పించారు.
ప్రభుత్వ ఆస్తులకు సర్వీస్ చార్జీలు
కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ శాఖల ఆస్తులపై మున్సిపల్ సేవల అందుబాటును బట్టి 75 శాతం, 50 శాతం లేదా 33 శాతం చొప్పున సర్వీస్ చార్జీలు విధించే ప్రతిపాదన ఉంది. అదే సమయంలో ప్రభుత్వ కంపెనీలు, సొసైటీలు, చట్టబద్ధ సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థల ఆస్తులను సాధారణ కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులుగా పరిగణించకుండా ఆస్తి పన్ను పరిధిలోకి తీసుకురావాలని పేర్కొన్నారు.
ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇచ్చిన ఆర్నెల్ల నుంచి పన్ను
ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేసిన ఆర్నెల్ల నుంచి ఆస్తి పన్ను వసూలు చేయనున్నారు. జనవరి 1వ తేదీన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇస్తే.. జూలై నుంచి పన్ను వసూలు చేస్తారు. ఇక, 100 విల్లాలు కట్టిన యజమాని జనవరి 1వ తేదీన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొంది... అందులో 85 విల్లాలను జూలైలో 85 అమ్మితే... మొత్తం 100 యూనిట్లకు ఆస్తి పన్ను విధిస్తారు. ఇక ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ కానంత వరకు ఆ భవనానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంట్ కనెక్షన్, తాగు/మురుగునీటి కనెక్షన్ ఇవ్వరు.
కోర్ పరిధిలో 50 శాతం మహిళలకు రిజర్వేషన్
కోర్ పరిధిలో జరిగే మున్సిపల్ కార్పొరేషన్‌లో జరిగే ప్రత్యక్ష ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఇక వార్డుల కమిటీల్లో పౌరుల భాగస్వామ్యం ఉంటుంది. ప్రతి వార్డులో 25 మందితో ఏర్పాటయ్యే కమిటీల్లో 50 శాతం మంది సాధారణ పౌరులు/రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్నారు. మున్సిపల్ మార్కెట్‌లు, వెండింగ్ జోన్‌లలో మహిళలకు, ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేకంగా దుకాణాలు కేటాయించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
‘సర్’ విచారణలో వెనకబాటు
నీళ్లియ్యమని నన్ను అడగొద్దు
Read Latest AP News And Telangana News And International News And Telugu News