రూ. కోట్లు వెచ్చించినా అంధకారమే..
ABN , Publish Date - Sep 13 , 2026 | 02:26 AM
ఇదీ.. కరీంనగర్ బైపాస్‌లోని దుస్థితి. డివైడర్ మధ్యలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ లైట్లలో సగం వెలగడం లేదు. ఇంకొన్ని మిణుకు మిణుకుమంటూ గుడ్డి దీపాలుగా మారాయి. తీగల వంతెన నుంచి కరీంనగర్, పెద్దపల్లి వైపునకు వెళ్లే రాజీవ్‌రహదారి రాత్రి వేళల్లో పూర్తిగా అంధకారమవుతోంది. హౌసింగ్ బోర్డు సహా పలు చౌరస్తాల్లో చిమ్మచీకట్లోనే వాహనదారులు, ప్రజలు ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని రోడ్డు దాటాల్సిన దుస్థితి నెలకొంది.
- బైపాస్ మార్గాల్లో వెలగని లైట్లు
- బాధ్యత తీసుకోవడంలో శాఖల నిర్లక్ష్యం
(ఆంధ్రజ్యోతి, కరీంనగర్/ కరీంనగర్ టౌన)
ఇదీ.. కరీంనగర్ బైపాస్‌లోని దుస్థితి. డివైడర్ మధ్యలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ లైట్లలో సగం వెలగడం లేదు. ఇంకొన్ని మిణుకు మిణుకుమంటూ గుడ్డి దీపాలుగా మారాయి. తీగల వంతెన నుంచి కరీంనగర్, పెద్దపల్లి వైపునకు వెళ్లే రాజీవ్‌రహదారి రాత్రి వేళల్లో పూర్తిగా అంధకారమవుతోంది. హౌసింగ్ బోర్డు సహా పలు చౌరస్తాల్లో చిమ్మచీకట్లోనే వాహనదారులు, ప్రజలు ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని రోడ్డు దాటాల్సిన దుస్థితి నెలకొంది.
- 2021-22 సంవత్సరంలో స్మార్ట్‌సిటీ నిధులు రూ. 16 కోట్లతో నగరమంతా జిగేల్‌మనిపించే విధంగా ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. నగరం అవతల చీకట్లను తొలగించాలని ఎల్‌ఎండీ నుంచి చల్మెడ ఆస్పత్రి వరకు, ఎన్టీఆర్ చౌరస్తా నుంచి పద్మానగర్ వరకు కార్పొరేషన ఆధ్వర్యంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసింది. ఇది ముణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది. వేసిన కొన్నాళ్లకే చాలాచోట్ల దీపాలు వెలగ లేదు. ఈ విషయంలో శాఖల మధ్య సమన్వయ లేమి శాపంగా మారింది.
ఫ ఏజెన్సీ గడువు మూడేళ్లే..
నగరంలో అన్నిరకాల ఎల్‌ఈడీ లైట్లు కలిపి 11,845 ఏర్పాటు చేశారు. బైపాస్ రోడ్లపై 568 సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ను పెట్టారు. 268 హైమాస్ట్ లైట్లు అమర్చారు. వీటి నిర్వహణ బాధ్యతలను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. మూడేళ్ల వ్యవధి వరకే వారు పోయిన లైట్లను మార్చారు. తలెత్తిన లోపాలను సవరించారు. ఏడాదిన్నరగా వాటిని పట్టించుకున్న నాథుడే లేదు. గడువు ముగిసిందనే నెపంతో ఏజెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంది. తర్వాత వీటి నిర్వహణను కార్పొరేషన గాలికొదిలేసింది.ఇప్పటికే నగరంలోని వీధి దీపాల నిర్వహణ బల్దియాకు శాపంగా మారుతోంది. వాస్తవానికి బైపాస్ మార్గాల్లోని సెంట్రల్ లైటింగ్‌ను రాజీవ్‌రహదారి నిర్వహణ బాధ్యతల్ని చూస్తున్న సంస్థనే ఏర్పాటు చేయాలి. వాళ్లు పట్టించుకోకపోవడంతో స్మార్ట్‌సిటీలో ఉన్న నిధులతో బైపాస్‌లో రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి కార్పొరేషన ముందుకొచ్చి లైట్లను సమకూర్చింది. ఎన్టీఆర్ చౌరస్తా నుంచి వేములవాడ దిశగా బైపాస్ మార్గంలోనూ జాతీయరహదారుల అభివృద్ధి సంస్థ బాధ్యతల్ని తీసుకోవాలి. వాళ్లు కూడా ఈ మార్గాన్ని విస్మరించడంతో పద్మానగర్ వరకు స్మార్ట్‌సిటీ నిధులు, అక్కడి నుంచి కమానపూర్ వరకు సుడా నిధుల్ని ఖర్చు చేసి లైట్లు ఏర్పాటు చేశారు.
ఫ నిధులు లేకనే..
ఇప్పటికే కరీంనగర్ కార్పొరేషన విలీన గ్రామాలతో విస్తరించడం వల్ల మెజారిటీ నిధులు వీధి దీపాల ఏర్పాట్లు, నిర్వహణకు వెచ్చిస్తున్నారు. బైపాస్ మార్గంలోని సెంట్రల్ లైటింగ్‌ను పట్టించుకోవడమనేది అదనపు భారంగా మారిందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మేలో నగరంలోని వీధి దీపాల నిర్వహణకు సంబంధించి పీసీబీలు, ఎంసీబీలు, పీవీసీ బాక్స్‌లను అమర్చడం, మరమ్మతుల కోసం 49 లక్షల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. గతంలోనూ వీటిని అమర్చినా కొన్ని రోజులకే ఇవి చెడిపోతున్నాయని ఇటీవల బల్దియా సమావేశంలోనూ కార్పొరేటర్లు ప్రస్తావించారు. అందుకని బల్దియాపై నిధుల రూపంలో ఆర్థిక భారాన్ని తప్పించేందుకు బైపాస్ మార్గాల్లోని సెంట్రల్ లైటింగ్ నిర్వహణను ఎనహెచఏఐతోపాటు టోల్‌ప్లాజా నిర్వణదారులు బాధ్యతల్ని తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నిత్యం 18లక్షల వరకు టోల్ ప్లాజా వద్ద వాహనాల రుసుమును వసూలు చేస్తున్న సంస్థ వీటిని పట్టించుకోవాలని విన్నవిస్తున్నారు.