Share News

త్వరలో మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి పాస్‌

ABN , Publish Date - Sep 07 , 2026 | 05:57 AM

హైదరాబాద్‌లో మెట్రో రైలు, ఆర్టీసీ బస్సు ప్రయాణానికి ఉమ్మడి పాస్‌ను వెంటనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు సౌలభ్యంగా ఉండేలా నెలవారీ, రోజువారీ పాస్‌లు జారీ చేయాలని సూచించారు.

త్వరలో మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి పాస్‌
cs

రోజువారీ, నెలవారీ పాస్‌ల జారీకి సీఎస్‌ జాజు ఆదేశం

సిద్ధమన్న అధికారులు మెట్రోలో ప్రయాణించిన సీఎస్‌

‘ఎలివేటెడ్‌ కారిడార్ల’ పరిశీలన

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో మెట్రో రైలు, ఆర్టీసీ బస్సు ప్రయాణానికి ఉమ్మడి పాస్‌ను వెంటనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు సౌలభ్యంగా ఉండేలా నెలవారీ, రోజువారీ పాస్‌లు జారీ చేయాలని సూచించారు. ఆదివారం ఆయన ఇక్కడ రసూల్‌పురాలోని మెట్రో రైల్‌ భవన్‌లో హెచ్‌ఎంఆర్‌ఎల్‌, ఆర్టీసీ, విద్యుత్‌ శాఖ, హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్స్‌ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి పాస్‌ ప్రవేశపెట్టేందుకు సాంకేతికపరంగా సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు హైదరాబాద్‌ మెట్రో మొదటి, రెండో దశల్లో చేపట్టిన వివిధ చర్యలపై మెట్రో రైల్‌ ఎండీ సర్ఫరాజ్‌ అహ్మద్‌ సీఎ్‌సకు వివరించారు. పాతబస్తీలో 7.5 కిలోమీటర్ల మెట్రో కారిడార్‌ విస్తరణ పనుల తాజా స్థితిగతులను సీఎస్‌ అడిగి తెలుసుకుని.. వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం సంజయ్‌ జాజు బేగంపేట్‌ నుంచి ప్యారడైజ్‌ వరకు మెట్రో రైల్‌లో ప్రయాణించారు. ఆయా స్టేషన్లలో వాణిజ్య సముదాయాలు, పార్కింగ్‌ స్థలాలను పరిశీలించారు. అనంతరం ఎన్‌హెచ్‌-44పై ప్యారడైజ్‌ జంక్షన్‌ నుంచి డెయిరీ ఫార్మ్‌ రోడ్‌ వరకు నిర్మిస్తున్న 5.40 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులను పరిశీలించారు. అన్ని శాఖలు, సంస్థలు సమన్వయంతో పనిచేసి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. లీ రాయల్‌ ఫంక్షన్‌ హాలు వద్ద భూసేకరణ, బేగంపేట విమానాశ్రయ ప్రాంగణంలో 600 మీటర్ల సొరంగం నిర్మాణానికి అనుమతులు,పెండింగ్‌లో ఉన్న రక్షణ శాఖ భూముల సేకరణ అంశాలపై పలు శాఖల అధికారులతో సమీక్షించారు. ప్యారడైజ్‌ నుంచి శామీర్‌పేట్‌ ఔటర్‌ జంక్షన్‌ వరకు 18.18 కిలోమీటర్ల కారిడార్‌ పనులను కూడా సీఎస్‌ పరిశీలించారు. ఈ ఎలివేటెడ్‌ కారిడార్లు అత్యంత కీలకమైన ప్రాజెక్టులని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వీటికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. అన్ని శాఖలు, సంస్థలు సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నేటి నుంచి అసెంబ్లీ

రాష్ట్రంలో 369 పబ్లిక్‌ ఈవీ చార్జింగ్‌ కేంద్రాలు!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 07 , 2026 | 05:57 AM