Share News

రాష్ట్రంలో 369 పబ్లిక్‌ ఈవీ చార్జింగ్‌ కేంద్రాలు!

ABN , Publish Date - Sep 07 , 2026 | 05:47 AM

రాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్‌ ఈవీ చార్జింగ్‌ మౌలిక వసతులను భారీగా విస్తరించేందుకు తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీ రెడ్కో) ప్రత్యేక చర్యలు చేపట్టింది.

రాష్ట్రంలో 369 పబ్లిక్‌ ఈవీ చార్జింగ్‌ కేంద్రాలు!
Charging

  • టెండర్లు ఆహ్వానించిన రెడ్కో

  • గ్రేటర్‌ హైదరాబాద్‌లో 200, ఎన్పీడీసీఎల్‌లో 169 స్టేషన్లు

  • హైదరాబాద్‌లో 6 క్లస్టర్లలో 200 కేంద్రాలకు 10 ఏళ్ల కాంట్రాక్ట్‌

  • ఈవీ స్టేషన్లలో యూనిట్‌కు రూ.13గా టారిఫ్‌ నిర్ణయం

  • నేడు ప్రీ బిడ్‌ సమావేశం

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్‌ ఈవీ చార్జింగ్‌ మౌలిక వసతులను భారీగా విస్తరించేందుకు తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీ రెడ్కో) ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రేటర్‌ హైదరాబాద్‌, ఎన్పీడీసీఎల్‌ పరిధిలో 369 పబ్లిక్‌ ఈవీ చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణ, అప్‌గ్రెడేషన్‌కోసం ప్రైవేట్‌ చార్జ్‌ పాయింట్‌ ఆపరేటర్లను (సీపీవోఎస్‌) ఆహ్వానిస్తూ టెండర్లు జారీ చేసింది. దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందువరుసలో ఉంది. ఈవీ చార్జింగ్‌ కేంద్రాల విద్యుత్తు వినియోగం పరంగా దేశంలో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా ఈవీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వాటికి అనుగుణంగా చార్జింగ్‌ సదుపాయాల విస్తరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. సోమవారం ఉదయం 11 గంటలకు 200 ఈవీ చార్జింగ్‌ స్టేషన్ల ప్రాజెక్టుకు, 11.30 గంటలకు 169 చార్జింగ్‌ స్టేషన్ల ప్రాజెక్టుకు టీజీ రెడ్కో ప్రధాన కార్యాలయంలో ప్రీ బిడ్‌ సమావేశాలు నిర్వహిస్తున్నారు. బిడ్ల సమర్పణ ప్రక్రియ ఈ నెల 22న ముగియనుంది. తెలంగాణ ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ పోర్టల్‌ ద్వారా టెండర్లను సమర్పించాలని అధికారులు తెలిపారు. గ్రేటర్‌ హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో టీజీ రెడ్కో తీసుకొచ్చిన 200 పబ్లిక్‌ ఈవీ చార్జింగ్‌ స్టేషన్లను ఆరు క్లస్టర్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఈవీ చార్జింగ్‌ స్టేషన్లలో తరచూ చార్జింగ్‌ గన్నుల దొంగతనాలు జరగడంతో అవి మూలన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో చార్జింగ్‌ స్టేషన్ల కార్యకలాపాలు, నిర్వహణ, అప్‌గ్రెడేషన్‌బాధ్యతలను 10 ఏళ్లపాటు టెండర్లు దక్కించుకున్న సంస్థలకు అప్పగిస్తారు. . టీజీఎన్పీడీసీఎల్‌ పరిధిలోని వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాల్లోని 16 ప్రాంతాల్లో 169 పబ్లిక్‌ ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు కొత్తగా ఏర్పాటు చేయబోతున్నారు. వాటి నిర్వహణను ఎంపికైన ప్రైవేట్‌ చార్జ్‌ పాయింట్‌ ఆపరేటర్లు సర్వే, డిజైన్‌, సరఫరా, సివిల్‌ వర్క్స్‌, ఇన్‌స్టాలేషన్‌, టెస్టింగ్‌, కమిషనింగ్‌తో పాటు పదేళ్లపాటు నిర్వహించాల్సి ఉంటుంది. పీఎం ఈ డ్రైవ్‌ పథకంలో భాగంగా అర్హులైన బిడ్డర్‌కు నిబంధనలకు లోబడి రాయితీలు అందించనున్నారు. ఈవీ చార్జింగ్‌ టారి్‌ఫను యూనిట్‌కు రూ.13 (జీఎస్టీఅదనం)గా నిర్ణయించారు. కాంట్రాక్ట్‌ కాలంలో ఇదే టారిఫ్‌ అమల్లో ఉంటుందని, హైదరాబాద్‌లో చార్జర్లకు కనీసం 95 శాతం అప్‌టైం ఉండేలా నిబంధనలు రూపొందించారు.


ఈవీ రంగంలో వ్యాపార విస్తరణ

తెలంగాణను ఈవీ రంగంలో పెట్టుబడులు, వ్యాపార విస్తరణకు అత్యంత అనుకూలమైన మార్కెట్‌గా మారుస్తున్నాం. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల డిమాండ్‌ వేగంగా పేరుగుతోంది. ఈవీ రంగంలో విస్తృత వ్యాపార అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్‌రంగం ఈ అవకాశాలను అందిపుచ్చుకునేలా దీర్ఘకాలికంగా, వాణిజ్యపరంగా నిలకడైన ఈవీ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడమే లక్ష్యం.

-ముషారఫ్‌ ఫారూఖీ, రెడ్కో ఎండీ


ఈ వార్తలు కూడా చదవండి..

నేటి నుంచి అసెంబ్లీ

కేసీఆర్‌ అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 07 , 2026 | 05:47 AM