Share News

నేటి నుంచి అసెంబ్లీ

ABN , Publish Date - Sep 07 , 2026 | 04:31 AM

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి.

నేటి నుంచి అసెంబ్లీ
Telangana Assembly

  • 5 రోజులపాటు వర్షాకాల సమావేశాలు!

  • అస్త్రశస్త్రాలతో అధికార, విపక్షాలు సిద్ధం

  • వెయ్యి రోజుల పాలనపై చర్చకు చాన్స్‌

  • సంబరాలు చేసుకుంటున్న అధికార పక్షం

  • చార్జిషీట్‌ విడుదల చేసిన ప్రతిపక్షం

  • కేసీఆర్‌ రాజీనామాకు కాంగ్రెస్‌ డిమాండ్‌ !

  • 22ఏపై చర్చకు బీఆర్‌ఎస్‌, బీజేపీ పట్టు!

  • పూర్తిస్థాయిలో వివరణకు సీఎం కసరత్తు

హైదరాబాద్‌, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత సభ వాయిదా పడనుంది. అనంతరం స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశంలో.. వర్షాకాల శాసనభ సమావేశాల ఎజెండాను ఖరారు చేస్తారు. ఈ సమావేశాలు శుక్రవారం వరకు జరిగే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. కాగా, శాసనసభ సమావేశాల్లో ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ అసెంబ్లీకి హాజరు కాకపోవడాన్నే అధికార కాంగ్రెస్‌ టార్గెట్‌ చేయనున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి అసెంబ్లీ నిబంధనల ప్రకారం ప్రధాన ప్రతిపక్ష నేత (ఎల్‌వోపీ) వరుసగా 50 రోజులకు పైబడి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే.. ఆ హోదా నుంచి ఆయనను తొలగించే ఆస్కారం ఉంది. అయితే శాసనసభకు గైర్హాజరవుతూ వస్తున్న ఎల్‌వోపీ కేసీఆర్‌.. ఇంకా ఈ నిబంధనల పరిధిలోకి రాలేదని అంటున్నారు. అప్పుడప్పుడూ ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్న నేపథ్యంలో ఆ నిబంధనలు ఆయనకు వర్తించవని చెబుతున్నారు. అధికార పక్షం మాత్రం ఇదే అంశాన్ని అస్త్రంగా చేసుకుని.. అసెంబ్లీకి రాని కేసీఆర్‌ నైతిక బాధ్యతగా తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్‌ సీఎంగానే సభలో అడుగు పెడతారంటూ ఇటీవల కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఆ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. కేసీఆర్‌ రాజీనామా చేయాలంటూ ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల వివాదంగా మారిన 22ఏ అంశంపై శాసనసభలో చర్చకు పట్టుబట్టాలని బీఆర్‌ఎస్‌, బీజేపీ ఇప్పటికే నిర్ణయించాయి. ఈ మేరకు ప్రకటన కూడా చేశాయి. అయితే సీఎం రేవంత్‌రెడ్డి దీనిపై పూర్తిస్థాయి వివరణ ఇచ్చేందుకు, అవసరమైతే ఎదురుదాడి చేసేందుకూ సన్నద్దమవుతున్నారు. ఈ అంశంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాం నుంచి ఏం జరిగిందన్నది సవివరంగా ప్రస్తావించే అవకాశం ఉందంటున్నారు. ఆదివారం ఆయన 22ఏపై రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో సమావేశమై సమీక్షించారు. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ అంశం కేంద్రంగా కూడా వాడీ వేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. వెయ్యి రోజుల పాలనకు సంబంధించి అధికార కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటుండగా, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ దీనిపై చార్జిషీట్‌ విడుదల చేసింది. బీజేపీ సభ్యులు సైతం వెయ్యి రోజుల పాలనా వైఫల్యాలను సభలో లేవనెత్తుతామని చెబుతున్నారు. మొత్తమ్మీద దాడి.. ఎదురుదాడి కోసం అధికార, విపక్ష పార్టీలు సిద్ధమవడంతో సమావేశాలు హోరాహోరీగానే జరిగే అవకాశం ఉంది.


నేడు అసెంబ్లీ సెంట్రల్‌ హాల్‌ ప్రారంభం..

శాసనసభ, శాసనమండలి రెండూ ఒకే భవనంలో కొలువుదీరిన నేపథ్యంలో పార్లమెంటు తరహాలో అసెంబ్లీ భవనంలోనూ సెంట్రల్‌ హాల్‌ ఏర్పాటు జరిగింది. లాబీలు, ఎమ్మెల్యేల లాంజ్‌ను నవీకరించి.. యుద్ధప్రాతిపదికన సెంట్రల్‌ హాల్‌ను నిర్మించారు. దివంగత మాజీ స్పీకర్‌ దుద్దిళ్ల శ్రీపాదరావు పేరుతో ఏర్పాటు చేసిన ఈ సెంట్రల్‌ హాల్‌ను సోమవారం ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.


పలు బిల్లులకు ఆమోదం!

వర్షాకాల సమావేశాల్లో పలు కీలక బిల్లులను ఆమోదానికి శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (క్యూర్‌) బిల్లును ఈ సమావేశాల్లోనే ఆమోదం కోసం పెట్టే అవకాశం ఉంది. అలాగే ‘హేట్‌ స్పీచ్‌’ బిల్లు కూడా చర్చకు వచ్చే ఆస్కారం ఉంది. వీటితోపాటు మరికొన్ని సాధారణ బిల్లులనూ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తెలంగాణ సమగ్ర శిక్షా (టీఎస్ఎస్‌) 2024-25, పీఎం స్కూల్‌ ఫర్‌ రైజింగ్‌ (పీఎంఎస్‌హెచ్‌ఆర్‌ఐ) 2024-25 ఆడిట్‌ రిపోర్టులను, హైదరాబాద్‌ మెట్రో రైల్‌కు సంబంధించి 2013 నుంచి 2018 వరకు వార్షిక నివేదికలను సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం శాసనసభ, మండలిలో టేబుల్‌ చేయనున్నారు.


వెనుక వరుసకు కొండా సురేఖ సీటు!

కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేసిన నేపథ్యంలో ఇప్పటిదాకా ముందు వరుసలో ఉన్న ఆమె సీటు.. ఇక వెనుక వరుసలకు మారనుంది. వెనుక వరుసలో అక్షర క్రమం ప్రకారం ఆమె సీటును కేటాయించనున్నారు. అయితే గత సమావేశాల వరకూ మంత్రి హోదాలో సభకు హాజరైన కొండా సురేఖ.. ప్రస్తుత సమావేశాలకు సాధారణ ఎమ్మెల్యేగా హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి..

సన్నబియ్యం అమ్మితే రేషన్ కార్డు తొలగిస్తాం: మంత్రి తుమ్మల

రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారు.. హరీశ్‌రావు ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 07 , 2026 | 04:39 AM