లోన్ యాప్ వేధింపులకు కానిస్టేబుల్ బలి
ABN , Publish Date - Nov 11 , 2026 | 04:32 AM
ఆన్లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు ఓ కానిస్టేబుల్ ప్రాణం తీశాయి. తీసుకున్న రుణం చెల్లించలేదంటూ రికవరీ ఏజెంట్లు అతడిని అసభ్యకరంగా వేధించడంతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులకు మార్ఫింగ్ చేసిన ఫొటోలు పంపి బ్లాక్మెయిల్ చేశారు.
రూ.40 వేలు చెల్లించాలని బెదిరింపులు
ఫొటోలు మార్ఫింగ్ చేసి బంధువులకు..
అవమానం తట్టుకోలేక ఉరేసుకున్న శ్రీను
అయినా వదలని యాప్ ఏజెంట్లు
డబ్బు కట్టాలంటూ అసభ్య పదజాలంతో అతని భార్యకు వేధింపులు
హైదరాబాద్ సిటీ/ పహాడీషరీఫ్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఆన్లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు ఓ కానిస్టేబుల్ ప్రాణం తీశాయి. తీసుకున్న రుణం చెల్లించలేదంటూ రికవరీ ఏజెంట్లు అతడిని అసభ్యకరంగా వేధించడంతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులకు మార్ఫింగ్ చేసిన ఫొటోలు పంపి బ్లాక్మెయిల్ చేశారు. ఈ వేధింపులు భరించలేక మనస్తాపానికి గురైన కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణంతో దుఃఖంలో ఉన్న అతడి భార్యను కూడా రికవరీ ఏజెంట్లు వదలకుండా డబ్బుల కోసం వేధించారు.
ఈ ఘటన హైదరాబాద్ పహాడీపరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. తుక్కుగూడలోని హర్షగూడకు చెందిన ముడావత్ శ్రీను (31) కొండాపూర్ బెటాలియన్‌లో కానిస్ట్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటుపడిన అతడు నాలుగు నెలలు క్రితం ఓ లోన్ యాప్ ద్వారా రూ.40 వేలు రుణం తీసుకున్నాడు. సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో రికవరీ ఏజెంట్ల నుంచి వేధింపులు మొదలయ్యాయి. శ్రీను ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి కుటుంబ సభ్యులు, స్నేహితులకు పంపడంతో పాటు సోషల్ మీడియాలో పెట్టి బ్లాక్ మెయిలింగ్‌కు దిగారు.
పండక్కి భార్య పుట్టింటికి వెళ్లడంతో..
శ్రీను మహేశ్వరం సమీపంలోని మనసాన్ పల్లిలో భార్యతో కలసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. దీపావళి సందర్భంగా భార్య పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు తీవ్రమయ్యాయి. తన మార్ఫింగ్ ఫొటోలను అందరికీ పంపుతుండటంతో పరువు పోతుందని మనస్తాపానికి గురైన శ్రీను సోమవారం తన స్వంత గ్రామమైన హర్షగూడకు వెళ్లాడు. అక్కడ ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బయట ఉన్న అతడి తల్లి ఎంతసేపటికి తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా శ్రీను విగత జీవిగా కనిపించాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో ఇన్స్పెక్టర్ బీఎల్ఎన్ రెడ్డి, ఎస్ఐ వినోద్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. లోని యాప్ వేధింపుల కారణంగానే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని శ్రీను తల్లి గౌరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భార్యనూ వదలని ఏజెంట్లు
శ్రీను మరణవార్త తెలిసి భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగానే లోన్ యాప్ ఏజెంట్లు ఆమెకు ఫోన్ చేశారు. భర్త తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించాలని ఒత్తిడిచేయడంతో పాటు అసభ్య పదజాలంతో దూషించినట్లు తెలిసింది. తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పినా ఏజెంట్లు కనికరించకుండా వేధించారని శ్రీను భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి.
విద్యాసంస్థల్లో సినిమా కార్యక్రమాలు నిషేధం!
కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా రావాల్సిందే..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News