Share News

అంతరిక్షానికి బేస్‌-1 నిచ్చెన

ABN , Publish Date - Nov 06 , 2026 | 05:29 AM

అంతరిక్ష రంగంలో హైదరాబాద్‌ మరో కీలక ముందడుగు వేసింది. అంతరిక్షంలో పేరుకుపోతున్న వ్యర్థాలను తొలగించడంతోపాటు, కక్ష్యలోనే ఉపగ్రహాలకు మరమ్మతులు చేసే సదవలందించేందుకు దేశంలోనే తొలి ప్రైవేట్‌ సమగ్ర అంతరిక్ష సవల కేంద్రం హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది.

అంతరిక్షానికి బేస్‌-1 నిచ్చెన
Cosmoserve Base 1

  • హైదరాబాద్‌లో మరో ప్రతిష్ఠాత్మక కేంద్రం ఏర్పాటు

  • కాస్మోసర్వ్‌ బేస్‌-1ను ప్రారంభించిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు జితేంద్ర, దుద్దిళ్ల

హైదరాబాద్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): అంతరిక్ష రంగంలో హైదరాబాద్‌ మరో కీలక ముందడుగు వేసింది. అంతరిక్షంలో పేరుకుపోతున్న వ్యర్థాలను తొలగించడంతోపాటు, కక్ష్యలోనే ఉపగ్రహాలకు మరమ్మతులు చేసే సదవలందించేందుకు దేశంలోనే తొలి ప్రైవేట్‌ సమగ్ర అంతరిక్ష సవల కేంద్రం హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. కాస్మోసర్వ్‌ స్పేస్‌ సంస్థ ఏర్పాటు చేసిన ‘బేస్‌-1’ కేంద్రాన్ని గురువారం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ వర్చువల్‌గా, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రత్యక్షంగా ప్రారంభించారు. అంతరిక్షంలో వస్తువులను గుర్తించే స్పేస్‌ విజన్‌ ఎఫెక్ట్‌, మైక్రోగ్రావిటీ సిమ్యులేషన్‌ సదుపాయాలతో కూడిన ఈ కేంద్రం ప్రపంచంలోనే ఆరోది కావడం విశేషం.


ఇందులో ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, పరీక్షించడం, ప్రయోగాలు నిర్వహించడం వంటి కార్యకలాపాలు ఉంటాయి. బేస్‌-1 ప్రారంభం భారత ప్రైవేట్‌ అంతరిక్ష రంగంలో కీలక మైలురాయి అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ అన్నారు. అంతరిక్ష రోబోటిక్స్‌, ఉపగ్రహాలను చేరుకోవడం, వాటి అనుసంధానం, మిషన్‌ కంట్రోల్‌ వంటి సదుపాయాలను ఒకేచోట అందించటం ద్వారా భారత అంతరిక్ష స్టార్ట్‌పల సామర్థ్యాలు పెరుగుతాయని చెప్పారు. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన చిరంజీవి ఫణీంద్ర, ఆయన బృందానికి అభినందనలు తెలిపారు. అదేవిధంగా ప్రముఖ వ్యోమగాములు రాకేశ్‌ శర్మ, శుభాంశు శుక్లా వీడియో సందేశాల ద్వారా చిరంజీవి ఫణీంద్ర కు అభినందనలు తెలిపారు.


చౌకైన స్పేస్‌టెక్‌ హబ్‌గా హైదరాబాద్‌

అంతరిక్ష వ్యర్థాలను తొలగించేందుకు కాస్మోసర్వ్‌ లాంటి సంస్థలు ముందుకు రావడం గొప్ప పరిణామం అని మంత్రి శ్రీధర్‌బాబు కొనియాడారు. అంతరిక్ష ఆవిష్కరణల్లో హైదరాబాద్‌ దేశానికే దిశానిర్దేశం చేస్తోందన్నారు. నగరంలో ఇప్పటికే 30కి పైగా స్పేస్‌టెక్‌ కంపెనీలు ఉన్నాయని, వీటిలో దేశంలోనే తొలి స్పేస్‌టెక్‌ యూనికార్న్‌తోపాటు త్వరలో యూనికార్న్‌ స్థాయికి చేరనున్న మరికొన్ని సంస్థలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరో స్పేస్‌, రక్షణ రంగాలు, 52 జాతీయ పరిశోధనా ప్రయోగశాలలు, 15 లక్షల మంది ఇంజినీర్ల నైపుణ్యం, స్థానికంగా దాదాపు 90 శాతం విడిభాగాల అవసరాలను తీర్చగల సరఫరా వ్యవస్థ ఈ అభివృద్థికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.


ప్రపంచంలోనే అత్యంత తక్కువ వ్యయంతో అంతరిక్ష సాంకేతికతను అందించే కేంద్రంగా హైదరాబాద్‌ ఎదుగుతోందన్నారు. ఈ రంగంలోని ఆవిష్కర్తలను ప్రోత్సహించేందుకు భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో ప్రత్యేకంగా స్పేస్‌ సిటీని ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని వెల్లడించారు. కాస్మోసర్వ్‌ స్పేస్‌ తన తొలి ఏడాదిలోనే పలు మైలురాళ్లను అధిగమించిందని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో చిరంజీవి ఫణీంద్ర తెలిపారు. భారత రాకెట్‌ ద్వారా తొలి పేలోడ్‌ను అంతరిక్షంలోకి పంపడంతోపాటు, సీడ్‌ ఫండింగ్‌ సమీకరించామని చెప్పారు. గగన్‌యాన్‌, భారతీయ అంతరిక్ష కేంద్రం (బీఏఎస్‌), భవిష్యత్తులో ప్రయోగించే ఉపగ్రహాల కోసం అంతరిక్ష కక్ష్యలను వినియోగించుకునే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడంలో బేస్‌-1 కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ బ్రాండ్‌ ప్రపంచానికి చాటాలి

మరో రెండు పథకాలు

కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 06 , 2026 | 05:29 AM