గ్యాస్ కొరతతో పెరిగిన ఇండక్షన్ స్టవ్‌ల అమ్మకాలు.. రేట్లు పెంచి అమ్ముతున్న వ్యాపారులు
ABN , Publish Date - Mar 23 , 2026 | 10:32 AM
ఇండక్షన్ స్టవ్‌లకు డిమాండ్ గ్రేటర్‌లో భారీగా పెరిగింది. గ్యాస్ కొరత, బుక్ చేసినా సిలిండర్ ఆలస్యంగా రావడం వంటి కారణాలతో నగరవాసులు ఇండక్షన్ స్టవ్‌లు వినియోగిస్తుండటంతో వాటి అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. విక్రయాలు పెరగడంతో హోల్ సేల్ మార్కెట్‌లో వీటి ధరలు 20-30 శాతం పెరిగాయి.
హైదరాబాద్ సిటీ, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ఇండక్షన్ స్టవ్‌లకు డిమాండ్ గ్రేటర్‌లో భారీగా పెరిగింది. గ్యాస్ కొరత, బుక్ చేసినా సిలిండర్ ఆలస్యంగా రావడం వంటి కారణాలతో నగరవాసులు ఇండక్షన్ స్టవ్‌లు వినియోగిస్తుండటంతో వాటి అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. విక్రయాలు పెరగడంతో హోల్ సేల్ మార్కెట్‌లో వీటి ధరలు 20-30 శాతం పెరిగాయి. డిమాండు తగినన్ని స్టవ్‌లు మార్కెట్‌లో లేకపోవడంతో కొంతమంది వ్యాపారులు 50శాతం ధరలు పెంచి విక్రయిస్తున్నారు. సికింద్రాబాద్, అబిడ్స్, బేగంబజార్ ప్రాంతాల్లోని హోల్ సేల్ మార్కెట్‌లో ఇండక్షన్ స్టవ్‌లు వందల్లో కావాలంటూ రిటైల్ వ్యాపారులు డబ్బులు చెల్లిస్తున్నారు. డిమాండ్‌తో హోల్ సేల్ మార్కెట్‌లో సైతం వీటి కొరత కనిపిస్తోందని ఓ వ్యాపారి తెలిపాడు.
ఆన్‌లైన్‌లో పెరిగిన విక్రయాలు..
రిటైల్ మార్కెట్‌తోపాటు ఆన్‌లైన్‌లో సైతం ఇండక్షన్ స్టవ్‌ల అమ్మకాలు పెరిగాయి. పదిరోజుల క్రితం ఎమ్మార్పీ ధరలపై 30-40 శాతం రాయితీతో విక్రయించగా.. ప్రస్తుతం 10-15 శాతం రాయితీతో విక్రయిస్తున్నారు. ఆన్ లైన్‌లో ఓ పాపులర్ మోడల్‌కు చెందిన స్టవ్‌లు అవుట్ ఆఫ్ స్టాక్ కన్పిస్తుండటంతో రిటైల్ మార్కెట్‌లో వాటిని కొనేందుకు పలువురు పోటీపడుతున్నారు. ఆన్‌లైన్‌లోపాటు హోల్ సేల్, రిటైల్ రంగాల్లో ఒకేసారి అమ్మకాలు పెరగడంతో డిమాండ్ భారీగా నెలకొంది. ఈ స్టవ్‌లకు ఉపయోగించే ముడిసరకు (ప్యానల్, ఇతర వస్తువులు) అత్యధికంగా చైనా నుంచి దిగుమతి అవుతుంటాయని.. యుద్ధం కారణంగా కొన్నిరోజులుగా ఆ వస్తువుల రాక నిలిచిపోవడంతో స్టవ్‌ల తయారీలో ఆటంకాలు ఏర్పడుతున్నాయని హోల్ సేల్ డీలర్లు చెబుతున్నారు.
బహుళ అంతస్తుల భవనాల్లో..
అపార్ట్మెంట్ వాసులతోపాటు బహుళ అంతస్తుల భవనాల నివాసితులు సైతం ఇండక్షన్ స్టవ్‌లు వాడేందుకు ఆసక్తి చూపుతున్నారు. హైరైజ్ భవనాల్లో పైపుల ద్వారా మాత్రమే గ్యాస్ సరఫరా చేస్తుంటారు. భవిష్యత్‌లో తమకు సైతం గ్యాస్ కొరత ఏర్పడుతుందనే భయంతో చాలామంది ఇండక్షన్ స్టవ్‌లు కొనుగోలు చేస్తున్నారు. బహుళ అంతస్తుల భవనాల్లో నిబంధనల ప్రకారం సాధారణ గ్యాస్ సిలిండర్లు అనుమతించరు. అందుకే చాలామంది ఇండక్షన్ స్టవ్‌లు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.
పెద్ద ఎలక్ట్రిక్ స్టవ్‌లకు డిమాండ్..
కమర్షియల్ గ్యాస్ కొరతతో హోటల్స్, హాస్టళ్ల నిర్వాహకులు పెద్ద ఎలక్ట్రిక్ స్టవ్‌లు వినియోగిస్తుండటంతో వాటి డిమాండ్ కూడా పెరిగింది. గతంలో పెద్ద స్టవ్‌లను ఎవరూ అడిగే వారు కాదని, కొన్నిరోజులుగా వాటి ఆర్డర్లు భారీగా పెరిగాయని, కొంతమంది 5-10 కావాలని అడ్వాన్స్ చెల్లిస్తున్నారంటూ ఓ దుకాణదారుడు తెలిపాడు.
ఈ వార్తలు కూడా చదవండి
గజ్వేల్‌లో హై టెన్షన్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల ఘర్షణ
కత్తితో దాడి.. గంజాయి బ్యాచ్ వీరంగం