స్టాక్ మార్కెట్లో ప్రకంపనలు.. కుప్పకూలిన నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు
ABN , Publish Date - Mar 23 , 2026 | 09:40 AM
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారతీయ స్టాక్ మార్కెట్‌ను భారీ దెబ్బ తీశాయి. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో పాటు, చమురు సరఫరాపై పడే ప్రభావం ఇన్వెస్టర్లలో వణుకు పుట్టించింది. ఫలితంగా సోమవారం ట్రేడింగ్‌లో నిఫ్టీ, సెన్సెక్స్ భారీ పతనాన్ని నమోదు చేశాయి.
ఆంధ్రజ్యోతి, మార్చి 23: సోమవారం మొదలవడమే భారత స్టాక్ మార్కెట్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయి. నిఫ్టీ 50 ఏకంగా 392.90 పాయింట్లు పడిపోగా, సెన్సెక్స్ 1,200 పాయింట్లకు పైగా పతనమైంది. ఒక దశలో సెన్సెక్స్ 72,977.34 కనిష్ట స్థాయికి చేరింది. ఈ భారీ పతనం వల్ల ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ. 5 లక్షల కోట్లు ఆవిరైనట్లు అంచనా.
నిఫ్టీ నిన్నటి ముగింపు 23,114.50తో పోలిస్తే, మార్కెట్ భారీ 'గ్యాప్ డౌన్'తో ఓపెన్ అయింది. ఇంట్రాడేలో నిఫ్టీ 22,634.55 కనిష్ట స్థాయిని కూడా తాకింది. కీలకమైన 23,000 మద్దతు స్థాయిని కోల్పోయింది.
సెన్సెక్స్1,264.49 పాయింట్లు (1.70%)కోల్పోయి 73,268.47 వద్ద ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ ప్రారంభంలోనే 73,732.58 వద్ద ఓపెన్ అయి, నిమిషాల వ్యవధిలోనే 72,977.34 కనిష్ట స్థాయికి పడిపోయింది. 75,000 పైన స్థిరంగా ఉంటుందని ఆశించిన ఇన్వెస్టర్లకు ఈ పతనం ఊహించని షాక్ ఇచ్చింది.
ఇక, మార్కెట్ అస్థిరతను కొలిచే India VIX 22.81 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలకు తోడు, దేశీయంగా నెలకొన్న అనిశ్చితితో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు మొగ్గు చూపారు. ఫలితంగా నిఫ్టీ, సెన్సెక్స్ కీలక మద్దతు స్థాయిలను కోల్పోయి భారీ పతనాన్ని నమోదు చేశాయి.
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్ ఇంధన వనరులపై దాడులు జరిగే అవకాశం ఉందన్న వార్తలు ప్రపంచ మార్కెట్లను కుదిపేశాయి. అమెరికా జోక్యం కూడా పెరగడంతో ముడి చమురు (Crude Oil) ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇది భారత్ వంటి చమురు దిగుమతి చేసుకునే దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న ఆందోళనతో ఇన్వెస్టర్లు భారీగా షేర్లను విక్రయించారు.
ఈ వార్తలు కూడా చదవండి
వాణిజ్య సిలిండర్ కొరత.. కుదేలవుతున్న ఫుడ్ ఇండస్ట్రీ
పేదలను వెళ్లగొట్టు.. ఒవైసీని కాపాడు