కత్తితో దాడి.. గంజాయి బ్యాచ్ వీరంగం
ABN , Publish Date - Mar 23 , 2026 | 10:06 AM
అత్తాపూర్‌లో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. తమ ఇంటి వద్ద గంజాయి తాగవద్దంటూ స్థానికులు గంజాయి బ్యాచ్‌ను మందలించింది. దీంతో ఆగ్రహించిన గంజాయి బ్యాచ్.. మత్తులో స్థానికులపై ముకుమ్మడి దాడికి దిగింది.
హైదరాబాద్, మార్చి 23: అత్తాపూర్‌లో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. తమ ఇంటి వద్ద గంజాయి తాగవద్దంటూ స్థానికులు గంజాయి బ్యాచ్‌ను మందలించింది. దీంతో ఆగ్రహించిన గంజాయి బ్యాచ్.. మత్తులో స్థానికులపై ముకుమ్మడి దాడికి దిగింది. కత్తితో ఒక వ్యక్తిపై దాడి చేసింది. ఈ దాడిలో సదరు వ్యక్తి వీపులో కత్తి ఇరుక్కుపోయింది. కత్తి పిడి భాగం విరిగిపోయింది. దాంతో కత్తి అతడి వీపులోనే ఉండిపోయింది. స్థానికుల తలుపులపై పెట్రోల్ పోసి నిప్పుంటించేందుకు సదర బ్యాచ్ ప్రయత్నించింది. వారి ప్రయత్నాన్ని స్థానికులు బలంగా అడ్డుకున్నారు. దాంతో అక్కడి నుంచి గంజాయి బ్యాచ్ పరారైంది.
గంజాయి బ్యాచ్ ఆగడాలపై వెంటనే పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. అత్తాపూర్ సీఐ వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం కత్తి పోటుకు గురైన వ్యక్తిని హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గంజాయి వీరంగం సృష్టించిన ప్రాంతంలోని సీసీ టీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ గంజాయి సేవించిన వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు డ్రగ్స్, గంజాయి వాడకంపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోంది. ఈ నేపథ్యంలో గంజాయి బ్యాచ్ కోసం గాలింపు చర్యలను చేపట్టామని పోలీసులు వివరించారు.