అంతా తూచ్.. గోల్డెన్ గణేశ్ కాదు..
ABN , Publish Date - Sep 19 , 2026 | 09:56 AM
‘సుమారు 48 కిలోల పంచలోహాలతో సిద్ధమైన గణేశ్ విగ్రహం, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు పూతతో గోల్డెన్ గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాం..’ అంటూ బేగంబజార్ వ్యాపారుస్తులు చేసిన ప్రచారం అంతా అబద్ధమని పోలీసులు తేల్చారు.
అసత్య ప్రచారంతో ఆకట్టుకునే యత్నం
గోషామహల్ పోలీసుల ప్రకటన
హైదరాబాద్ సిటీ: ‘సుమారు 48 కిలోల పంచలోహాలతో సిద్ధమైన గణేశ్ విగ్రహం, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు పూతతో గోల్డెన్ గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాం..’ అంటూ బేగంబజార్ వ్యాపారుస్తులు చేసిన ప్రచారం అంతా అబద్ధమని పోలీసులు తేల్చారు. అందులో బంగారు పూత, అమెరికన్ డైమండ్లు, పంచ లోహాలు అంతా తూచ్ అంటూ పోలీసులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ‘లీ చీ కా రాజా గణేష్-2026’ ఏర్పాటు చేసింది. గోల్డెన్ గణేశ్ విగ్రహం అంటూ సోషల్ మీడియా వేదికలలో జోరుగా ప్రచారం చేసింది. ఈ విషయం గోషామహల్ పోలీసుల దృష్టికి వచ్చింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ‘లీ చీ కా రాజా గణేశ్’ ఉత్సవ కమిటీకి చెందిన కొందరు నిర్వాహకులు బేగంబజార్‌లోని తమ సొంత వ్యాపార సంస్థకు ఉచిత ప్రచారం కల్పించుకోవడానికి,
వ్యాపార ప్రయోజనాలు పొందడానికి దురుద్దేశంతోనే ఈ అబద్థపు ప్రచారాన్ని సృష్టించి వ్యాప్తి చేశారని తేలింది. విగ్రహ తయారీలో 48 కిలోల పంచలోహాలు, 24 క్యారెట్ల బంగారు పూత, 3,83,800 అమెరికన్ డైమండ్ల అమరిక అంటూ మోసపూరిత ప్రచారం చేశారని గుర్తించారు. అదంతా తప్పుడు ప్రచారమని పోలీసులు స్పష్టం చేశారు. ఆధారాలు లేని వార్తలను, ఫొటోలను, వీడియోలను అస్సలు నమ్మవద్దని, ఇతరులకు షేర్ చేయవద్దని పోలీసులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
300 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా అబద్ధం
Read Latest AP News And Telangana News And International News And Telugu News