నెల గడిచినా లభించని కల్పన ఆచూకీ..!
ABN , Publish Date - Jun 08 , 2026 | 04:04 PM
విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజను హత్య చేసి.. ఆ ఇంట్లోని నగలతో ఉడాయించిన పని మనిషి, ప్రధాన నిందితురాలు కల్పన ఆచూకీ నేటికి లభ్యం కాలేదు. ఈ హత్య జరిగి నెల రోజులు గడిచినా నిందితురాలు ఆచూకీ కనిపెట్టక పోవడంతో పోలీసులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హైదరాబాద్, జూన్ 08: విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజను హత్య చేసి.. ఆ ఇంట్లోని నగలతో ఉడాయించిన పని మనిషి, ప్రధాన నిందితురాలు కల్పన ఆచూకీ నేటికీ లభ్యం కాలేదు. ఈ హత్య జరిగి నెల రోజులు గడిచినా నిందితురాలు ఆచూకీ కనిపెట్టక పోవడంతో పోలీసులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకు ఒకరిని మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు చెప్పిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టినా.. ప్రధాన నిందితురాలు కల్పన జాడ మాత్రం పోలీసులు కనుక్కోలేక పోయారు.
మాజీ ఐపీఎస్ భార్య హత్య కేసులో నేపాల్‌కు చెందిన సృజన సాయి మాస్టర్ మైండ్‌గా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో జైలులో ఉన్న సృజన్ సాయి.. బయటికి వచ్చిన తర్వాత ఒక ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. సదరు ఐపీఎస్ అధికారి నివాసంలో పక్కా ప్లాన్ ప్రకారమే కల్పనను అతడు పనిలో చేర్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
మరో వైపు నేపాల్‌లోని నిందితురాలు కల్పన ఇంటిని హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. గత కొన్ని సంవత్సరాలుగా భర్త, పిల్లలకు కల్పన దూరంగా ఉంటున్నట్లు ఆ కుటుంబ సభ్యులు చెప్పిన సమాధానాల ఆధారంగా హైదరాబాద్ పోలీసులు తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ కల్పన ఈ చోరీలు చేస్తున్నట్లు వారు గుర్తించారు. కల్పన కోసం పోలీసులు చేపట్టిన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ హత్య ఘటన తరువాత రాష్ట్రవ్యాప్తంగా నివసిస్తున్న నేపాలీలా డేటాను తెలంగాణ పోలీసులు వెలికి తీశారు. రాష్ట్రంలో మొత్తం 63 కేసుల్లో 170 మంది నేపాలీలు నిందితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
జూబ్లీహిల్స్‌లో విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే.. తన భార్య తనూజతో కలిసి నివసిస్తున్నారు. వారింట్లో నేపాల్‌కు చెందిన కల్పన అనే మహిళ గతకొన్నేళ్లుగా పని చేస్తుంది. వినయ్ రంజన్ రే.. బెంగళూరు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న తనూజను హత్య చేసి.. చోరీ చేసిన నగదుతో కల్పన ఉడాయించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ కెమెరాలను పోలీసులు జల్లెడ పట్టారు.
ఈ ఘటనలో కల్పనతోపాటు పలువురు నేపాలీలు కూడా పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ చోరీ అనంతరం వారు ఆటోలో.. నాంపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి రైలులో కాజీపేట చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే నేపాల్ సరిహద్దుల వద్దకు తెలంగాణ పోలీసులు చేరుకున్నారు. అదే విధంగా మహారాష్ట్రలోని ముంబై, పుణెలో తెలంగాణ పోలీసులు తనిఖీలు చేపట్టారు. దాంతో కల్పన గ్యాంగ్‌లోని ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్ మాట్లాడిన మాటలే సీఎం రేవంత్ మాట్లాడారు.. అందులో తప్పేముంది?: యెన్నం
20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: టీజీ భరత్
For More TG News And Telugu News