కేసీఆర్ మాట్లాడిన మాటలే సీఎం రేవంత్ మాట్లాడారు.. అందులో తప్పేముంది?: యెన్నం
ABN , Publish Date - Jun 08 , 2026 | 03:12 PM
బీఆర్ఎస్ పార్టీలోని అగ్రనేతల వైఖరిని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి మరోసారి ఎండగట్టారు. సోమవారం హైదరాబాద్‌లో సీఎల్పీ మీడియా హాల్‌లో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై మండిపడ్డారు.
హైదరాబాద్, జూన్ 08: బీఆర్ఎస్ పార్టీలోని అగ్రనేతల వైఖరిని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి మరోసారి ఎండగట్టారు. సోమవారం హైదరాబాద్‌లో సీఎల్పీ మీడియా హాల్‌లో యెన్నం శ్రీనివాస్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామంటారు.. మూసీ అభివృద్ధి వద్దంటారని పేర్కొన్నారు. అసలు ఇలాంటి ప్రతిపక్షాన్ని తానెప్పుడూ చూడలేదన్నారు. మీ భవిష్యత్తు మీకూ అర్థమవుతుందా? అని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌లను ఆయన సూటిగా ప్రశ్నించారు. అబద్ధాలు ప్రచారం చేసే వారు శిక్ష నుంచి తప్పించుకోలేరన్నారు. హరీశ్ రావు శిక్ష అనుభవించక తప్పదని స్పష్టం చేశారు. హెడ్ లైన్స్ కోసం హరీశ్ రావు రాజకీయాలు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.
150 మీటర్లకు తుమ్మిడిహెట్టి నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం దానిని పట్టించుకోలేదని ప్రభుత్వ విప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహారాష్ట్ర గవర్నర్‌గా తెలంగాణ బీజేపీ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు ఉన్నారని గుర్తు చేశారు. ఆయన్ని కూడా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపయోగించుకోలేదని విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన సమయంలో 600 ఎంజీడీ వాటర్ సప్లై హైదరాబాద్ మహానగరానికి ఉందన్నారు.
పదేళ్ళలో ఒక్క ఎంజీడీ వాటర్ కూడా హైదరాబాద్‌కు బీఆర్ఎస్ తీసుకు రాలేదని ఆయన చెప్పారు. పాలమూరు - రంగారెడ్డి కెనాల్ నిర్మాణం చేయకుండా 90 శాతం పనులు పూర్తయ్యాయని బీఆర్ఎస్ పార్టీ గోబెల్స్ ప్రచారం చేస్తుందని యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డీపీఆర్‌లో సగం బడ్జెట్ కూడా ఖర్చు పెట్టకుండా 90 శాతం పనులు చేయడం సాధ్యమా? అని తెలంగాణ ప్రభుత్వ వీప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి సందేహం వ్యక్తం చేశారు.
భూబకాసురల విషయంలో హైడ్రా.. హిట్లర్ అని యెన్నం శ్రీనివాస్ రెడ్డి అభివర్ణించారు. హిట్లర్ కంటే కఠినంగా ఉంటామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలో వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదని ఆ పార్టీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. నాడు కేసీఆర్ మాట్లాడిన మాటలనే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని స్పష్టం చేశారు. అందులో తప్పేముందంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రశ్నలు సంధిస్తున్న బీఆర్ఎస్ నేతలకు యెన్నం శ్రీనివాస్ రెడ్డి చురకలంటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: టీజీ భరత్
ఆగస్ట్ 15 నాటికి సంజీవని పథకం తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు
For More TG News And Telugu News