Share News

అండాల దందా.. 8 నెలల్లో రూ.487 కోట్లు!

ABN , Publish Date - Nov 29 , 2026 | 04:21 AM

సంచలనం సృష్టించిన అండాల అక్రమ సేకరణ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో సద్గురు హెల్త్‌కేర్‌ సర్వీస్‌ సెంటర్‌ నిర్వాహకులు సూత్రధారులని పోలీసుల దర్యాప్తులో తేలింది.

అండాల దందా.. 8 నెలల్లో రూ.487 కోట్లు!

  • పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి.. నెలకు రూ.60 కోట్ల సంపాదన

  • బ్యాంకు లావాదేవీల ఆధారంగా గుర్తింపు

  • మరో ఇద్దరు నిందితుల అరెస్టు

  • సూత్రధారి.. సద్గురు హెల్త్‌ కేర్‌ సర్వీసెస్‌

  • దాని కింద దేశంలో 43 ఫర్టిలిటీ సెంటర్లు

  • వివరాలు వెల్లడించిన సీపీ సుమతి

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): సంచలనం సృష్టించిన అండాల అక్రమ సేకరణ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో సద్గురు హెల్త్‌కేర్‌ సర్వీస్‌ సెంటర్‌ నిర్వాహకులు సూత్రధారులని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ సంస్థకు చెందిన మరో ఇద్దర్ని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో అరెస్టయిన నిందితుల సంఖ్య 14కు చేరింది. నిందితులను కస్టడీలో తీసుకొని విచారించిన క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు మల్కాజిగిరి సీపీ సుమతి శనివారం మీడియా సమావేశంలో తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి లభించిన ఆధారాల ప్రకారం నగదు, డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా అండాల మాటున ఈ ముఠా రూ.487 కోట్లు కొల్లగొట్టినట్లు లెక్క తేలిందని సీపీ తెలిపారు.


ఈ లెక్కన నిందితులు ప్రతి నెలా రూ.60.87 కోట్లు తమ ఖాతాలకు మళ్లించుకున్నట్లు గుర్తించామని తెలిపారు. తాజాగా అరెస్టయిన సద్గురు హెల్త్‌కేర్‌ సర్వీస్‌ సెంటర్‌ ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌లను విచారించగా వారికి నెలకు రూ.3.50 లక్షల నుంచి రూ.4.50 లక్షలు వరకు జీతాలు వస్తున్నట్లు తేలిందన్నారు. దేశవ్యాప్తంగా విస్తరించిన ఆ సంస్థ నెట్‌వర్క్‌ వీరి ఆధ్వర్యంలోనే నడుస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. ఆ సంస్థ కింద 43 ఫర్టిలిటీ సెంటర్లు ఉండగా, నగరంతో పాటు దేశవ్యాప్తంగా ఇంకా ఎన్ని సెంటర్లకు లింకులు ఉన్నాయో గుర్తించడానికి లోతుగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అక్రమ అండాల కేసులో ఇప్పటికే అరెస్టయిన వారిని విచారణ చేయగా.. వారిచ్చిన సమాచారంతో సద్గురు హెల్త్‌కేర్‌ హైదరాబాద్‌ సీఓఓ, ముంబైకి చెందిన ప్రతీక్‌ అనిల్‌ గంగ్లానీ, ఒయాసిస్‌ ఫర్టిలిటీ మెడికల్‌ అడ్మినిస్ట్రేటర్‌ అసోంకు చెందిన డాక్టర్‌ రాజశ్రీ దేవ్‌లను అరెస్ట్‌ చేశామని తెలిపారు.


అండాల విక్రయంలో వీరిద్దరూ కీలకంగా పనిచేస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. ఒయాసిస్‌, సద్గురు పేరిట ఐదు క్లినిక్‌లను డాక్టర్‌ గేడెల దుర్గారావు నేతృత్వంలో నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే గుర్తించగా, అతను మహిళలను తీసుకొస్తే.. వారి నుంచి అక్రమంగా సేకరించిన అండాలను గంగ్లానీ, రాజశ్రీ దేవ్‌ దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ఫర్టిలిటీ సెంటర్లకు సరఫరా చేస్తున్నారని తెలిపారు. 43 ఫర్టిలిటీ సెంటర్ల ద్వారా ప్రతి నెలా 100 వరకు మహిళల నుంచి అక్రమంగా అండాల సేకరణ జరుగుతున్నట్లు ప్రాథమికంగా అంచనా వేశామని తెలిపారు. అండాల దందా ముఠా హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ ద్వారా ఏప్రిల్‌ నుంచి నవంబరు 26 వరకు487.82 కోట్ల లావాదేవీలు చేసిందని తెలిపారు.


పోలీసు కస్టడీకి ఐదుగురు నిందితులు

నాంపల్లి కోర్టులు, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): అండాల కేసులో ప్రధాననిందితులు అమిత్‌ శర్మ, నిఖత్‌ పర్వీన్‌ అలియాస్‌ నిఖత్‌ శర్మ, ఎమిరిషెట్టి దుర్గాప్రసాద్‌తో పాటు మలక్‌పేటలో సద్గురు హెల్త్‌ సర్వీసెస్‌ సెంటర్‌ నడుపుతున్న పసల ఆనంద్‌రాజ్‌, సుభానీ షేక్‌ను పోలీసులు శనివారం చంచల్‌గూడ జైలు నుంచి తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఐదుగురు నిందితులను మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 11న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్‌ ఫిర్యాదుతో ఈ కేసులు నమోదయ్యాయి. గత నెల 30న బేగంపేటలోని అమినిత మహిళా వసతి గృహంలో వైద్యాధికారుల తనిఖీతో అండాల అక్రమ సేకరణ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని ఫిర్యాదులో తెలిపారు. కాగా, ఈ కేసును సీసీఎ్‌సకు బదిలీ చేయాలని కోరుతూ మలక్‌పేట పోలీసులు పోలీస్‌ కమిషనర్‌కు లేఖ రాశారు.


ఇవి కూడా చదవండి...

ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం

21 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై హరీశ్ రావు, జగ్గారెడ్డి.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 29 , 2026 | 04:21 AM