బట్టల వ్యాపారం మాటున ఈ- సిగరెట్ల దందా
ABN , Publish Date - Nov 16 , 2026 | 05:30 AM
బట్టల వ్యాపారం మాటున నిర్వహిస్తున్న నిషేధిత ఈ-సిగరెట్ల పంపిణీ నెట్‌వర్క్‌ను ఈగల్ బృందాలు బట్టబయలు చేశాయి.
అంతర్రాష్ట్ర నెట్‌వర్క్‌లో ఇద్దరు నిందితుల అరెస్టు
హైదరాబాద్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): బట్టల వ్యాపారం మాటున నిర్వహిస్తున్న నిషేధిత ఈ-సిగరెట్ల పంపిణీ నెట్‌వర్క్‌ను ఈగల్ బృందాలు బట్టబయలు చేశాయి. కోల్‌కతా, హైదరాబాద్, కరీంనగర్ మధ్య నడుస్తున్న అంతర్రాష్ట్ర ఈ- సిగరెట్ల దందాలో ఇద్దరు నిందితులను అరెస్టు చేశాయి. ఇటీవల కరీంనగర్‌లో మైనర్లకు ఈ-సిగరెట్ అమ్ముతున్న ఆసిఫ్‌ను ఈగల్ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఒమర్ ద్వారా తనకు ఈ- సిగరెట్లు కొరియర్‌లో వస్తున్నట్లు అతడు చెప్పడంతో అధికారులు.. మీర్‌చౌక్ పోలీసు స్టేషన్ పరిధిలో ఒమర్ అలియాస్ రాహిల్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అతడి వద్ద ఉన్న 19 ఈ- సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. మక్కా మసీదు ఎదురుగా ఫుట్‌పాత్‌పై బట్టలు అమ్మే ఒమర్.. సికింద్రాబాద్‌లోని ఆయాన్ నుంచి ఈ- సిగరెట్లు, వేవ్స్ తెప్పించి చార్మినార్ సమీపంలో పలువురికి విక్రయిస్తూ.. నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఏడు నెలల క్రితం బట్టలు కొనడానికి కోల్‌కతా వెళ్లిన ఒమర్.. అక్కడ ఆదిల్ అనే వ్యక్తిని కలిసి ఈ- సిగరెట్లు హైదరాబాద్‌కు కొరియర్ ద్వారా తెప్పించాడు. వాటిని హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లోని షాపుల వారికి సరఫరా చేయడం ప్రారంభించాడని ఈగల్ అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్ వార్తలు
సాగునీటి ప్రాజెక్టులకు చేయూతనివ్వండి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News