ఎక్కడ ‘సర్’.. మీ చిరునామా?
ABN , Publish Date - Jul 10 , 2026 | 09:19 AM
గ్రేటర్ హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)లో బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌ఓలు) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అడ్రస్ తెలియక.. ఫోన్లు ఎత్తక.. సతమతమవుతున్న బీఎల్‌ఓలు
తెలిసిన నియోజకవర్గం కాకుండా వేరే చోట విధులు
ఓటరు నమోదు ప్రక్రియలో తీవ్ర ఇబ్బందులు
ఇళ్లకు వెళ్లినా.. సహకరించని కొందరు ఓటర్లు
ఫారాలు నింపలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి
2002 సంవత్సరం నాటి ఓటు వివరాలే పెద్ద సమస్య
- అంబర్‌పేటకు చెందిన మహిళ ఓ ప్రభుత్వ శాఖలో పని చేస్తున్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఆమెను బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌ఓ)గా నియమించారు. యూసు్‌ఫగూడ పరిధిలోని ఓ పోలింగ్ బూత్‌లో ఓటరు ఫారాల పంపిణీ బాధ్యతను అప్పగించారు. తాను ఉండేది అంబర్‌పేటలోనని, గతంలో అక్కడ బీఎల్‌ఓగా పనిచేసిన అనుభవం ఉందని చెప్పినప్పటికీ, అధికారులు బలవంతంగా యూస్‌ఫగూడకు పంపించారు. ఆమెకు సాయంగా మరో ఇద్దరిని నియమించారు. కాగా, ఫారాల పంపిణీకోసం క్షేత్రస్థాయిలోకి వెళ్లిన అనంతరం సహాయకులు పలు కారణాలు చెబుతూ విధులకు రావడం లేదు. 12 రోజులు గడుస్తున్నా ఆమె తనకు కేటాయించిన 882 మంది ఓటర్లలో ఇప్పటివరకు 422 మందికి మాత్రమే ఫారాలు పంపిణీ చేశారు.
హైదరాబాద్ సిటీ: గ్రేటర్‌లో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)లో బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌ఓలు) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయడం మొదలుకుని వాటిని తిరిగి సేకరించడం, ఆన్‌లైన్‌లో నమోదు చేయడం వరకు అన్నింటా సతమతమవుతున్నారు. ఓటర్ల చిరునామాలు దొరకక, స్థానికంగా సహకారం లభించక పరేషాన్ అవుతున్నారు. దీంతో పాటు బీఎల్‌ఓలకు సాయంగా ఉండేందుకు నియమించిన వారిలో సగం మంది విధులు హాజరుకాకపోవడంతో బీఎల్‌ఓలు క్షేత్రస్థాయిలో నిర్ణయించిన లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయలేకపోతున్నారు.
ప్రహసనంగా ప్రక్రియ
మహానగరంలో జరుగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియ బీఎల్‌ఓలకు ప్రహసనంగా మారింది. ఎన్యుమరేషన్ ఫారం ఇచ్చేందుకు వెళ్తున్న ఒక్కో బీఎల్‌ఓకు ఒక్కో విధమైన అనుభవం ఎదురవుతోంది. తమకిచ్చిన కిట్‌తో పాటు ఎన్యూమరేషన్ పత్రాల కట్టలను మోసుకుని ఇంటింటికీ తిరగలేకపోతున్నారు. ఒక్కొక్కరు దాదాపు 10 నుంచి 15 కిలోల బరువు మోసుకుంటూ నడుస్తుండడంతో నీరసించి పోతున్నారు. కాగా, మూసారాంబాగ్ డివిజన్‌లోని పోలింగ్ బూత్ నంబర్ 242కు చెందిన బీఎల్‌ఓ జె.నవీన్‌కుమార్ దాదాపు 10 కిలోలకు పైగా బ్యాగ్‌ను మోసుకుంటూ ఓటర్ల ఇంటికి వెళ్తే అక్కడి ఓటర్లు సరైన విధంగా స్పందించడం లేదని ఆయన వాపోయారు.
2002 ఓటు వివరాలే ప్రధాన సమస్య
ముఖ్యంగా 2002 నాటి ఓటరు వివరాలు, చిరునామాల మార్పులు, ప్రజల సహకారం లేకపోవడం వల్ల ప్రక్రియ నత్తనడకన సాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎన్యుమరేషన్ ఫారంలో 2002లో ఓటు ఎక్కడ నమోదైందనే వివరాలు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉండడంతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా మందికి అప్పటి ఓటరు వివరాలు గుర్తు లేకపోవడం, ఏ నియోజకవర్గంలో ఓటు ఉందో తెలియకపోవడం వల్ల ఫారాలు పూర్తి చేయలేకపోతున్నారు.
బీఎల్‌ఓల వద్దకు క్యూ
ఫారాలు ఎలా నింపాలో తెలియక చాలా మంది నేరుగా బీఎల్‌ఓల వద్దకు వచ్చి సాయం కోరుతున్నారు. ఈ క్రమంలో వారికి ఒక్కో ఫారం నింపేందుకు సమయం పడుతుండటంతో ఇతర పనులు కూడా ఆలస్యమవుతున్నాయి. చివరి రోజుల్లో అన్ని ఫారాలు ఒకేసారి వస్తే వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయడం కష్టతరమవుతోందని పలువురు బీఎల్‌ఓలు ఆందోళన చెందుతున్నారు. ఈనెల 15లోపు ఫారాలు తిరిగి ఇస్తే నమోదు ప్రక్రియ సులభంగా పూర్తవుతుందని పేర్కొంటున్నారు. గతంలో నమోదైన చిరునామాల్లో ప్రస్తుతం చాలామంది నివసించడం లేదు. ముఖ్యంగా ఉద్యోగాలు, ఇతర కారణాలతో వేలాది మంది ప్రాంతాలు మార్చేశారు. ఇళ్లకు వెళ్లిన బీఎల్‌ఓలకు ‘మేము ఇక్కడ ఉండడం లేదు’ అనే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో అనేక ఫారాలు పెండింగ్‌లోనే ఉన్నాయి.
కాటేదాన్‌లో భారీ మార్పులు
కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలోని ఫ్యాక్టరీల్లో గతంలో ఒక్కో పరిశ్రమలో 40 నుంచి 50 మంది కార్మికుల వరకు ఓటర్లు నమోదయ్యారు. ప్రస్తుతం ఆ కార్మికుల్లో చాలామంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడంతో వారి జాడ కనిపించడం లేదు. ఫలితంగా ఆ ఓట్ల ధ్రువీకరణ బీఎల్‌ఓలకు పెద్ద సవాల్‌గా మారింది..
సహకరించని ఓటర్లు!
పంపిణీ చేసిన ఫారాలు తిరిగి తీసుకురావడానికి వెళ్లిన బీఎల్‌ఓలకు కొందరు ఓటర్లు సహకరించడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. 2002లో ఎక్కడ ఓటు వేసామో గుర్తు లేదు... ఫారం తీసుకొచ్చారు కదా, మీరే నింపుకోండి.. అంటూ దురుసుగా మాట్లాడుతున్న సందర్భాలు కూడా ఎదురవుతున్నాయని పలువురు చెబుతున్నారు. కాగా, శాస్త్రిపురం, సులేమాన్‌నగర్ డివిజన్లు మినహా చాలా ప్రాంతాల్లో బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏ) ఆశించిన స్థాయిలో సహకరించడం లేదని బీఎల్‌ఓలు పేర్కొంటున్నారు. చాలామంది ఫొటోలు తీసుకుని వెళ్లిపోతున్నారే తప్ప, ఫారాల పరిశీలన లేదా ఓటర్లకు అవగాహన కల్పించడంలో చురుకుగా పాల్గొనడం లేదని అంటున్నారు.
ఇతర శాఖల సిబ్బందిపై అదనపు భారం
ఆశా వర్కర్లకు బీఎల్‌ఓ బాధ్యతలు అప్పగించడంతో వారు ఆస్పత్రి విధులతో పాటు ఓటరు నమోదు పనులు కూడా నిర్వహించాల్సి వస్తోంది. అలాగే మలేరియా విభాగం, ఇతర శాఖల సిబ్బందికి కూడా బీఎల్‌ఓ డ్యూటీలు ఇవ్వడంతో ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇదిలా ఉండగా, రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు 30 వేల ఎన్యుమరేషన్ ఫారాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన ఫారాలను కూడా గడువులోపు పూర్తి చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
గుర్తింపు లేదంటున్న బీఎల్‌ఓలు
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటింటికీ తిరుగుతూ, ప్రజలకు వివరాలు చెప్పి, ఫారాలు నింపించి, ఆన్‌లైన్ నమోదు చేస్తూ తీవ్ర శ్రమిస్తున్నప్పటికీ తమ కష్టానికి తగిన గుర్తింపు లేదా ప్రతిఫలం లేదని బీఎల్‌ఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
కడియంకు దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి
Read Latest AP News And Telangana News And International News And Telugu News