కడియంకు దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి
ABN , Publish Date - Jul 10 , 2026 | 06:20 AM
‘‘కడియం శ్రీహరి 40 ఏళుగా రాజకీయాల్లో ఉన్నారు. మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇమడలేకపోతున్నారు. ఆయనకు దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి.
లేదంటే రాజీనామా చేయాలి: కొండా సురేఖ
శ్రీహరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని
టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌కు మంత్రి ఫిర్యాదు
హైదరాబాద్, జూలై 9 (ఆంధ్రజ్యోతి) : ‘‘కడియం శ్రీహరి 40 ఏళుగా రాజకీయాల్లో ఉన్నారు. మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇమడలేకపోతున్నారు. ఆయనకు దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి. లేకుంటే నోరుమూసుకుని రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి’’ అని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. విలువలు ఉన్న వ్యక్తి అయితే కడియం శ్రీహరి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ జెండా మీద గెలవాలని సవాలు విసిరారు. కడియం శ్రీహరి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకుంటున్నారని, బిడ్డని మాత్రం కాంగ్రెస్ కండువా కప్పి గెలిపించుకున్నారని అన్నారు. తన భర్త పదవి ఉండగానే వైసీపీలో చేరినప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారని సురేఖ గుర్తు చేశారు. కాంగ్రెస్‌లోకి వచ్చినపుడు బీఆర్‌ఎస్ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి నాలుగేళ్లు ఉండగానే రాజీనామా చేశామన్నారు. దేవాదాయ శాఖపై కడియం శ్రీహరి సమీక్ష చేశారన్న వివాదంపై ఇప్పటికే అధిష్టానం, సీఎంకు ఫిర్యాదు చేసిన మంత్రి కొండా సురేఖ తాజాగా టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో.. మహిళా మంత్రినైన తనను కడియం శ్రీహరి రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నాడని, ఆయనపైన పార్టీ పరంగా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు. మహేశ్‌గౌడ్ స్పందిస్తూ ఈ వివాదంపైన త్వరలోనే నిర్ణ్ణయం తీసుకుంటామని కొండా సురేఖకు హామీ ఇచ్చారు. అనంతరం కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ కడియం శ్రీహరి తీరుపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షీ నటరాజన్‌కూ 14న స్వయంగా ఫిర్యాదు చేస్తానన్నారు.
దేవాదాయ, అటవీ అంశాలపై పొన్నం చర్చ
హుస్నాబాద్ నియోజకవర్గ పురోగతికి సంబంధించి దేవాదాయ, అటవీ శాఖలతో ముడిపడి ఉన్న అంశాలపై మంత్రి కొండా సురేఖతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చించారు. ఆయా అంశాల సత్వర పరిష్కారం, అనుమతులకు చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చించి, వినతి పత్రంలో అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి కొండా సురేఖ తెలిపారు.