లంచం తీసుకోవడమే కాదు.. డిమాండ్ చేసినా నేరమే
ABN , Publish Date - Oct 29 , 2026 | 05:42 AM
లంచం తీసుకుంటూ పట్టుబడితేనే కేసు అనుకుంటున్న ప్రభుత్వోద్యోగులకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) షాక్ ఇచ్చింది.
రూ.10 లక్షలు డిమాండ్ చేసిన ఎస్సై ఏసీబీ అదుపులోకి
ఏసీబీ సంచలన నిర్ణయంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు
హైదరాబాద్/బంజారాహిల్స్, అక్టోబరు28 (ఆంధ్రజ్యోతి): లంచం తీసుకుంటూ పట్టుబడితేనే కేసు అనుకుంటున్న ప్రభుత్వోద్యోగులకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) షాక్ ఇచ్చింది. లంచం డిమాండ్ చేసిన ఓ ఎస్సైపై కేసు నమోదు చేసి బుధవారం అదుపులోకి తీసుకుంది. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న కొత్తూరు విజయ్.. 2024లో నమోదైన ఓ చీటింగ్ కేసులో నిందితుడిని దర్యాప్తు నిమిత్తం పోలీసు స్టేషన్‌కు పిలిపించారు. ఆ కేసులో అరెస్టు చేయకుండా ఉండాలంటే తనకు, స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌కు కలి పి రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను అంత మొత్తం ఇవ్వలేనని నిందితుడు చెప్పడంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం ఈనెల 3న న్యాయమూర్తి వద్ద హాజరుపరిచారు. ఈ సందర్భంగా నిందితుడికి ఏడేళ్లలోపు శిక్షపడే కేసులో అరె స్టు చేయాల్సిన అవసరం ఏముందని పోలీసులను న్యాయమూర్తి ప్రశ్నించారు. అతడికి సెక్షన్ 41ఏ కింద నోటీసు ఇవ్వాలని పేర్కొం టూ రిమాండ్‌ను తిరస్కరించారు. దీంతో ఆ వ్యక్తికి నోటీసులు ఇచ్చిన ఎస్సై.. అతడిపై ఇంకా పాతకేసులు కూడా ఉన్నాయని, వాటన్నింటిలో తదుపరి చర్యలు తీసుకోకుండా ఉండాలంటే కనీసం రూ.2 లక్షలైనా ఇవ్వాలని మరోసారి డిమాండ్ చేశారు.
చివరకు రూ.1 లక్షకు బేరం కుదుర్చుకున్నారు. ముందు నుంచీ లంచం ఇవ్వడానికి ఇష్టపడని సదరు నిందితుడు ఒక్కసారిగా డబ్బు ఇవ్వడానికి అంగీకరించడంతో అనుమానించిన ఎస్సై విజయ్.. ఆ తర్వాత అతడిని కలవడానికి ఇష్టపడలేదు. ఈ క్రమంలో జరిగిన వ్యవహారాన్ని అంతా వివరిస్తూ సద రు వ్యక్తి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో.. వారు విధి నిర్వహణలో దుష్ప్రవర్తన కింద కేసు నమోదు చేసి ఎస్సై విజయ్‌ను బుధవారం అరెస్టు చేశారు. చాలామంది ప్రభుత్వోద్యోగులు లంచం తీసుకుంటేనే ఏసీబీ రంగంలోకి దిగుతుందనే భ్రమలో ఉంటారని, వాస్తవానికి లంచం డిమాండ్ చేసినా అందుకు తగిన ఆధారాలు బాధితుడు సమర్పించగలిగితే ఏసీబీ కేసు నమోదు చేసి అరెస్టు చేస్తుందని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ స్పష్టం చేశారు. ఈ వ్యవహరంలో స్టేషన్ ఉన్నతాధికారుల పాత్రపైనా దర్యాప్తు జరుపుతున్నామని పేర్కొన్నారు. కాగా, 2020 బ్యాచ్‌కు చెందిన ఎస్సై విజయ్ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి భారీగా లంచాలకు అలవాటు పడ్డట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
అప్రాధాన్య పోస్టుకు జయేశ్ రంజన్
ఆ జూనియర్ లెక్చరర్లను సర్వీసులోకి తీసుకోండి
Read Latest AP News And Telangana News And International News And Telugu News