Share News

మరిన్ని భూముల వేలం

ABN , Publish Date - Nov 22 , 2026 | 07:20 AM

రాజధాని శివార్లలో ఉన్న విలువైన స్థలాలు, హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన ప్లాట్లను విక్రయించేందుకు ప్రభుత్వం మరో నోటిఫికేషన్‌ జారీచేసింది.

మరిన్ని భూముల వేలం

  • కోకాపేట, మూసాపేట, బాచుపల్లి, బంజారాహిల్స్‌లో విక్రయం

  • రూ.600 కోట్ల సమీకరణకు నోటిఫికేషన్‌ జారీచేసిన హెచ్‌ఎండీఏ

  • వచ్చే నెల 14-21 వరకు స్థలాల వేలం

హైదరాబాద్‌ సిటీ, నవంబరు21 (ఆంధ్రజ్యోతి): రాజధాని శివార్లలో ఉన్న విలువైన స్థలాలు, హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన ప్లాట్లను విక్రయించేందుకు ప్రభుత్వం మరో నోటిఫికేషన్‌ జారీచేసింది. కొనుగోలుదారులు వేలంలో పాల్గొనేందుకు శనివారం నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సైతం ప్రారంభించింది. వచ్చే నెల 14వ తేదీ నుంచి 21 వరకు ఆన్‌లైన్‌ వేలం ద్వారా కోకాపేట, మూసాపేట, బంజారాహిల్స్‌ హుడా హైట్స్‌లోని స్థలాలతోపాటు బాచుపల్లి, ఇన్ముల్‌నర్వాలో ప్లాట్లను విక్రయిస్తారు. వీటి విక్రయం ద్వారా రూ.600 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వివిధ ప్రాంతాల్లోని స్థలాలు, ప్లాట్ల అమ్మకానికి గత నెలలో నోటిఫికేషన్‌ ఇచ్చిన హెచ్‌ఎండీఏ.. శుక్రవారం బాచుపల్లి ప్లాట్లను వేలం వేసింది. ఈ నెల 28వ తేదీ వరకు ఈ వేలం ప్రక్రియ కొనసాగనుంది. ఈ వేలం ద్వారా రూ.1,500 కోట్లు సమకూరుతాయని హెచ్‌ఎండీఏ అధికారులు భావిస్తున్నారు.


ఆ వేలం ప్రక్రియ కొనసాగుతుండగానే శనివారం మరికొన్ని ప్లాట్ల వేలానికి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లోని 41/14 సర్వే నెంబరులో ఉన్న 0.21 ఎకరాలు, 1.39 ఎకరాల భూమిని వేర్వేరుగా విక్రయించనున్నారు. శంకర్‌పల్లి మండలం మోకిలలో హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్‌లో 300 చ.గజాల నుంచి 500 చ.గజాల విస్తీర్ణం వరకు ఉండే 61 ప్లాట్లను విక్రయానికి పెట్టారు. షాబాద్‌లో హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్‌లో 300 చ.గజాల చొప్పున విస్తీర్ణం కలిగిన 35 ప్లాట్లను విక్రయించనున్నారు. తుర్కయాంజాల్‌లోని లేఅవుట్‌లో 600 చ.గజాల నుంచి 1,146 గజాల విస్తీర్ణం కలిగిన 11 ప్లాట్లను విక్రయిస్తున్నారు. అమీన్‌పూర్‌ మండలం కిష్టారెడ్డిపేటలోని 1,452గజాల స్థలాన్ని సైతం విక్రయానికి పెట్టారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీ ఆధ్వర్యంలోనే ఆన్‌లైన్‌లోస్థలాలు, ప్లాట్లను వేలం వేయనున్నారు. ఖానామెట్‌లోని భూములకు ఎకరాకు ధర రూ.99కోట్లుగా నిర్ణయించారు. మోకిలలోనిప్లాట్లకు చ.గజానికి కనీస ధర రూ.55వేలుగా.. తుర్కయాంజాల్‌లో రూ.50వేలుగా నిర్ణయించారు. షాబాద్‌లోని ప్లాట్లకు చ.గజానికి కనీస ధర రూ.25 వేలుగా నిర్ణయించడంతో మధ్య తరగతికి ధరలు అందుబాటులో ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రోడ్లు!

22 నుంచి ఎస్‌ఐ పరీక్షల అభ్యర్థులకు హాల్‌ టికెట్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 22 , 2026 | 07:20 AM