ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్లు!
ABN , Publish Date - Nov 21 , 2026 | 06:46 AM
రహదారులు, వంతెనల నిర్మాణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు నాణ్యత, మన్నిక పెంచుకోవచ్చునని నిపుణులు అభిప్రాయపడ్డారు.
వంతెనల నాణ్యతకు నూతన సాంకేతికత
కాంట్రాక్టుల నిర్వహణకు ఏఐ సహాయం
హైదరాబాద్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): రహదారులు, వంతెనల నిర్మాణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు నాణ్యత, మన్నిక పెంచుకోవచ్చునని నిపుణులు అభిప్రాయపడ్డారు.ఐఆర్సీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన సాంకేతిక సమావేశం-2లో ప్లాస్టిక్ వ్యర్థాలతో జియోసెల్స్ తయారీ, వంతెనల పునరుద్ధరణలో నూతన సాంకేతికత, స్టెయిన్‌లెస్ స్టీల్ వినియోగం, ఏఐ ఆధారిత కాంట్రాక్టుల నిర్వహణపై ఇంజినీర్లు, అధికారులకు వివిధ సంస్థలకు చెందిన నిపుణులు అవగాహన కల్పించారు. సీఎస్ఐఆర్-సీఆర్‌ఆర్‌ఐ రూపొందించిన సాంకేతికతతో మిశ్రమ ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేయకుండా జియోసెల్స్‌గా తయారు చేయవచ్చునని డాక్టర్ మోనికా వివరించారు.
500 మీటర్ల రహదారి సబ్ గ్రేడ్ నిర్మాణానికి 50 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను వినియోగించవచ్చునని, దీని వల్ల నేలపై పడే ఒత్తిడి 15-20 శాతం తగ్గుతుందని తెలిపారు. ప్రతి టన్ను ప్లాస్టిక్ పునర్ వినియోగంతో సుమారు మూడు టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించే అవకాశం ఉందని పేర్కొన్నారు. పాత వంతెనల సామర్థ్యాన్ని పెంచేందుకు ఎక్స్‌టర్నల్ పోస్ట్ టెన్షనింగ్ యాంకరేజ్‌లకు శాస్త్రీయ రూపకల్పన అవసరమని సీఎస్ఐఆర్-సీఆర్‌ఆర్‌ఐకి చెందిన డాక్టర్ బిషి వివరించారు. జిందాల్ స్టెయిన్‌లెస్ స్టీల్ సంస్థ ప్రతినిధి ఎస్. నైటాని మాట్లాడుతూ.. స్టెయిన్‌లెస్ స్టీల్ వినియోగంతో తుప్పు సమస్యను తగ్గించి, దీర్ఘకాలిక నిర్వహణ వ్యయాలను ఆదా చేయవచ్చునని తెలిపారు. ఎన్‌హెచ్‌ఏఐ, ఎన్‌బీసీసీ అధికారులు రోడ్ల నిర్వహణలో ఏఐ ఆధారిత సాంకేతికతతో కాంట్రాక్టు పనుల పర్యవేక్షణ, నిర్మాణ పనుల్లో జాప్యం, అదనపు వ్యయాలు, వివాదాలను తగ్గించవచ్చునని వివరించారు.
ఈ వార్తలనూ చదవండి:
వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!
ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..