ఇద్దరు మంత్రులు వెళ్లిన హెలికాప్టర్‌కు ఇంధన సమస్య!
ABN , Publish Date - Sep 24 , 2026 | 07:13 AM
ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే, ఒక రాష్ట్రస్థాయి అధికారి కలిసి వెళ్లిన పర్యటనలో వారికి చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో ఆదిలాబాద్ వెళ్లిన వారు తిరుగు ప్రయాణానికి సరిపడా ఇంధనం లేకపోవడంతో రోడ్డు మార్గాన రావాల్సి వచ్చింది.
ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు రోడ్డు మార్గాన తిరుగు ప్రయాణం
మరుసటి రోజు ఇంధనం నింపుకుని.. హైదరాబాద్ వచ్చిన హెలికాప్టర్
ప్రభుత్వ హెలికాప్టర్ అందుబాటులో ఉన్నా ప్రైవేటుది ఎందుకు పంపారు?
ఘటనపై ప్రభుత్వం సీరియస్..
సివిల్ ఏవియేషన్ జేఎండీపై విచారణ?
హైదరాబాద్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే, ఒక రాష్ట్రస్థాయి అధికారి కలిసి వెళ్లిన పర్యటనలో వారికి చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో ఆదిలాబాద్ వెళ్లిన వారు తిరుగు ప్రయాణానికి సరిపడా ఇంధనం లేకపోవడంతో రోడ్డు మార్గాన రావాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. అగ్ని ప్రమాదం సంభవించిన ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిని సందర్శించేందుకు మంగళవారం వైద్యా రోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, పర్యాటక శాఖ, ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, మరో రాష్ట్రస్థాయి అధికారిణి కలిసి హెలికాప్టర్‌లో వెళ్లారు. ఇంతవరకూ బాగానే ఉన్నా తిరుగు ప్రయాణానికి హెలికాప్టర్‌లో సరిపడా ఇంధనం లేదు. పైలట్లు ఈ విషయాన్ని దాచిపెట్టి.. ఆకాశం మేఘావృతమై ఉండడంతో హెలికాప్టర్ ప్రయాణం సురక్షితం కాదని చెప్పారు.
దాంతో మంత్రులు రోడ్డు మార్గాన హైదరాబాద్ చేరుకున్నారు. వాస్తవానికి సీఎం, మంత్రులు, ఇతర వీఐపీల పర్యటనలు ఉన్నప్పుడు హెలికాప్టర్‌కు అవసరమైన ఇంధనాన్ని ముందుగానే ఏర్పాటు చేస్తారు. కానీ ఆదిలాబాద్ వెళ్లిన హెలికాప్టర్ విషయంలో సివిల్ ఏవియేషన్ అధికారులు విఫలమయ్యారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంధన సమస్య గురించి చెప్పకుండా ఆకాశంలో దట్టమైన మేఘాలు ఉన్నాయని, హెలికాప్టర్ ప్రయాణం సురక్షితం కాదని మంత్రులకు ఏవియేషన్ అధికారులు చెప్పినట్టు తెలిసింది. మంత్రులు రోడ్డు మార్గాన హైదరాబాద్ ప్రయాణమైన కొద్దిసేపటికే హెలికాప్టర్ దగ్గరకు ఒక ట్రక్ రావడం, ఇంధనాన్ని నింపడంతో అసలు విషయం బయటపడింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హెలికాప్టర్ బుధవారం ఉదయం తిరిగి ఖాళీగా హైదరాబాద్ చేరుకోవడం గమనార్హం.
ప్రభుత్వ హెలికాప్టర్ ఉన్నా ప్రైవేటుదే ఎందుకో!
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కొత్త హెలికాప్టర్ (ఎయిర్‌బస్ హెచ్-160)ను అద్దెకు తీసుకుంది. మంత్రుల పర్యటన ఖరారయ్యే సమయానికి ప్రభుత్వ హెలికాప్టర్ బేగంపేట విమానాశ్రయంలో అందుబాటులోనే ఉన్నట్టు సమాచారం. అయినా రాష్ట్రానికి చెందిన ఓ ప్రైవేటు కంపెనీ అధినేతకు చెందిన హెలికాప్టర్ (ఎయిర్‌బస్ హెచ్-135 (వీటీ-బీహెచ్‌హెచ్))ను ఆదిలాబాద్ ఎందుకు పంపించారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ వ్యవహారంలో సివిల్ ఏవియేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌పై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అధికారుల అలసత్వం సహా పలు అంశాలపై విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
సిద్దిపేటలో పేకాట మాజీ ఎమ్మెల్సీ సహా నలుగురి అరెస్టు
నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News