నేడు, రేపు భారీ వర్షాలు
ABN , Publish Date - Sep 24 , 2026 | 05:50 AM
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. కొన్నిప్రాంతాల్లో ముసురు కమ్ముకోగా, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. గురు, శుక్రవారాల్లో కూడా కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఐదు జిల్లాలకు రెడ్, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
బుధవారం పలు జిల్లాల్లో మోస్తరు వానలు
ఈదురు గాలుల బీభత్సం.. పిడుగుపాటుకు ముగ్గురు మహిళా కూలీల మృతి
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. కొన్నిప్రాంతాల్లో ముసురు కమ్ముకోగా, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. గురు, శుక్రవారాల్లో కూడా కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గురువారం అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇచ్చింది. శుక్రవారం కూడా పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, యెల్లో అలర్ట్ జారీ చేసింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రంలో 128 మండలాలు మినహా మిగిలిన అన్ని చోట్లా తేలికపాటి నుంచి మోస్తరు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
రోజంతా ముసురు.. సాయంత్రం గాలిదుమారం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బుధవారం ఒక మోస్తరు వర్షం కురిసింది. ఖమ్మం జిల్లాలో ఉదయం 8-30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 1.21 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కల్లూరులో 6.28 సెం.మీ వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ బుధవారం ఉదయం నుంచి ముసురు కురిసింది. వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు. భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలంలోని మోరంపల్లి బంజర గ్రామంలో బుధవారం సాయంత్రం గాలిదుమారం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలికి పలు ఇళ్లపై రేకులతోపాటు ప్రధాన సెంటర్‌లో ఏర్పాటు హోర్డింగులు ఎగిరిపోయాయి. బడ్టీ దుకాణాలు ధ్వంసమయ్యాయి.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వర కు ముసురు కురిసింది. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం కొండనాగులలో అత్యధికంగా 40.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలో 38.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో 19.5 మి.మీ. వర్షం కురిసింది. జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది. కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌లో అత్యధికంగా 54.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం ముసురు కురిసింది.
పిడుగుపాటుతో ముగ్గురి మృతి
పిడుగులు పడి బుధవారం వివిధ ప్రాంతాల్లో ముగ్గురు మహిళా కూలీలు మరణించారు. మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలం సూగూరు గ్రామానికి చెందిన కుమ్మరి లక్ష్మి (35) వరి చే నులో కలుపు తీస్తుండగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. వారిని వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జడ్చర్ల మండలం ఎక్వాయ్‌పల్లి గ్రామానికి చెందిన ఎడ్ల యాదమ్మ (66) కూలీ పనులకు వెళ్లి తోటి కూలీలతో కలిసి తిరిగి వస్తుండగా పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందింది. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కిష్టాపూర్ గ్రామంలో పిడుగుపడి 7 మేకలు, ఒక గొర్రె మృతి చెందాయి. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం బాల్‌రాజ్‌పల్లిలో పిడుగుపాటుకు మారం అంజమ్మ (55) అనే మహిళ మృతి చెందగా దోనూరి లక్ష్మి అస్వస్థతకు గురైంది. గద్వాల పట్టణంలోని 3వ వార్డులో నరేంద్ర కుమార్ అనే వ్యక్తి ఇంటిపై పిడుగుపడింది.
ఈ వార్తలు కూడా చదవండి..
వరంగల్ ఎయిర్‌పోర్టుకు రాణి రుద్రమ పేరు!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News