వసూళ్ల పర్వం వాస్తవమే..
ABN , Publish Date - Sep 24 , 2026 | 05:39 AM
మెడికల్ రికూట్ర్‌మెంట్ బోర్డు చేపట్టిన స్టాఫ్ నర్స్ నియామకాలకు సంబంధించి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుల (డీహెచ్) కార్యాయంలో ఓ ఉన్నతాధికారిణితో పాటు ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు రూ.లక్షల్లో వసూలు చేసింది వాస్తవమేనని విచారణ కమిటీ సర్కారుకు నివేదికిచ్చింది.
స్టాఫ్ నర్స్ ఉద్యోగాల పేరిట లక్షల్లో వసూళ్లు..
ఆ తర్వాత సెటిల్‌మెంట్..
సర్కారుకు చేరిన నివేదిక
డీహెచ్ కార్యాలయ ఉన్నతాధికారిణిపై విచారణ పూర్తి
ఎన్ని అవకతవకలు జరుగుతున్నా డీహెచ్ ఆఫీసు అధికారులపై ఈగ వాలనివ్వని ఉన్నతాధికారులు..
హైదరాబాద్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మెడికల్ రికూట్ర్‌మెంట్ బోర్డు చేపట్టిన స్టాఫ్ నర్స్ నియామకాలకు సంబంధించి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుల (డీహెచ్) కార్యాయంలో ఓ ఉన్నతాధికారిణితో పాటు ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు రూ.లక్షల్లో వసూలు చేసింది వాస్తవమేనని విచారణ కమిటీ సర్కారుకు నివేదికిచ్చింది. వసూళ్లకు పాల్పడిన ఉన్నతాధికారిణిపై నిబంధనల మేరకు తదుపరి చర్యలు ప్రభుత్వమే తీసుకోవాలని అందులో సూచించినట్లు తెలిసింది. రెండు రోజుల క్రితమే సర్కారుకు ఆ నివేదిక చేరినట్ల్లు రాష్ట్ర సచివాలయ వైద్యారోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. స్టాఫ్ నర్స్‌లు, అటెండరు జాబ్‌లు ఇప్పిస్తామంటూ సదరు ఉన్నతాధికారిణితో పాటు మరో ఇద్దరు కలిసి తమ వద్ద నుంచి రూ.19 లక్షలు తీసుకుని మోసం చేశారని.. బాధితులు కోర్టును ఆశ్రయించి పోలీసులకు ఫిర్యాదు చేయగా గతంలో కేసు నమోదైంది.
ఆగస్టు 19న ‘స్టాఫ్ నర్స్ ఉద్యోగాలంటూ వసూళ్లు!’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ ఓ కథనం ద్వారా ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. దీంతో సర్కారు సమగ్ర విచారణకు ఆదేశించింది. కాగా, గతంలో బోర్డులో ఉన్న సదరు ఉన్నతాధికారిణి.. ప్రస్తుతం డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో ఓ కీలక స్థానంలో ఉన్నారు. అయితే ఆ విషయం వెలుగులోకి రానివ్వకుండా, కనీసం ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు దాచి పెట్టారన్న ఆరోపణలు వినిపించాయి. ఇటు ఈ వసూళ్ల వ్యవహారానికి సంబంధించి కుటుంబ ఆరోగ్య సంక్షేమ కమిషనర్ డాక్టర్ సంగీతా సత్యనారాయణ ఆధ్వర్యంలో విచారణ కమిటీ వేయగా.. సదరు కమిటీ బాధితులను పిలిచి విచారించింది. ఈ సందర్భంగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
మధ్యవర్తుల ద్వారా వ్యవహారం...
సదరు ఉన్నతాధికారిణి బాధితుల నుంచి నేరుగా డబ్బులు తీసుకోకుండా అంతా మధ్యవర్తుల ద్వారా వ్యవహారం నడిపినట్లు కమిటీ సర్కారుకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. అంతేకాకుండా పోలీసు కేసు నమోదైన తర్వాత బాధితులను పిలిచి సెటిల్‌మెంట్ చేసుకున్నారని, అందులో భాగంగా రూ.10 లక్షలు వెనక్కి ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ సెటిల్‌మెంట్ సమయంలో ఆ ఉన్నతాఽధికారిణి అక్కడే ఉన్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. అదే విషయాన్ని నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం.
ఈసారైనా చర్యలుండేనా..?
రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయం అనేక అక్రమాలు, అవకతవకలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు రెండున్నరేళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఉద్యోగుల బదిలీల నుంచి పదోన్నతులు, అక్రమ డిప్యూటేషన్స్, ప్రమోషన్ పోస్టింగ్‌లు.. విజిలెన్స్ కేసుల విచారణ పేరుతో డాక్టర్లు, నర్స్‌లు, ఇతర పారామెడికల్ సిబ్బంది నుంచి రూ.లక్షల్లో దండుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. నర్సింగ్ సెక్షన్‌లో డిప్యూటేషన్‌పై వచ్చిన ఓ అధికారి వసూళ్ల పర్వంపై హెల్త్ సెక్రటరీ, వైద్యమంత్రికే ఫిర్యాదులందాయి. ఇంత జరుగుతున్నా డీహెచ్ కార్యాలయ అధికారుల్లో ఒక్కరిపైనా చర్యలు తీసుకోకపోవడంపై క్షేత్రస్థాయి వైద్య సిబ్బంది మండిపడుతున్నారు. ఇటు సచివాలయ ఉన్నతాధికారులు కూడా డీహెచ్‌ను, ఆ ఆఫీసు అధికారులను వెనకేసుకురావడమూ అనుమానాలకు తావిస్తోంది.
స్వయంగా డీహెచ్‌పైనే ఆరోపణలు, షోకాజ్ నోటీసులు ఇచ్చినా హెల్త్ సెక్రటరీ ఇంతవరకు చర్యలు తీసుకోలేకపోయారు. ఇదే ఇతర విభాగాధిపతులు, కార్యాలయాలపై ఆరోపణలు వస్తే హెల్త్ సెక్రటరీ తక్షణమే విచారణకు ఆదేశించడం.. ఆపై చర్యలు తీసుకోవడం జరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. హెల్త్ యూనివర్సిటీలో అవకతవకలు జరిగితే విచారణ జరిపి 2 రోజుల్లోనే అప్పటి వీసీ నందకుమార్‌రెడ్డిని ఆ పోస్టు నుంచి తప్పించారు. ఔషధ కార్పొరేషన్ ఈడీపై విజిలెన్స్ విచారణ నేపథ్యంలో ఆ పోస్టు నుంచి కౌటిల్యారెడ్డిని తొలగించారు. ఆరోగ్యశ్రీ డిస్ట్రిక్ కోఆర్డినేటర్ల నియామకాల్లో అక్రమాలపై అప్పటి సీఈవో ఐఏఎస్ అధికారి శివశంకర్‌ను ఆ పోస్టు నుంచి తప్పించారు.. ఇలా వైద్యశాఖలో ఎటువంటి అక్రమాలు చోటుచేసుకున్నా తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకుంటున్న సర్కారు.. డీహెచ్ ఆఫీసు ఉన్నతాధికారుల విషయంలో వ్యవహరిస్తున్న మెతక వైఖరితో చెడ్డ పేరు మూటగట్టుకుంటోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
వరంగల్ ఎయిర్‌పోర్టుకు రాణి రుద్రమ పేరు!
బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జిగా సునీల్ బన్సల్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News