Share News

వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు రాణి రుద్రమ పేరు!

ABN , Publish Date - Sep 24 , 2026 | 05:21 AM

వరంగల్‌ జిల్లా మామునూరు, ఆదిలాబాద్‌ జిల్లాలోని విమానాశ్రయాలకు రాష్ట్ర ప్రభుత్వం పేర్లను ఖరారు చేసింది. మామునూరు ఎయిర్‌పోర్టుకు రాణి రుద్రమ, ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టుకు కొమురంభీం పేర్లను దాదాపు ఖరారు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు  రాణి రుద్రమ పేరు!
Revanth Reddy

  • ఆదిలాబాద్‌ విమానాశ్రయానికి కొమురం భీం..

  • పేర్లను దాదాపు ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

  • క్యాబినెట్‌కు ఫైల్‌.. కేంద్రానికి లేఖ తర్వాత గెజిట్‌

  • ఇవి ఏఏఐ డిజైన్లా? ఏఐ చేసిన డిజైన్లా?

  • ఎయిర్‌పోర్టుల డిజైన్లపై సీఎం రేవంత్‌ ఆగ్రహం

హైదరాబాద్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌ జిల్లా మామునూరు, ఆదిలాబాద్‌ జిల్లాలోని విమానాశ్రయాలకు రాష్ట్ర ప్రభుత్వం పేర్లను ఖరారు చేసింది. మామునూరు ఎయిర్‌పోర్టుకు రాణి రుద్రమ, ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టుకు కొమురంభీం పేర్లను దాదాపు ఖరారు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. రెండు పేర్లు కొలిక్కిరావడంతో సంబంధిత ఫైలును క్యాబినెట్‌ ముందుకు తీసుకెళ్లేలా అధికారులు చర్యలు చేపట్టారు. క్యాబినెట్‌లో ఈ పేర్లకు ఆమోదం లభించగానే.. ఈ విషయాన్ని తెలుపుతూ అవే పేర్లను ఖరారు చేయాలని కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా లేఖ రాయనుంది. అక్కడి నుంచి కూడా ఆమోదం రాగానే రెండు ఎయిర్‌పోర్టుల పేర్లతో గెజిట్‌ విడుదల చేయనున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది.


మంగళవారం వరంగల్‌, ఆదిలాబాద్‌, ఎయిర్‌పోర్టులపై నిర్వహించిన సమీక్షలోనే ఈ పేర్లు దాదాపు ఖరారయ్యాయని, ఈ పేర్లపైనా కొద్దిసేపు చర్చ జరిగిందని సమాచారం. ఏపీలో ఇటీవల ప్రారంభించిన బోగాపురం ఎయిర్‌పోర్టు అల్లూరి సీతారామరాజు పేరు, ఒర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేర్లు పెట్టిన అంశం కూడా చర్చకు వచ్చింది. అదే తరహాలో తెలంగాణకు వచ్చే విదేశీయులకు, ఇతర దేశాల ప్రతినిధులకు కూడా తెలంగాణ చరిత్ర, ఆ పేర్లు కలిగిన వారు చేసిన కృషి, పోరాట పటిమ తెలియాలంటే వారి పేర్లే సరైనవన్న అభిప్రాయం వ్యక్తమైందని తెలిసింది. ఈ నేపథ్యంలోనే రాణి రుద్రమ, కొమురంభీం పేర్లు దాదాపు ఖరారయ్యాయని సమాచారం. అయితే మామునూరు ఎయిర్‌పోర్టు విషయంలో సమ్మక్క-సారలమ్మ పేరు కూడా పరిశీలనలో ఉందని దీనిపై కొద్ది రోజుల్లోనే స్పష్టతవచ్చే అవకాశం ఉందని కూడా అధికారికవర్గాలు పేర్కొంటున్నాయి.


ఎయిర్‌పోర్టుల డిజైన్లపై సీఎం ఆగ్రహం

ఆదిలాబాద్‌, వరంగల్‌ ఎయిర్‌పోర్టులపై సమీక్ష సందర్భంగా చూపించిన రెండు డిజైన్లపై సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘‘ఇవి ఏఏఐ (ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా) డిజైన్లా.! లేక ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)తో చేసిన డిజైన్లా.!!’’ అని సంబంధిత వ్యక్తులను సీఎం ప్రశ్నించినట్టు సమాచారం. రెండు ఎయిర్‌పోర్టుల డిజైన్లు అద్భుతంగా ఉండాలని, తెలంగాణ చరిత్ర ఉట్టిపడేలా ఆకృతులు ఉండాలని సూచించినట్టు తెలిసింది. అలాగే విమానాశ్రయాల నిర్మాణం కోసం మళ్లించే నీటి కుంటలు, చిన్న కాలువలను నేరుగా మళ్లించకుండా.. ఎయిర్‌పోర్టులకు దగ్గర్లో కుంటలు, చెరువులను ఏర్పాటుచేసి, అక్కడి నుంచి అందులోని నీటిని పంపించేలా ఏర్పాటుచేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని కూడా సీఎం సూచించారని సమాచారం. సమీక్షలో సీఎం చేసిన పలు సూచనల మేరకు డిజైన్లు, ఇతరత్రా అంశాల్లో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. అధికారులు మరోసారి డిజైన్లను సీఎంకు సమర్పించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కరెంట్‌ కొనండి
బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జిగా సునీల్‌ బన్సల్‌
Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 24 , 2026 | 05:21 AM