Share News

కరెంట్‌ కొనండి

ABN , Publish Date - Sep 24 , 2026 | 05:13 AM

ప్రస్తుతం రాష్ట్ర అవసరాలకు తగినట్లుగా విద్యుత్తును కొనుగోలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. ఎత్తిపోతల పథకాలకు ఎలాంటి ఆటంకం లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలని స్పష్టం చేశారు.

కరెంట్‌ కొనండి
Revanth Reddy

  • ఎత్తిపోతలకు ఆటంకాల్లేకుండా విద్యుత్తు

  • సాగు అవసరాలకూ నిరాటంకంగా సరఫరా

  • బొగ్గు కొరతతో విద్యుదుత్పత్తి ఆగడానికి వీల్లేదు

  • దసరాలోపు ‘యాదాద్రి’లో పూర్తిస్థాయి ఉత్పత్తి

  • రాష్ట్రంలో జీ-9 రకం బొగ్గు లభించనప్పుడు ఆ సాంకేతికతో యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ను ఎందుకు డిజైన్‌ చేసినట్టు?

  • మహానది కోల్‌ఫీల్డ్‌ నుంచి బొగ్గు కొనుగోలు,

  • లింకేజీ కోసం కేంద్రంతో చర్చలు జరపండి

  • విద్యుత్తుశాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం రాష్ట్ర అవసరాలకు తగినట్లుగా విద్యుత్తును కొనుగోలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. ఎత్తిపోతల పథకాలకు ఎలాంటి ఆటంకం లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలని స్పష్టం చేశారు. వ్యవసాయానికి అందిస్తున్న విద్యుతు సరఫరాలోనూ ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని నొక్కి చెప్పారు. బొగ్గు కొరత కారణంగా రాష్ట్రంలో విద్యుదుత్పత్తి ఆగడానికి వీల్లేదని, బయట నుంచి బొగ్గు కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని పవర్‌ ప్లాంట్లలో పూర్తి సామర్థ్యంతో విద్యుదుత్పత్తికి చర్యలు తీసుకోవాలని సూచించారు.


జెన్‌కోకు నాణ్యమైన బొగ్గు సరఫరా చేయాలని సింగరేణి అధికారులను ఆదేశించారు. బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో విద్యుత్తు శాఖపై రేవంత్‌ సమీక్ష నిర్వహించారు. దసరాలోపు యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లోని అన్ని యూనిట్లలో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్లాంట్‌కు అవసరమైన బొగ్గును ఒడిసాలోని మహానది కోల్‌ఫీల్డ్‌ నుంచి పొందడానికి వీలుగా, లింకేజీ కోసం కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ, కోల్‌ ఇండియాతో సంప్రదింపులు జరపాలని నిర్దేశించారు. యాదాద్రిలో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి జరగకపోవడానికి కారణాలపై ఆరా తీశారు. అయితే యాదాద్రిలోని యూనిట్లన్నీ కూడా జీ-9 రకం బొగ్గును మండించడానికి వీలుగా డిజైన్‌ చేసినవేనని, సింగరేణిలో జీ-9 రకం బొగ్గు లభించదని సీఎం అధికారులు నివేదించారు. రాష్ట్రంలో జీ-9 రకం బొగ్గు లభించకపోతే ఆ సాంకేతికతో యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం ఎలా చేపట్టారని సీఎం ప్రశ్నించారు.


దీనికి అధికారులు వివరణ ఇస్తూ.. ప్లాంట్‌కు అనుమతి పొందే క్రమంలో విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటామని అనుమతులు తెచ్చుకున్నట్లు చెప్పారు. యాదాద్రి పవర్‌ప్లాంట్‌ పర్యావరణ అనుమతులు సస్పెండయ్యాక సింగరేణి నుంచి బొగ్గు తెచ్చుకుంటామని కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖకు నివేదించడం జరిగిందని వారు చెప్పారు. సాధారణంగా థర్మల్‌ ప్లాంట్‌లన్నీ బొగ్గు గనుల పిట్‌హెడ్‌లో కట్టాలని కేంద్ర విద్యుత్తు సంస్థ (సీఈఏ) మార్గదర్శకాలు ఉన్నాయని, యాదాద్రికి 270 నుంచి 300 కి.మీ దూరంలో బొగ్గు బ్లాకులు ఉన్నాయని అధికారులు వివరించారు. సుదూర ప్రాంతం నుంచి బొగ్గును యాదాద్రికి తరలించడం వల్ల రానున్న 25 ఏళ్లలో రూ.40 వేల కోట్ల అదనపు భారం ప్రజలపై పడనుందని తెలిపారు. సింగరేణిలోని ఏ బ్లాకులో కూడా జీ-9 రకం బొగ్గు లేదని సింగరేణి అధికారులు వివరించారు.


గత ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనకపోవడం వల్లే జీ-9 రకం బొగ్గును సరఫరా చేయలేకపోతున్నామని చెప్పారు. సింగరేణిలో ఇప్పటికే 14 బొగ్గు బ్లాకులు మూతపడ్డాయని అధికారులు తెలిపారు. కాగా సాగు అవసరాల కోసం సోలార్‌ విద్యుదుత్పాదన జరుగుతున్న సమయంలోనే కరెంటు అందించాలని కేంద్ర ప్రభుత్వం డిస్కమ్‌లకు ఆదేశాలు ఇచ్చిందని సీఎంకు అధికారులు వివరించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సోలార్‌ అవర్‌లలోని వ్యవసాయానికి విద్యుత్తు అందించాలని కేంద్రం మార్గదర్శకాలు ఉన్నాయని నివేదించారు. కాగా రైతు డిస్కమ్‌ ఏర్పాటు ప్రక్రియపై కూడా అధికారులను ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఈఆర్‌సీ లైసెన్స్‌ ఇచ్చినందున ఎప్పట్లోగా రైతు డిస్కమ్‌ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తక్షణ మే లాంఛనాలన్నీ పూర్తి చేసి, రైతు డిస్కమ్‌ కార్యకలాపాలు ప్రారంభించాలని ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

3 డీఏలకు ఓకే

బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జిగా సునీల్‌ బన్సల్‌
Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 24 , 2026 | 05:13 AM