Share News

మళ్లీ అదానీనే నం.1

ABN , Publish Date - Sep 24 , 2026 | 05:34 AM

దేశంలో అత్యంత సంపన్నులుగా మళ్లీ అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ, ఆయన కుటుంబం నిలిచింది. రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ కుటుంబాన్ని వెనక్కి నెట్టి.

మళ్లీ అదానీనే నం.1

  • 9.23 లక్షల కోట్లతో భారత కుబేరుల్లో అగ్రస్థానం

  • రూ.8.63 లక్షల కోట్లతో రెండో స్థానంలో ముకేశ్‌

  • ఎం3ఎం హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2026 వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో అత్యంత సంపన్నులుగా మళ్లీ అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ, ఆయన కుటుంబం నిలిచింది. రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ కుటుంబాన్ని వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచింది. ఎం3ఎం హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2026 ప్రకారం.. అదానీ ఆయన కుటుం బ సంపద 13 శాతం పెరిగి రూ.9.23 లక్షల కోట్లకు (9,600 కోట్ల డాలర్లు) చేరుకుంది. ముకేశ్‌ అంబానీ ఆయన కుటుంబం సంపద మాత్రం 10 శాతం తగ్గి రూ.8.63 లక్షల కోట్లకు పరిమితమైంది. వీరి మధ్య సంపదలో వ్యత్యాసం రూ.59,400 కోట్లు గా ఉంది. ఆర్సెలార్‌ మిట్టల్‌కు చెందిన లక్ష్మీ నివాస్‌ మిట్టల్‌, ఆయన కుటుంబం మూడో స్థానంలో నిలిచింది. వీరి సంపద దాదాపు రెండింతలు పెరిగి రూ.3.39 లక్షల కోట్లకు చేరుకుంది. వ్యాక్సిన్‌ తయారీ సంస్థ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సైరస్‌ పూనావాలా ఆయన కుటుంబం నాలుగో స్థానంలో నిలువగా.. హెచ్‌సీఎల్‌కు చెందిన రోష్ని నాడార్‌ మల్హోత్రా, ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా, సన్‌ ఫార్మాసూటికల్స్‌ దిలీప్‌ సంఘ్వీ, విప్రో అజీమ్‌ ప్రేమ్‌జీలు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వేదాంత అనిల్‌ అగర్వాల్‌ ఆయన కుటుంబం రూ.2.08 లక్షల కోట్లతో తొమ్మిదో స్థానానికి ఎగబాకింది. టొరెంట్‌ ఫార్మా సమీర్‌ మెహతా ఆయన కుటుంబం పదో స్థానంలో నిలిచింది.

గౌతమ్‌ అదానీ 2022లో ముకేష్‌ అంబానీని దాటేసి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 2023లో మళ్లీ వెనుకపడ్డారు. 2024లో తిరిగి మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా 2025లో మళ్లీ ఆ స్థానాన్ని చేజార్చుకున్నారు. తాజాగా మళ్లీ మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు.


ఏఐ రంగం హవా

టెక్నాలజీ దేశంలోని సంపన్నుల జాబితాను మార్చుతోంది. హురున్‌ జాబితాలో కృత్రిమ మేధ (ఏఐ) తొలిసారిగా ఒక ప్రత్యేక రంగంగా ఆవిర్భవించింది. జాబితాలో స్థానం దక్కించుకున్న ఈ రంగానికి చెందిన 19 మంది వ్యక్తులు రూ.3.07 లక్షల కోట్ల సంపదను కలిగి ఉన్నారు. బెంగళూరుకు చెందిన క్యూపీఐఏఐ వ్యవస్థాపకుడు నాగేంద్ర నాగరాజ రూ.1,700 కోట్ల సంపదతో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ రంగం నుంచి ఈ జాబితాలో తొలి వ్యక్తిగా నిలిచారు.

  • జాబితాలో 70 శాతం మంది స్వయంకృషితో ఎదిగిన పారిశ్రామికవేత్తలే. ఐదేళ్ల క్రితం ఇది 55 శాతం ఉంది. దీంతో వీరి సంఖ్య 1,266కు చేరింది.

  • కొత్తగా సంపన్నుల జాబితాలో చేరిన వారి సంఖ్యాపరంగా ఇండస్ర్టియల్‌ ప్రొడక్ట్స్‌ రంగం 166 మందితో ముందుండగా.. 142 మందితో కెమికల్స్‌, 136 మందితో ఫార్మాసూటికల్స్‌ రంగాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

  • ముంబై దేశంలో సంపన్నులకు అతిపెద్ద కేంద్రంగా నిలిచింది. జాబితాలో ఇక్కడి నుంచి 465 మంది ఉన్నారు. 236 మందితో ఢిల్లీ, 129 మందితో బెంగళూరు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

  • జాబితాలో 33 మంది డాలర్‌ బిలియనీర్లు సహా 131 మంది మహిళలు ఉన్నారు. రోష్ని నాడార్‌ మల్హోత్రా దేశంలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు.

  • జాబితాలోని వారిలో 156 మంది విదేశాల్లో నివసిస్తున్నారు. వీరిలో 90 మంది అమెరికాలో, 31 మంది యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఉన్నారు.

1,810కి పెరిగిన సంపన్నులు

దేశంలో కనీసం రూ.1,000 కోట్ల సంపద కలిగిన సంపన్నుల సంఖ్య 1,810కి పెరిగింది. గత ఏడాదికన్నా ఈ ఏడాది వీరి సంఖ్య 128 మేర పెరిగింది. వీరి మొత్తం సంపద 12.8 శాతం పెరిగి రూ.187.5 లక్షల కోట్ల (సుమారు 1.96 లక్షల కోట్ల డాలర్లు)కు చేరుకుంది. ఇది దేశ జీడీపీలో దాదాపు సగభాగమని హురున్‌ పేర్కొంది. ఈ సంవత్సరంలో దేశంలో 27 మంది డాలర్‌ బిలియనీర్లు చేరారు. దీంతో వీరి సంఖ్య 391కి చేరుకుంది. ఐదేళ్ల క్రితం ఈ సంఖ్య 237గా ఉంది.


102-Business.jpg

101-Business.jpg

Updated Date - Sep 24 , 2026 | 05:34 AM