సిద్దిపేటలో సీఎం రేవంత్ చిల్లర ప్రసంగం
ABN , Publish Date - Nov 20 , 2026 | 05:36 AM
సిద్దిపేట సభలో ప్రగల్బాలు తప్ప.. ప్రజలకు సంబందించిన ఎజెండానే లేకుండా.. సీఎం రేవంత్‌రెడ్డి చిల్లర ప్రసంగం చేశారని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు విమర్శించారు.
బాడీ షేమింగ్ వెర్రివాగుడు తప్ప.. అక్కరకొచ్చేదేదీలేదు
ఏపీకి రోజుకు 2 టీఎంసీల నీళ్లు తీసుకెళ్లే కుట్ర: హరీశ్‌రావు
హైదరాబాద్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట సభలో ప్రగల్బాలు తప్ప.. ప్రజలకు సంబందించిన ఎజెండానే లేకుండా.. సీఎం రేవంత్‌రెడ్డి చిల్లర ప్రసంగం చేశారని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు విమర్శించారు. తాటి చెట్టు, గడ్డం.. అంటూ అడ్డగోలుగా బాడీ షేమింగ్ తప్ప, అక్కరకువచ్చే ముచ్చట ఒక్కటీ లేదని, సీఎం మాటల్లో వజన్‌లేదు.. చేతల్లో విజన్ లేదని గురువారం ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. భూమిలో బలంగా వేర్లు ఉండటం వల్లనే తాటిచెట్టు సమున్నతంగా ఎదుగుతుందని, ఈదురు గాలులు, తుఫాన్లు వచ్చినా ఉక్కులా నిలబడుతుందని, అదే కరువులో మొలిచే కాకిపడగ చెట్లకు తాటిచెట్టు విలువ తెలియదని ఎద్దేవా చేశారు. గౌడన్నల కల్ప తరువు తాటిచెట్టును పదే పదే తూలనాడినందుకు సీఎం క్షమాపణలు చెప్పాలన్నారు.
‘పార్టీ మారడం మీద నువ్ నన్ను ఒట్టేయమని అడగడం.. జిన్నా వచ్చి గాంధీ దేశభక్తి గురించి ప్రశ్నించడం.. రెండూ ఒకటే’ అని రేవంత్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. తెలంగాణ దేవుళ్లందరి మీద ఒట్లు వేసి, రైతన్నల నోట్లో మట్టి కొట్టిన రేవంత్.. దేవుళ్లను సైతం మోసం చేశారని, ఆ పాపం రాష్ట్రానికి కరువు శాపంగా మారిందని వ్యాఖ్యానించారు. శంకరమ్మకు కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిలబెడితే ఓడించింది.. కాంగ్రెస్ మంత్రివర్గంలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదా? అని ఆయన నిలదీశారు.
ప్రభుత్వ తప్పిదాన్ని ఒప్పుకున్న మంత్రి కోమటిరెడ్డి
నాగార్జునసాగర్ నుంచి ఏపీకి రోజుకు రెండు టీఎంసీల నీళ్లు తీసుకెళ్లే కుట్ర జరుగుతోందని హరీశ్ రావు ఆరోపించారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. సాగర్ నుంచి ఏపీకి నీళ్ల తరలింపు కోసం పెద్ద ప్రాజెక్టు కడుతుంటే ప్రభుత్వ దృష్టికి ఎందు తీసుకురాలేదని ఈఈ, ఎస్‌ఈలపై కోపానికి వచ్చానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డియే చెప్పారని, పరోక్షంగా ప్రభుత్వ తప్పిదాన్ని ఒప్పుకున్నారని అన్నారు. సాగర్ ఖాళీ అయితే నల్లగొండ జిల్లాకు తాగునీరు, సాగునీరు దొరకదని చెప్పారు. హైదరాబాద్‌కు తాగునీటి ప్రధాన వనరు నాగార్జునసాగరేనని, నీటిని దోచుకెళ్తే ఇక్కడి ప్రజలు వలసపోయే పరిస్థితి వస్తుందన్నారు. ఏపీ ప్రాజెక్టు పనులు చేపట్టినా నీళ్ల మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి తెలియకపోవడం దారుణమని, ఇంత జరుగుతుంటే ప్రభుత్వం మత్తు నిద్రపోతోందా అని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి...
సిరాజ్‌ను ఎందుకు పక్కన పెట్టారు?.. టీమిండియా ఎంపికపై గావస్కర్
హైదరాబాద్‌లో డ్రగ్స్ కింగ్‌పిన్ అరెస్ట్.. 51 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏ స్వాధీనం
Read latest Telangana News And Telugu NEws