Share News

రేవంత్.. నువ్వు ముఖ్యమంత్రివా లేక రియల్ ఎస్టేట్ ఏజెంటువా: హరీశ్ రావు

ABN , Publish Date - Aug 13 , 2026 | 09:54 AM

తెలంగాణలో ఎక్కడ పడితే అక్కడ భూముల అమ్మకాలు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భూముల అమ్మకాలపై ప్రశ్నలు సంధిస్తూ సీఎంకు హరీశ్ లేఖ రాశారు.

రేవంత్.. నువ్వు ముఖ్యమంత్రివా లేక రియల్ ఎస్టేట్ ఏజెంటువా: హరీశ్ రావు
Former Minister Harish Rao

హైదరాబాద్, ఆగస్టు 13: రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ భూముల అమ్మకాలు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భూముల అమ్మకాలపై ప్రశ్నలు సంధిస్తూ సీఎంకు హరీశ్ లేఖ రాశారు. ‘ఎక్కడ ప్రభుత్వ భూములు కనిపిస్తే అక్కడ అమ్మకాలేనా? నాడు ప్రభుత్వ భూములు పెద్దలు ఇచ్చిన జాతి సంపద అని ఉపన్యాసాలు దంచిన నువ్వు.. నేడు ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ వేలం వేస్తూ, ప్రజల ఆస్తులను అమ్మకానికి పెడుతున్నావు’ అంటూ ఫైర్ అయ్యారు.


కంచ గచ్చిబౌలి, లగచర్ల, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ నేడు రాయదుర్గ్ ఇలా ఎక్కడిక్కడ భూములు అమ్మే కుట్రలు చేస్తుండటం సిగ్గుచేటని మాజీ మంత్రి మండిపడ్డారు. రాయదుర్గ్ పన్మక్త గ్రామంలోని సర్వే నం.83/1లో 10.63 ఎకరాల హెరిటేజ్ భూమిని ఆగస్టు 17, 21 తేదీల్లో TGIIC వేలం వేయడానికి సిద్ధం కావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 2020లో ఇదే భూములపై రక్షణ కోరుతూ రేవంత్ కోర్టు మెట్లు ఎక్కారని గుర్తుచేశారు. ప్రతిపక్షంలో ఒక మాట.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాటనా అని ప్రశ్నించారు. హెరిటేజ్ భూములను కాపాడాల్సిన ప్రభుత్వం.. వాటినే వేలం వేసి అమ్మేందుకు ఎందుకు తొందరపడుతోందని నిలదీశారు.


ఇదే సర్వే నంబర్‌లో గతంలో 6.2 ఎకరాలు సుమారు ఎకరాకు 237 కోట్ల చొప్పున వేలం వేస్తే, ఎస్‌బీఐ కోర్టుకు ఎక్కిందని... ప్రస్తుతం ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉందని వెల్లడించారు. అయినా, అదే సర్వే నంబర్‌లో మరో 10.63 ఎకరాలను వేలం వేయడం వెనుక ఆంతర్యం ఏమిటని.. న్యాయ వ్యవస్థ అంటే గౌరవం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భూమిపై అనేక వివాదాలు ఉన్నాయని.. భూమి ఎవరిదో తేల్చకుండా వేలం వేయడం ఎందుకన్నారు. భూమి ఎవరిదో తేల్చలేని ప్రభుత్వం.. భూమిని అమ్మడానికి మాత్రం ఎందుకు తొందరపడుతోందని అడిగారు. రూ.2,000 కోట్ల విలువైన హెరిటేజ్ భూములను అమ్మే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారంటూ మండిపడ్డారు.


నాడు పీసీసీ అధ్యక్షుడిగా ప్రభుత్వ భూములను తెలంగాణ జాతి సంపదగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని..‘ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అమ్మబోము’ అన్న హామీ ఏమైందని నిలదీశారు. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ భూములను అమ్మబోమని చెప్పిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాటలకు విలువ లేదా అని అన్నారు. భూముల వేలంపై రేవంత్ రెడ్డి వైఖరి చూస్తుంటే ఊసరవెల్లి కూడా సిగ్గుపడే పరిస్థితి వచ్చిందని విమర్శించారు.


సుప్రీంకోర్టు కూడా ఆస్తిని పరిరక్షించడం, కొత్తగా third-party interests సృష్టించకుండా చూడాల్సిన అవసరాన్ని స్పష్టం చేసిందని హరీశ్ గుర్తుచేశారు. అలాంటి పరిస్థితుల్లో వివాదాస్పద భూమిని వేలం వేసి కొత్త హక్కులు సృష్టించడం ఏ విధమైన పరిపాలనా బాధ్యత అని ప్రశ్నించారు. ఆగస్టు 17, 21 తేదీల్లో జరగనున్న TGIIC వేలాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే సర్వే నం.83కు సంబంధించిన హెరిటేజ్, రెవెన్యూ, సర్వే, వక్ఫ్ రికార్డులన్నింటినీ బయటకు తీసి సమగ్రంగా విచారణ జరిపి, వాస్తవాలు నిగ్గు తేల్చాలన్నారు. హక్కులు, వివాదాలు తేలకముందే ఈ భూములను కొనుగోలు చేస్తే.. భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తప్పవని హెచ్చరించారు.


భవిష్యత్ తరాలకు అందించాల్సిన విలువైన హెరిటేజ్ భూములను అమ్మాలని చూడటం దారుణమని మాజీ మంత్రి అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిలా కాకుండా.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని హితవుపలికారు. అనుముల బ్రదర్స్ ప్రయోజనాల కోసం కాదని.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ముఖ్యమంత్రిగా ఉండాలని... లేదంటే చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని హరీశ్ రావు లేఖలో పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

మంత్రి సంధ్యారాణి మాజీ పీఏ ఆత్మహత్యాయత్నం

కారులో 25.970 కేజీల గంజాయి తరలింపు.. ఇద్దరి అరెస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 13 , 2026 | 10:06 AM