కేఆర్‌ఎంబీకి ఒక లెక్క.. ప్రజలకు మరో లెక్క చెబుతారా?
ABN , Publish Date - Oct 29 , 2026 | 06:18 AM
కృష్ణా జలాల వినియోగంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌పై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కృష్ణా జలాల వినియోగంపై ఉత్తమ్‌కు హరీశ్ కౌంటర్
హైదరాబాద్, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల వినియోగంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌పై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నీటి వినియోగానికి సంబంధించి వాస్తవాలను వెల్లడించకుండా తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కృష్ణా జలాల వినియోగంపై కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశానికి ప్రభుత్వం సమర్పించిన గణాంకాలు ఒకలా ఉంటే.. మంత్రి ఉత్తమ్ చెబుతున్న లెక్కలు మరోలా ఉన్నాయేంటని ప్రశ్నించారు.
ఈ మేరకు బుధవారం ఎక్స్ వేదికగా ఆయన కౌంటర్ ఇచ్చారు. ఆ రెండు లెక్కల్లో ఏది నిజమో, ఏది తప్పో మంత్రి ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కేఆర్‌ఎంబీకి సమర్పించిన గణాంకాలే నిజమైతే, మంత్రి చేసిన ట్వీట్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నట్లేనని వ్యాఖ్యానించారు. కృష్ణా జలాల వినియోగంపై ప్రజలకు వాస్తవాలు వెల్లడించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ చరిత్రలో కృష్ణా నీటిని అత్యంత తక్కువగా వినియోగించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకోకుండా దిగువకు విడిచిపెట్టి, ఇప్పుడు కుంటిసాకులు చెబుతున్నారని విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అప్రాధాన్య పోస్టుకు జయేశ్ రంజన్
ఆ జూనియర్ లెక్చరర్లను సర్వీసులోకి తీసుకోండి
Read Latest AP News And Telangana News And International News And Telugu News