కాలేశ్వరం, దేవాదుల నిర్వహణపై హరీశ్ సీరియస్.. మంత్రి ఉత్తమ్‌కు లేఖ
ABN , Publish Date - Apr 08 , 2026 | 11:13 AM
కాలేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల్లోని భారీ మోటార్లను నిబంధనలకు విరుద్ధంగా పదే పదే ఆన్, ఆఫ్ చేస్తూ అశాస్త్రీయంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. పంపులు, మోటార్లు పాడైపోయేలా కావాలనే ఇలాంటి కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 8: కాలేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి(Minister Uttam Kumar Reddy) మాజీ మంత్రి బహిరంగ లేఖ రాశారు. కాలేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల్లోని భారీ మోటార్లను నిబంధనలకు విరుద్ధంగా పదే పదే ఆన్, ఆఫ్ చేస్తూ అశాస్త్రీయంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పంపులు, మోటార్లు పాడైపోయేలా కావాలనే ఇలాంటి కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
భారీ నీటి పారుదల మోటార్లు నిరంతరాయంగా నడిచేలా డిజైన్ చేసినవని, వాటిని ఇష్టానుసారం స్టార్ట్-స్టాప్ చేస్తే తీవ్ర నష్టం తప్పదన్నారు. ఇలా పదే పదే ఆపడం వల్ల వైబ్రేషన్స్ వచ్చి పంపులు, ఇంప్లర్స్, మోటార్లు పాడైపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ విధంగా మోటార్లను పాడు చేయడం ఉద్దేశపూర్వకంగా జరుగుతోందా? గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెపం నెట్టేందుకే ఈ కుట్ర జరుగుతోందా? ఇది ప్రభుత్వ పాలనాపరమైన నిర్లక్ష్యమా? అని మాజీ మంత్రి ప్రశ్నించారు.
చందలాపూర్ సహా ప్యాకేజీ 6, 8, 10, 11, 12లలో మోటార్ల ఆపరేషన్ తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టులను ఇలా నిర్లక్ష్యంగా వాడటం శోచనీయమని మండిపడ్డారు. తక్షణమే మోటార్లను పదే పదే ఆన్, ఆఫ్ చేసే అశాస్త్రీయ విధానాన్ని ప్రభుత్వం మానుకోవాలని అన్నారు. ఇంజినీరింగ్ నిబంధనల ప్రకారం, డిజైన్‌కు అనుగుణంగా పంపులను నిరంతరాయంగా నడపాలని డిమాండ్ చేశారు. ‘మీ రాజకీయాల కోసం తెలంగాణ రైతుల జీవనాడి అయిన ఈ ప్రాజెక్టులతో చెలగాటం ఆడొద్దు’ అని హరీశ్ రావు లేఖలో హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...
బొలెరోను ఢీకొన్న డీసీఎం.. ఇద్దరి మృతి
లారీ ఢీకొని ముగ్గురు యువకుల మృతి
Read Latest Telangana News And Telugu News