తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీతో నీళ్లు తెస్తే రాజీనామా చేస్తా
ABN , Publish Date - Oct 27 , 2026 | 05:50 AM
తుమ్మిడిహట్టి నుంచి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలించడం అసాధ్యమని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలించి చూపిస్తే తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానన్నారు.
తీసుకురాలేకపోతే మీరు రాజీనామా చేస్తారా?
మంత్రి ఉత్తమ్‌కు హరీశ్‌రావు సవాలు
హైదరాబాద్, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): తుమ్మిడిహట్టి నుంచి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలించడం అసాధ్యమని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలించి చూపిస్తే తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానన్నారు. లేకపోతే నీటిపారుదల శాఖ మంత్రి పదవికి ఉత్తమ్‌కుమార్ రాజీనామా చేస్తారా.. అని సవాలు విసిరారు. గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీటిని ఎలా తరలిస్తారో ఉత్తమ్ చెప్పాలని, దీనిపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి బృందం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీ్‌సను కలిసిన నేపథ్యంలో హరీశ్‌రావు సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తుమ్మిడిహట్టి వద్ద తెలంగాణకు నీటి లభ్యత లేదని సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యుసీ) గతంలోనే స్పష్టంగా చెప్పిందని ఆయన గుర్తుచేశారు. ఒక్క ఎకరా కూడా ఆయకట్టులేని తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కోసం ఏకంగా రూ.25వేల కోట్లు ఖర్చుచేయడం ఎందుకని హరీశ్‌రావు ప్రశ్నించారు.
తుమ్మిడిహట్టి ప్రాజెక్టు డీపీఆర్‌ను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన 1,054 రోజుల తర్వాత రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు మహారాష్ట్రతో చర్చలకు వెళ్లిందని ఎద్దేవా చేశారు. ‘‘2014లో మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 42 రోజుల్లోనే మహారాష్ట్రకు పోయాం. ఆనాటి కాంగ్రెస్ మంత్రి హసన్ ముష్ర్‌ఫను కలిశాం. 152 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పుకోవాలని కోరాం’’ అని హరీశ్ తెలిపారు. ఇదిలా ఉండగా, తెలంగాణ కంటే ఏపీలో వర్ష లోటు ఎక్కువగా ఉందని, మరి అక్కడ క్రాప్ హాలీడే ఎందుకు లేదని హరీశ్‌రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమద్వారా ఎంతో చాకచక్యంగా నీటిని తరలించుకుపోతుంటే రేవంత్ సర్కారు దేవాదుల నుంచి నీటిని ఎందుకు ఎత్తలేకపోయిందని నిలదీశారు. దేవాదుల వద్ద పంపులు నడిపి ఉంటే వరంగల్ జిల్లాకు కరువు ఉండేది కాదన్నారు. శ్రీశైలంలో నీళ్లున్నా ఎందుకు ఎత్తిపోయడం లేదని ప్రశ్నించారు. కన్నెపల్లి వద్ద నీళ్లను ఎత్తిపోసే అవకాశం ఉన్నా కేవలం కేసీఆర్‌కు పేరు వస్తుందనే దుర్బుద్ధితో అక్కడి మోటార్లను ఆన్ చేయడం లేదని హరీశ్‌రావు ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
దేవాదాయ శాఖలో అక్రమాలపై.. విజిలెన్స్ నివేదికలు బుట్టదాఖలు
ఓటరు నమోదుకు గ్రాడ్యుయేట్ల నిరాసక్తి!
Read Latest AP News And Telangana News And International News And Telugu News