వరిసాగుతో కరీంనగర్ కళకళ
ABN , Publish Date - Oct 27 , 2026 | 05:41 AM
ఎల్‌నినో ప్రభావంతో వాతావరణం సహకరించకపోయినా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులు పట్టుదలతో మెరుగైన వరి ధాన్యం దిగుబడిని సాధిస్తున్నారు.
ఎల్‌నినో ఉన్నా రికార్డు స్థాయిలో వరి దిగుబడి..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 57.70 లక్షల ఎకరాల్లో సాగు
20.55 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా
కల్లాల వద్దే కొనుగోలుకు వ్యాపారులు, మిల్లర్ల పోటీ
క్వింటాలుకు రూ.2,900-4,500 వరకు చెల్లింపులు
మద్దతు ధరకంటే అధికం.. రైతుల్లో ఆనందం
కరీంనగర్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఎల్‌నినో ప్రభావంతో వాతావరణం సహకరించకపోయినా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులు పట్టుదలతో మెరుగైన వరి ధాన్యం దిగుబడిని సాధిస్తున్నారు. కరువు కాలంలో రాష్ట్రంలో ఆహార భద్రతకు భరోసానిస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద ఆరోవంతు వరి ధాన్యం ఇక్కడే చేతికి రానుండడం విశేషం. గతేడాది ఖరీఫ్ సీజన్‌తో పోల్చి చూస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరిసాగు కొంత తగ్గినప్పటికీ.. 20.55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది వానాకాలంలో 57.70 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయగా.. 1.19 కోట్ల మెట్రిక్ టన్నుల నుంచి 1.5 కోట్ల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. గత సంవత్సరం వానాకాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10,44,516 ఎకరాల్లో వరి సాగు చేయగా.. 22.76 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి నమోదైంది.
ఈ వానాకాలంలో వర్షాల్లేకపోవడంతో 9,31,506 ఎకరాలకే వరి సాగు పరిమితమైంది. వీటిలో ప్రభుత్వం బోనస్ ప్రకటించిన ఏడు సన్న వరి రకాలను 7,25,018 ఎకరాల్లో, కామన్ గ్రేడ్ దొడ్డు రకాలను 2,06,488 ఎకరాల్లో సాగు చేశారు. ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో ఈ ఏడాది తీవ్ర వర్షాభావం నెలకొనడం తెలిసిందే. దీంతో గతేడాదితో పోల్చితే వరిసాగు తగ్గింది. దీనికితోడు యాసంగిలో (రబీ సీజన్) వరిసాగు చేయొద్దని ప్రభుత్వం సూచిస్తుండడంతో.. మార్కెట్లో బియ్యం ధరలు గణనీయంగా పెరిగిపోయాయి. దీంతో కల్లాల వద్దే వరి ధాన్యం కొనుగోలుకు వ్యాపారులు, మిల్లర్లు పోటీపడుతున్నారు. ఫలితంగా రైతులకు గత సీజన్‌తో పోల్చితే మెరుగైన ధరలు దక్కుతున్నాయి.
జై శ్రీరామ్ రకం ధాన్యాన్ని రూ.4,100 నుంచి రూ.4,500.. ఇతర సన్న రకాలను రూ.3,300 రూపాయల వరకు, దొడ్డు రకాలకు రూ.2,900- 3,000 రూపాయల వరకు చెల్లించి రైస్ మిల్లర్లు, వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మరో 15 రోజుల్లో పంట నూర్పిడి ముమ్మరం కానుంది. దొడ్డు రకం క్వింటాలుకు రూ.2,441, ఏ-గ్రేడ్ ధాన్యానికి రూ.2,461 రూపాయలను మద్దతు ధర ప్రకటించగా.. సన్న రకాలను పండించిన రైతులకు క్వింటాలుకు అదనంగా రూ.500 బోన్‌సతో రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దీనికంటే అధిక ధరపై వ్యాపారులు కొనుగోలు చేస్తుండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
దేవాదాయ శాఖలో అక్రమాలపై.. విజిలెన్స్ నివేదికలు బుట్టదాఖలు
ఓటరు నమోదుకు గ్రాడ్యుయేట్ల నిరాసక్తి!
Read Latest AP News And Telangana News And International News And Telugu News