ఆ ఒప్పందం బయటపెడితే రాజీనామాకు సిద్ధం.. సీఎం రేవంత్‌కు హరీశ్ సవాల్
ABN , Publish Date - Jul 08 , 2026 | 01:05 PM
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెగిటివ్ మైండ్‌సెట్‌తో ఉన్నారని మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయమంటే ఎన్‌డీఎస్‌ఏ సాకు చెబుతున్నారని.. మరి సమ్మక్క బ్యారేజీ మోటార్లు ఎందుకు ఆన్ చేయడం లేదని ప్రశ్నించారు.
హైదరాబాద్, జులై 8: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెగిటివ్ మైండ్‌సెట్‌తో ఉన్నారని మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఈరోజు(బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. సీఎం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయమంటే ఎన్‌డీఎస్‌ఏ(NDSA) సాకు చెబుతున్నారని.. మరి సమ్మక్క బ్యారేజీ మోటార్లు ఎందుకు ఆన్ చేయడం లేదని ప్రశ్నించారు. ఈ నిమిషానికి సమ్మక్క బ్యారేజీ దగ్గర లక్ష క్యూసెక్కుల ప్రవాహం ఉందని చెప్పుకొచ్చారు. గోదావరి నీళ్లు తీసుకోవాలన్న కనీస సోయి లేదని విరుచుకుపడ్డారు. చెరువులు నింపుకునే అవకాశం ఉన్నా.. నింపడం లేదన్నారు. వరంగల్ జిల్లాలో 90 శాతం చెరువులు ఎండిపోయాయని, దేవాదుల మోటార్లు పూర్తిస్థాయిలో నడపడం లేదని తెలిపారు. మోటార్లు ఆన్ చేయకుండా.. నీళ్లను దిగువకు వదులుతున్నారని అన్నారు. గురుదక్షిణగా తెలంగాణ నీటిని ఏపీకి వదులుతున్నారని ఆరోపించారు.
అబద్ధాల్లో రేవంత్‌ను మించినవారు లేరు..
కాంగ్రెస్‌ది నేరపూరిత నిర్లక్ష్యమని మాజీ మంత్రి విమర్శలు గుప్పించారు. నీళ్లు ఉండి కూడా లిఫ్ట్ చేయకపోవడం క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటూ వ్యాఖ్యానించారు. క్రిమినల్ నెగ్లిజెన్స్‌కు పాల్పడిన రేవంత్, ఉత్తమ్‌ను ఉరితీసినా తప్పులేదన్నారు. అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే సీఎం రేవంత్ అని.. అబద్ధాల్లో ఆయనను మించినవారు లేరంటూ దుయ్యబట్టారు. నిన్నటి రేవంత్ ప్రసంగంలో సొల్లు తప్ప.. నిజం లేదని అన్నారు. తుమ్మిడిహెట్టికి అనుమతులున్నాయని అబద్ధాలు చెప్పారని.. అనుమతులుంటే తట్టెడు మట్టి ఎందుకు తీయలేదని నిలదీశారు. 8 ఏళ్లు కేంద్రం, రాష్ట్రం, మహారాష్ట్రలో అధికారంలో ఉండి ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. పనులు చేయకుండా తుమ్మిడిహెట్టి పేరిట రూ.2,328కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. నీటి పారుదల మంత్రిగా ఉత్తమ్, సీఎంగా రేవంత్ విఫలం అంటూ వ్యాఖ్యానించారు.
సీఎం రేవంత్‌కు సవాల్
‘తుమ్మిడిహెట్టికి మహారాష్ట్ర అనుమతి ఇచ్చి ఉంటే అగ్రిమెంట్ బయటపెట్టాలి. ఒప్పందం బయటపెడితే రాజీనామాకు సిద్ధం. లేకపోతే సీఎం రేవంత్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్ విసిరారు.
ఇవి కూడా చదవండి..
దివాలా రాష్ట్రమని ప్రచారం చేసే వారికి ప్రపంచబ్యాంకు నివేదికే సమాధానం: కేటీఆర్
సూర్యాపేటలో కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ.. పోలీసుల లాఠీఛార్జి
Read Latest Telangana News And Telugu News