తెలంగాణలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది: హరీశ్ రావు
ABN , Publish Date - Mar 29 , 2026 | 08:01 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై అనేక అక్రమ కేసులు బనాయించారని కాంగ్రెస్ నేతలపై హరీశ్ రావు విమర్శించారు. కౌశిక్‌రెడ్డిపై పగబట్టినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, మార్చి 29: సీఎం రేవంత్ రెడ్డి.. తన బావమరిది, తమ్ముడిపై ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. దీనిపై హౌస్ కమిటీ విచారణకు తాను సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. 'మీ తమ్ముడి అవినీతిపై విచారణకు సిద్ధమైతే.. నేనూ సిద్ధమే. మీ బావమరిది అమృత్ టెండర్లు, సింగరేణిలో అవినీతిపై కమిటీ వేసేందుకు నీవు సిద్ధమైతే.. దానికీ సిద్ధమే' అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఛాలెంజ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై హౌస్ కమిటీ, సీఐడీ విచారణలు వద్దని.. తామిద్దరమే కలిసి సిట్టింగ్ జడ్జి విచారణకు వెళ్దామంటూ సీఎంకు సవాల్ విసిరారు.
'సవాల్ చేసి అడుగుతున్నా.. విచారణకు సిద్ధమా?' అంటూ సీఎం రేవంత్‌ను హరీశ్ రావు సూటిగా ప్రశ్నించారు. తప్పు చేయకపోతే ఎందుకు తోక ముడుస్తున్నారు? అని నిలదీశారు. 20 కుంభకోణాలపై విచారణకు ప్రభుత్వానికి తాము లేఖ రాశామని హరీశ్ రావు గుర్తు చేశారు. సీఎం రేవంత్‌కు దమ్ముంటే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణాలపై తమ పోరాటం ఆపేదే లేదని బల్లగుద్ది మరీ చెప్పారు హరీశ్ రావు.
సమాధానం చెప్పలేకే.. సీఎం రేవంత్..: హరీశ్ రావు
మంత్రి పొంగులేటి కంపెనీ అవినీతికి పాల్పడిందని హరీశ్ రావు ఆరోపించారు. దీనిలో అవినీతి జరిగినట్లు సభలో సీఎం రేవంత్ అంగీకరించారని గుర్తుచేశారు. మైనింగ్‌లో తప్పు జరిగినట్లు నిండు సభలో సీఎం ఒప్పుకున్నారన్నారు. ఆధారాలతో పాటు మంత్రి పొంగులేటి దొరికిపోయారని పేర్కొన్నారు. అయినా ముఖ్యమంత్రి ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. దీనికి సమాధానం లేకనే.. సీఎం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు.
సీఐడీ.. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని దర్యాప్తు సంస్థ అని.. దీని విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావని హరీశ్ రావు అన్నారు. ఈ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మంత్రి పదవి నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలంటూ సీఎం రేవంత్‌ను డిమాండ్ చేశారు.
కౌశిక్‌రెడ్డిపై పగబట్టిన ప్రభుత్వం: హరీశ్ రావు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై అనేక అక్రమ కేసులు బనాయించారని హరీశ్ రావు విమర్శించారు. కౌశిక్‌రెడ్డిపై పగబట్టినట్లు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతులపై దాడి చేస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 'దళితులకు సీఎం రేవంత్ చేసిందేంటి?' అని ప్రశ్నించిన ఆయన.. దళిత, గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.
సభలో చెప్పలేని రీతిలో సీఎం రేవంత్ మాట్లాడుతున్నారని హరీశ్ చెప్పారు. శాసనసభ సభ్యత్వంపై అనర్హత వేయాలంటే.. రేవంత్‌పైనే వేయాలన్నారు. ఎథిక్స్ కమిటీ వేయాలంటే.. సీఎంపైనే వేయాలన్నారు. అసెంబ్లీ నడిపే తీరు ఇదేనా అంటూ ముఖ్యమంత్రిని నిలదీశారు. గంటల తరబడి అడిగినా అసెంబ్లీలో మైక్ ఇవ్వడం లేదని ఎమ్మెల్యే హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీసీటీవీ కెమెరా వైర్ అనుకుని కేబుల్ వైర్ కట్ చేసింది.. అంతే..
తల్లిదండ్రుల సంరక్షణ చట్టం బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
For More TG News And Telugu News