సీసీటీవీ కెమెరా వైర్ అనుకుని కేబుల్ వైర్ కట్ చేసింది.. అంతే..
ABN , Publish Date - Mar 29 , 2026 | 06:50 PM
జస్ట్ సీసీటీవీ కెమెరా వైర్ కట్ చేయబోయి.. పొరపాటున కేబుల్ వైర్ కట్ చేసింది. తన ఇంట్లో దొంగలు పడి160 గ్రాముల బంగారాన్ని దోచుకెళ్లిపోయారంటూ కట్టుకథ అల్లింది.
రాజమండ్రి, మార్చి 29: జస్ట్ సీసీటీవీ కెమెరా వైర్ కట్ చేయబోయి.. పొరపాటున కేబుల్ వైర్ కట్ చేసింది. తన ఇంట్లో దొంగలు పడి160 గ్రాముల బంగారాన్ని దోచుకెళ్లిపోయారంటూ కట్టుకథ అల్లింది. సీసీ టీవీ కెమెరా వైర్ కట్ చేశాగా.. ఇక తాను ఎవరికి దొరకనని అనుకుంది. కానీ తన ఇంట్లో బంగారం చోరీ జరగడం.. ఆ తర్వాత జరిగిన తతంగమంతా సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయింది. దీంతో పోలీసులకు చిక్కి జైలులో ప్రస్తుతం ఊచలు లెక్కిస్తోంది. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ సమీపంలోని కాపవరం శివారులో ఒక ఇంట్లో ఎం. పద్మ అనే మహిళ నివసిస్తోంది. ఆమె పిల్లలు ఇద్దరు విదేశాల్లో స్థిరపడ్డారు. గురువారం (26-03-26) అర్ధరాత్రి తన ఇంట్లో దొంగలు పడి 160 గ్రాముల బంగారం దోచుకెళ్లారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తాను నిద్రలో ఉండగా ముగ్గురు దుండగులు ముసుగులు ధరించి ఇంట్లోకి వచ్చారని.. మరో వ్యక్తి బయట కాపలాగా ఉన్నాడని ఫిర్యాదులో పేర్కొంది. వారి అలికిడితో తాను నిద్ర లేచానని పేర్కొంది. దుండగులు తన కాళ్లు చేతులు తాళ్లతో కట్టేశారని చెప్పింది. తన ఇంట్లోని లక్షల విలువైన 160 గ్రాముల బంగారాన్ని వారు దోచుకెళ్లారని చెప్పింది. అంతేకాకుండా.. తన ఇంట్లో దొంగలు గుడ్లు వండుకొని.. అన్నం కూడా తిన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె ఇంటిలోని సీసీ టీవీ కెమెరాలనే కాకుండా.. ఆ పరిసరాల్లోని సీసీ టీవీ కెమెరాలను సైతం పోలీసులు జల్లెడ పట్టారు.
సీసీ టీవీ కెమెరా అనుకుని కేబుల్ టీవీ వైర్ కట్ చేయడంతో.. దొంగతనం జరగలేదని పోలీసులు నిర్ధారించారు. సీసీ ఫుటేజ్ ఆధారాలతో ఫిర్యాదు చేసిన మహిలే దొంగతనం జరిగినట్లు చిత్రీకరించిందని పోలీసులు గుర్తించారు. ఆమెను నిలదీయడంతో నిజం ఒప్పుకుంది. ఆమెను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆమెపై గతంలో నేర చరిత్ర ఉన్నట్లు పోలీస్ దర్యాప్తులో వెల్లడయింది. దొంగతనం జరిగినట్లు నమ్మించడానికి ఉపయోగించిన పలు ఆధారాలను ఈ సందర్భంగా మీడియాకు పోలీసులు అందజేశారు. ఇన్సూరెన్స్ నగదు కోసం ఈ చోరీ జరిగిందని పద్మ విచారణలో వెల్లడించిందని పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తల్లిదండ్రుల సంరక్షణ చట్టం బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
హరీశ్‌తో జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్‌కు సీఎం సలహా: బండి సంజయ్
For More AP News And Telugu News