Share News

నిషేధిత జాబితాలోని ఉపశమనం ఏది?

ABN , Publish Date - Sep 13 , 2026 | 03:43 AM

‘‘రాష్ట్రంలో 22-ఏ నిషేధిత భూముల జాబితాలోని బాధితులకు ఎలాంటి ఉపశమనం కలగలేదు. అసెంబ్లీ సాక్షిగా ఆ జాబితా నుంచి తమ పేర్లను తొలగిస్తారని ఆశించిన బాధితులకు నిరాశే ...

నిషేధిత జాబితాలోని ఉపశమనం ఏది?
Harish Rao

  • పొంగులేటివన్నీ అబద్ధాలే

  • బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో 22-ఏ నిషేధిత భూముల జాబితాలోని బాధితులకు ఎలాంటి ఉపశమనం కలగలేదు. అసెంబ్లీ సాక్షిగా ఆ జాబితా నుంచి తమ పేర్లను తొలగిస్తారని ఆశించిన బాధితులకు నిరాశే మిగిలింది. ఉద్దేశపూర్వకంగానే శాసనసభ నుంచి మమ్మల్ని సస్పెండ్‌ చేశారు. 22 ఏ భూములపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అబద్ధాల ప్రవాహాన్ని పారించారు’’ అని మాజీ మంత్రి టి.హరీశ్‌ రావు మండిపడ్డారు. శనివారం తెలంగాణ భవన్‌లో 22ఏ పై విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్ని ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మొత్తానికి తప్పు జరిగిందని మంత్రి ఒప్పుకున్నారని, సమస్యను ఎప్పటిలోగా పరిష్కరిస్తారో ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు.


ఎంత బుకాయించినా చేసిన తప్పు నుంచి తప్పించుకోలేరని మంత్రి పొంగులేటిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలోనే నిషేధిత జాబితాలో భూములను పెట్టారని చెబుతున్న మంత్రి.. ఈ అంశంపై ఎందుకు క్షమాపణలు చెప్పారని, అధికారుల మీద నెట్టే ప్రయత్నం ఎందుకు చేశారని నిలదీశారు. బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యే చీర లాగారని, ఈ ఘటనపై క్షమాపణ చెప్పాలని, ఈ అంశంపై సభలో మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని కోరితే.. బీఆర్‌ఎస్‌ సభ్యులను సస్పెండ్‌ చేశారని ఆరోపించారు.


‘‘మా మామ.. ఓ భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. మా మామ రిటైర్డ్‌ బ్యాంకు అధికారి. 1995లో అప్పటి ప్రభుత్వం మాజీ సైనికుడు సత్యనారాయణకు భూమిని కేటాయించింది. ఆ తర్వాత ఆ భూమికి 2010లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్‌వోసీ ఇచ్చింది. దాని ఆధారంగా మా మామ చెక్‌ ఇచ్చి ఆ భూమిని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఈ భూమి విలువ 15 కోట్లు అంటున్నారు. 50 లక్షలు ఇస్తే ఆ భూమికి రిజిస్ట్రేషన్‌ చేసిస్తాం’’ అని హరీశ్‌ చెప్పారు.


పొంగులేటివి అహంకారపు మాటలు: పల్లా

మంత్రి పొంగులేటి చాలా అహంకారంతో మాట్లాడారని, కేసీఆర్‌, హరీశ్‌ రావు మీద ఆయన మాట్లాడటం అహంకారానికి పరాకాష్ట అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి మండిపడ్డారు. హరీశ్‌ రావును జనగామ తీసుకువెళ్లి ఆయన (పొంగులేటి) అక్రమాలు బయట పెట్టామని, దానివల్లే తన మీద కోపం పెంచుకున్నారని ఆరోపించారు. ‘‘వట్టినాగులపల్లిలో నేను కొనుగోలు చేసింది ఎకరం 10 గుంటలే. అక్కడ నా పేరు మీద 29 ఎకరాల భూమి ఉందని.. అది భూదాన్‌ భూమి అని ప్రచారం చేస్తున్నారు. ఆ భూమి నాది అని రుజువు చెయ్యాలి’’ అని సవాల్‌ విసిరారు. ఆ మొత్తం భూమి తనదేనని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. లేదం మంత్రి పొంగులేటి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

22ఏలో దొరల దోపిడీ
సురేఖనెందుకు తొలగించారు!?
Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 13 , 2026 | 03:43 AM