Share News

సాగులో సవాళ్లను అధిగమించేందుకు సహకరిస్తాం

ABN , Publish Date - Nov 26 , 2026 | 06:18 AM

తెలంగాణ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు తమవంతు సహకారం అందిస్తామని జర్మనీ ప్రతినిధుల బృందం పేర్కొంది.

సాగులో సవాళ్లను అధిగమించేందుకు సహకరిస్తాం

  • మంత్రి తుమ్మలతో భేటీలో జర్మనీ బృందం

  • గ్లోబల్‌ సమ్మిట్‌లో వ్యవసాయ రంగానికి ఐదు ప్రత్యేక సెషన్లు

హైదరాబాద్‌, నవంబరు 25, (ఆంధ్రజ్యోతి): తెలంగాణ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు తమవంతు సహకారం అందిస్తామని జర్మనీ ప్రతినిధుల బృందం పేర్కొంది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఆహార నిల్వ సదుపాయాలు, పరిశోధన, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ రంగాల్లో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. బుధవారం సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును జర్మనీ ప్రతినిధుల బృందం కలిసింది. వ్యవసాయ రంగంలో అందుబాటులో ఉన్న అవకాశాలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆ ప్రతినిధుల బృందంతో మంత్రి చర్చించారు.


తెలంగాణ నుంచి జర్మనీకి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను పెంచేందుకు అవసరమైన ప్రయత్నాలు చేయాలని ప్రతినిధులను తుమ్మల కోరారు. ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌--2026లో జర్మనీ ప్రతినిధుల బృందం పాల్గొని తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను పరిశీలించాలని ఆహ్వానించారు. కాగా రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి వ్యవసాయ పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దడంతోపాటు వ్యవసాయం, ఎరువులు, ఆహార శుద్ధి పరిశ్రమలు, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.


డిసెంబరు 7 నుంచి 9వ తేదీ వరకు హైదరాబాద్‌లోని భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో నిర్వహించనున్న గ్లోబల్‌ సమ్మిట్‌ నేపథ్యంలో బుధవారం సచివాలయంలో వ్యవసాయం, ఎరువులు, ఎఫ్‌ఎంసీజీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాల ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ పరిచయ సమావేశానికి తుమ్మల అధ్యక్షత వహించారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించేందుకు గ్లోబల్‌ సమ్మిట్‌లో 5 ప్రత్యేక సెషన్లను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు, ఆహార వ్యవస్థల్లో కృత్రిమ మేధ వినియోగం,భారతదేశానికి విత్తన రాజధానిగా తెలంగాణను బలోపేతం చేయడం, ఎఫ్‌ఎంసీజీ, ఫుడ్‌ బ్రాండ్ల తయారీ నుంచి మార్కెటింగ్‌ వరకు అభివృద్ధి, రైతును వ్యవసాయ పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దడం వంటి అంశాలపై సెషన్లు ఉంటాయని వివరించారు. గ్లోబల్‌ సమ్మిట్‌లో భాగంగా ఎక్స్‌ పో ఏరియా-1లో ‘ఫామ్‌ టు ఫోర్క్‌’ ఇతివృత్తంతో ప్రత్యేక అగ్రి ఎక్స్‌పోను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై కీలక ముందడుగు.. పోర్టులు, లాజిస్టిక్స్‌పై ప్రత్యేక దృష్టి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 26 , 2026 | 06:18 AM