Share News

భారత ఏకీకరణకు పటేల్ ఉక్కు సంకల్పమే కారణం: గజేంద్ర సింగ్ షెకావత్

ABN , Publish Date - May 31 , 2026 | 09:50 PM

సర్దార్ పటేల్ కేవలం ఒక చారిత్రక వ్యక్తి మాత్రమే కాదని, ఆయన ఒక 'కాలాతీత శక్తి' అని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అభివర్ణించారు. ‘బ్రిటిష్ పాలకులు భారత్‌ను 562 చిన్న చిన్న రాజ్యాలుగా విభజించి, దేశాన్ని బలహీనపరిచి వెళ్లాలని చూశారని పేర్కొన్నారు.

భారత ఏకీకరణకు పటేల్ ఉక్కు సంకల్పమే కారణం:  గజేంద్ర సింగ్ షెకావత్
Gajendra Singh Shekhawat

హైదరాబాద్, మే 31 (ఆంధ్రజ్యోతి): దేశ సమగ్రతకు ఉక్కు సంకల్పంతో పునాదులు వేసిన 'భారతరత్న' సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) 150వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. 'భారత్ భారతి' ఆధ్వర్యంలో జరిగిన ఈ ‘ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (Gajendra Singh Shekhawat) హాజరై ప్రసంగించారు.


సర్దార్ పటేల్ కేవలం ఒక చారిత్రక వ్యక్తి మాత్రమే కాదని, ఆయన ఒక 'కాలాతీత శక్తి' అని అభివర్ణించారు. ‘బ్రిటిష్ పాలకులు భారత్‌ను 562 చిన్న చిన్న రాజ్యాలుగా విభజించి, దేశాన్ని బలహీనపరిచి వెళ్లాలని చూశారని పేర్కొన్నారు. ఆ సమయంలో సర్దార్ పటేల్ తన అద్భుతమైన దౌత్యం, రాజనీతిజ్ఞత, ధైర్యంతో ఆ సంస్థానాలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చి, నేటి అఖండ భారతావనిని నిర్మించారని తెలిపారు. ఒకవేళ సర్దార్ పటేల్ లేకపోతే, నేడు మనం చూస్తున్న భౌగోళిక భారతం ఉండేది కాదని స్పష్టం చేశారు.


స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, మహాత్మా గాంధీ, వీర్ సావర్కర్ వంటి మహనీయుల బలిదానాల పునాదులపై మనకు స్వాతంత్య్రం వచ్చిందని చెప్పారు. ఇప్పుడు వారి ఆశయాలకు అనుగుణంగా, అభివృద్ధి చెందిన భారతావనిని నిర్మించడమే మన ముందున్న ప్రధాన లక్ష్యమని తెలిపారు. 140 కోట్ల మంది భారతీయులు ఈ సంకల్పాన్ని స్వీకరించి, దేశ పురోభివృద్ధిలో భాగస్వాములు కావాలని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పిలుపునిచ్చారు.


సర్దార్ పటేల్ సేవలు చిరస్మరణీయం:రామచందర్ రావు

ramachandar-rao-1.jpg

దేశ సమగ్రతకు సర్దార్ పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడంలో సర్దార్ పటేల్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. నిజాం పాలనలో హైదరాబాద్‌ను భారత్‌కు దూరం చేసే ప్రయత్నాలను ఆయన సమర్థంగా అడ్డుకున్నారని తెలిపారు. నేటి అఖండ భారత నిర్మాణానికి సర్దార్ పటేల్ దూరదృష్టి, దృఢ సంకల్పమే పునాదిగా నిలిచిందని ప్రశంసించారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ప్రతి భారతీయుడు స్మరించుకోవాలని సూచించారు. దేశ ఐక్యత, సమగ్రత, సామాజిక సామరస్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టడమే వారికి నిజమైన నివాళి అని రామచందర్ రావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కాంగ్రెస్‌లో కుమ్ములాటలు.. క్రమశిక్షణ కమిటీ విచారణ

సీఎం.. జేబులో కత్తెర, రిబ్బన్‌తో తిరుగుతున్నారు.. కేటీఆర్ సెటైర్లు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - May 31 , 2026 | 09:59 PM