Share News

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కిడ్నాప్.. కత్తితో బెదిరించి డాక్యుమెంట్లపై సంతకాలు

ABN , Publish Date - Oct 25 , 2026 | 08:23 PM

నగరంలోని గచ్చిబౌలిలో ఈరోజు (ఆదివారం) ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కిడ్నాప్ కలకలం రేపింది. పలు డాక్యుమెంట్లపై ఆ ఉద్యోగితో కిడ్నాపర్లు బలవంతంగా సంతకాలు చేయించినట్టు తెలుస్తోంది.

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కిడ్నాప్.. కత్తితో బెదిరించి డాక్యుమెంట్లపై సంతకాలు

హైదరాబాద్, అక్టోబర్ 25: నగరంలోని గచ్చిబౌలిలో ఈరోజు (ఆదివారం) ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కిడ్నాప్ కలకలం రేపింది. పలు డాక్యుమెంట్లపై ఆ ఉద్యోగితో బలవంతంగా కిడ్నాపర్లు సంతకాలు చేయించినట్టు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లికి చెందిన శ్యామ్ నాగ్ (31) గోపన్‌పల్లిలోని ఎన్టీఆర్ నగర్ హాస్టల్‌లో నివాసముంటున్నారు. ఆయన ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈరోజు తన చిన్ననాటి స్నేహితుడు భార్గవ్ రాజ్‌ను శ్యామ్ కలుసుకున్నారు. వీరు గోపన్‌పల్లి వైన్స్ పర్మిట్ రూమ్‌లో మద్యం సేవించారు. అనంతరం భోజనం చేసేందుకు ఇద్దరు స్నేహితులూ ఎన్టీఆర్ నగర్‌కు వెళ్లారు. అప్పుడే ఇన్నోవా కారులో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి శ్యామ్‌ను కిడ్నాప్ చేశారు. ఆయనను బలవంతంగా నిర్మానుష్యంగా ఉన్న నిర్మాణ భవనంలోకి తీసుకువెళ్లారు.


అయితే సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. బాధితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గచ్చిబౌలి సమీపంలో శ్యామ్‌ను గుర్తించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా తనను కిడ్నాపర్లు కత్తితో బెదిరించి డాక్యుమెంట్లపై సంతకాలు చేయించారంటూ శ్యామ్ నాగ్ వాపోయారు. భార్గవ్ రాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలూ చదవండి

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. ఫ్యాన్‌కు ఉరివేసుకుని..

హైదరాబాద్‌లో డిజిటల్ అరెస్ట్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.1.17 కోట్లు కాజేత

Updated Date - Oct 25 , 2026 | 08:27 PM