Share News

ఏపీకి తుపాను ముప్పు.. హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు

ABN , Publish Date - Oct 25 , 2026 | 11:22 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావంతో సోమవారం నుంచి విస్తారంగా వర్షాలు, మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉండటంతో హోంమంత్రి అనిత అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఏపీకి తుపాను ముప్పు.. హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
Andhra Pradesh

అమరావతి, అక్టోబర్ 25: ఏపీకి తుపాను ముప్పు ఉందని హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అతి తీవ్ర తుపానుగా బలపడే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు.. ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం హైఅలర్ట్‌లో ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశించారు.

సోమవారం నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపారు. బుధవారం బాపట్ల–విశాఖ తీరాల మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉందని.. ఆ సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, క్షేత్రస్థాయి అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రమాదకరంగా ఉన్న హోర్డింగులను వెంటనే తొలగించాలని.. అవసరమైతే తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.


తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచాలని హోంమంత్రి అనిత సూచించారు. జిల్లా కంట్రోల్‌ రూమ్‌ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు స్పష్టం చేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని, బీచ్‌లలోకి పర్యాటకుల ప్రవేశాన్ని నిషేధించాలని ఆదేశించారు. సముద్రంలో భారీ అలలు ఎగసిపడే ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకోవడం, ప్రమాదకర కార్యకలాపాలకు పాల్పడటం వంటివి చేయవద్దని ప్రజలకు సూచించారు. రైతులు, ప్రజలు తమ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, వాటిని ఇతరులకు పంపవద్దని హితవు పలికారు. విపత్తుల నిర్వహణ సంస్థ, ఆర్టీజీఎస్‌ జారీ చేసే అధికారిక హెచ్చరికలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఐపీఎస్‌ల సంతకాలు ఫోర్జరీ చేసి.. కోటికి పైగా కొల్లగొట్టి.. జల్సాలకు తగలెట్టి!

హుడా హైట్స్‌లో చ.గజం అప్‌సెట్‌ ధర 2 లక్షలు

రైతుపై గజ్వేల్‌ ఎస్సై దాడి ?

Read Latest AP News And Telangana News

Updated Date - Oct 25 , 2026 | 12:33 PM