గచ్చిబౌలిలో లెదర్ కామన్ ఫెసిలిటీ సెంటర్
ABN , Publish Date - Oct 25 , 2026 | 06:16 AM
రాష్ట్రంలో లెదర్ ఇండస్ట్రీని మరింత బలోపేతం చేయడంతో పాటు, ఔత్సాహిక ఎస్సీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు గచ్చిబౌలిలో ప్రత్యేకంగా కామన్ ఫెసిలిటీ సెంటర్ (సీఎఫ్‌సీ)ను ఏర్పా టు చేయనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
ఎస్సీ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో లెదర్ ఇండస్ట్రీని మరింత బలోపేతం చేయడంతో పాటు, ఔత్సాహిక ఎస్సీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు గచ్చిబౌలిలో ప్రత్యేకంగా కామన్ ఫెసిలిటీ సెంటర్ (సీఎఫ్‌సీ)ను ఏర్పా టు చేయనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్‌లో సుమారు వేయి మందికి ఉపాధి కల్పించేలా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పర్యావరణహిత చర్మశుద్ధి కర్మాగారాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
శనివారం సచివాలయంలో తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో లెదర్ ఇండస్ట్రీ అభివృద్ధికి, ఆర్టిజన్లను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎస్సీ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. అంతర్జాతీయ హంగులతో గచ్చిబౌలిలో హబ్ అండ్ స్పోక్ విధానంలో మూడున్నర ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న సీఎఫ్‌సీ ద్వారా రాష్ట్రంలోని ఆర్టిజన్ల ఉత్పత్తులకు అదనపు విలువను జోడిస్తామన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట, ఆర్మూర్‌లో మైక్రో స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ క్లస్టర్ డెవలె్‌పమెంట్ ప్రోగ్రాం కింద ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో జెన్ జీదే కీలకపాత్ర
‘భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో జెన్ జీ అత్యంత కీలకమైన పాత్రను పోషించనుంది. ఒక సమస్యకు జెన్ జీ ఓ పరిష్కారం కనుగొన్నారంటే అది ఖచ్చితంగా ఓ విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుడుతుంది. మీకు వచ్చిన వినూత్నమైన ఆలోచనలతో నూతన పరిష్కారాలను కనుగొనడానికి ప్రయోగాలు చేయండి’ అని శ్రీధర్ బాబు సూచించారు. జూబ్లీహిల్స్‌లోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో ‘డెవ్ ఫెస్ట్ 2026’ను నిర్వహించారు. దాదాపు 3,500 మంది ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, ఔత్సాహికులు పాల్గొన్నారు. శ్రీధర్‌బాబు డిజిటల్ రూపాన్ని (ఏఐ అవతార్) ఆవిష్కరించారు. తెలంగాణ ఏఐ మంత్రి పేరుతో ఈ డిజిటల్ రూపాన్ని తొలిసారిగా వేదికపై టెన్సెర్గో అనే కంపెనీ ప్రదర్శించింది. కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఈ ఏఐ అవతార్ తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రశ్నలకు సమాధానాలిచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి:
వారంలో అనుమతులివ్వకుంటే కాలేజీలు బంద్
పనిచేయండి.. లేకుంటే తప్పుకోండి!
న్యాయవాదుల సంక్షేమానికి ప్రాధాన్యం
Read Latest AP News And Telangana News And International News And Telugu News