ఉత్తర జిల్లాల్లో వరదలు.. దక్షిణాన కరువు
ABN , Publish Date - Aug 01 , 2026 | 06:59 AM
ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో జూలై చివరి వారం ప్రారంభమయ్యే వరకు కరువు పరిస్థితులు కనిపించాయి. ఇక వానకాలం సీజన్‌లో పంటలసాగు కష్టమేనని అంతా అనుకున్నారు. అన్ని జిల్లాల్లో అప్పటికే వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి కనిపించింది.
4 రోజుల్లో రాష్ట్రంలో సగటున 10 సెం.మీ. వర్షం
అయినా 12 జిల్లాల్లో ఇంకా లోటు వర్షపాతమే
నేడు, రేపు చాలాచోట్ల తేలికపాటి వర్షాలు
రాష్ట్రంలో చురుగ్గా నైరుతి రుతుపవనాలు
హైదరాబాద్, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో జూలై చివరి వారం ప్రారంభమయ్యే వరకు కరువు పరిస్థితులు కనిపించాయి. ఇక వానకాలం సీజన్‌లో పంటలసాగు కష్టమేనని అంతా అనుకున్నారు. అన్ని జిల్లాల్లో అప్పటికే వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి కనిపించింది. కానీ, ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనానికి తోడు నైరుతి రుతుపనాలు కూడా చురుగ్గా ఉండటంతో వర్షాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. అయితే, దక్షిణ తెలంగాణలో జల్లులు తప్ప చెప్పుకొదగ్గ స్థాయిలో వర్షాలు పడలేదు. దీంతో జూలై 31 ఉదయం వరకు 12 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. జూలై 26 నాటికి 26 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉండగా, 31 నాటికి 12 జిల్లాలకు తగ్గింది. జూన్‌లో సగటు వర్షపాతం 13 సెంటీమీటర్లు కాగా, 11.5 సెంటీమీటర్లు నమోదైంది. జూలైలో 26వ తేదీ నాటికి సగటు వర్షపాతం 20.3 సెంటీమీటర్లు కాగా, 11.9 సెంటీమీటర్ల వర్షమే కురిసింది. మొత్తంగా జూన్ 1 నుంచి జూలై 26 వరకు సగటు వర్షపాతం 33.4 సెంటీమీటర్లు అయితే, 23.5 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైంది.
అల్పపీడనం కారణంగా జూలై 26 తర్వాత లోటు తగ్గింది. నాలుగురోజుల్లో 10 సెంటీమీటర్ల వర్షం కురవటంతో జూలైలో 22.7 సెంటీమీటర్ల సగటు వర్షపాతానికి గాను 22.4 సెంటీమీటర్లు నమోదైంది. జూన్ 1 నుంచి జూలై 31 వరకు సగటు వర్షపాతం 35.7సెంటీమీటర్లు కాగా, 33.9 సెంటీమీటర్లు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. మండలాలవారీగా చూస్తే జూలై 26 నాటికి 397 మండలాల్లో 20-59ు లోటు వర్షపాతం నమోదు కాగా, 51 మండలాల్లో 60-99ు తీవ్రలోటు రికార్డు అయింది. 3 మండలాల్లో అత్యధికం, 25 మండలాల్లో అధికం, 145మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. శుక్రవారం నాటికి తీవ్రలోటు 14మండలాల్లో ఉండగా, లోటు 234 మండలాల్లో, 253 మండలాల్లో సాధారణం, 106 మండలాల్లో అధికం, 14 మండలాల్లో అత్యధిక వర్షపాతం రికార్డయ్యింది. 17జిల్లాల్లో సాధారణం, 12 జిల్లాల్లో లోటు, 4 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్లు రాష్ట్ర ప్లానింగ్ సొసైటీ తెలిపింది. నారాయణపేట, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల, మహబూబాబాద్, వనపర్తి, యాదాద్రి, సూర్యాపేట, మేడ్చల్, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది.
రాష్ట్రంలో నైరుతి రుతుపనాలు చరుగ్గా ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. శని, ఆదివారాల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు.. మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, వరంగల్ జిల్లాల్లో సాధారణ వర్షాలు కురిసినట్లు పేర్కొంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 96 మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌లో అత్యధికంగా 14 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.